హుజురాబాద్‌లో నిలిచిపోయిన కుల సంఘాల భవన నిర్మాణం
అడుగు ముందుకు పడని
ఆటోనగర్ అభివృద్ధి
ప్రారంభం కాని జర్మలిస్టుల
కాలనీ నిర్మాణం
ముఖం చాటేసిన మంత్రులు
ప్రజాపక్షం /కరీంనగర్ /హుజురాబాద్
హుజురాబాద్ శాసనసభ ఉప ఎన్నిక సందర్భంగా టిఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గానికి పలు హామీలు ఇచ్చి అభివృద్ధిని మరిచిపోయిందని, మంత్రి మాట ఉత్తదేనని పట్టణ వాసులు ఎద్దేవా చేస్తున్నారు. ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పలువురు రాష్ట్ర మంత్రులు నియోజకవర్గంలో పర్యటించి ఇబ్బడి ముబ్బడిగా హామీల వర్షం కురిపించారు. ఎన్నిక ముగిసి ఆరు నెలలు కావస్తున్నా మంత్రులు హామీ ఇచ్చిన కుల సంఘాల భవనాలు, జర్నలిస్టుల కాలనీ నిర్మాణం, ఆటోనగర్ అభివృద్ధి తదితర పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఉప ఎన్నిక నేపథ్యంలో పలువురు మంత్రులు నియోజకవర్గంలో పర్యటించి ప్రచారం నిర్వహించగా, ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ గెలవడంతో ఇప్పుడు ఎవరూ పట్టించుకోకుండా ముఖం చాటేశారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వేళ జిల్లా మంత్రితో పాటు పలువురు మంత్రులు ఇచ్చిన హామీలు ఉత్తవేనా, ఎన్నికల కోసమే హామీలు ఇచ్చారా, ఇతర పార్టీల అభ్యర్థులు గెలిచిన నియోజకవర్గాన్ని టిఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోదా అని ప్రజలలో చర్చ జరుగుతున్నది. పట్టణ కేంద్రంలో పలు కుల సంఘాల నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు కుల సంఘాల భవన నిర్మాణాలకు హామీ ఇవ్వడంతో పాటు స్థలాలు కేటాయించి శంఖుస్థాపన చేసినా నేటికీ అవి ఆచరణకు నోచుకోలేదని కుల సంఘాల నేతలు చెబుతున్నారు.
అడుగు ముందుకు పడని ఆటోనగర్ పనులు ః
కరీంనగర్- వరంగల్ ప్రధాన రహదారిలో హుజురాబాద్ శివారు ప్రాంతంలో ఎస్‌ఆర్‌ఎస్‌పి కెనాల్ పక్కన ఆటోనగర్ కోసం సుమారు 10 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో శిలాఫలకం ఏర్పాటు చేసి కెసిఆర్ ఆటోనగర్ అని నామకరణం చేశారు. హుజురాబాద్ పట్టణానికి చెందిన మెకానిక్‌లు, ఆటోమొబైల్ షాపులు నడుపుకునే 300 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారి అందరికీ షెడ్లు నిర్మించి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు మంత్రి గంగుల కమలాకర్ ఇటు వైపు కన్నెత్తి చూడటం లేదని పలువురు మెకానిక్‌లు విమర్శిస్తున్నారు.
ప్రారంభం కాని జర్నలిస్టుల కాలనీ నిర్మాణం ః
హుజురాబాద్ పట్టణ పరిసర ప్రాంతంలో ఎస్‌ఆర్‌ఎస్‌పి కెనాల్ పక్కన జర్నలిస్టుల కాలనీ కోసం ప్రభుత్వం మూడు ఎకరాల స్థలాన్ని కేటాయించింది. భూమిని చదును చేసి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు శంఖుస్థాపన చేశారు. ఆ స్థలంలో ప్రభుత్వమే జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తుందని ఉప ఎన్నిక నియోజకవర్గ ఇంఛార్జి, మంత్రి హరీష్‌రావుతో పాటు జిల్లా మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. నేటికీ ఆ పనులు ప్రారంభం కాలేదని పలువురు జర్నలిస్టులు చెబుతున్నారు.
మంత్రి మాట ఉత్తదే…
RELATED ARTICLES