కెటిఆర్ సన్నిహితులకు మంత్రి పదవులు దక్కే అవకాశం?
ప్రజాపక్షం/ హైదరాబాద్ : సిఎం కెసిఆర్ మంత్రివర్గ కూర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రెండవ సారి కొలువు దీరి న టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఇది వరకు మంత్రివర్గంలో ఉన్న వారిలో ఎంత మందికి అవకాశం దక్కుతుందనేది ఎవరికివారు అంచనా వేసుకుంటున్నారు. మరోసారి మంత్రివర్గం లో చోటు దక్కించుకోవాలని మాజీ మంత్రు లు, కొత్తగా మంత్రి వర్గంలో చేరేందుకు ఇం కొందరు ఇలా ఎవ్వరికి వారు ఆసక్తిచూపుతున్నారు. కెటిఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్నవారిలో కొత్తవారికి ఈ సారి మంత్రి వర్గంలో చోటు దక్కవచ్చనే ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో అన్ని వర్గాలు, అన్ని సమీకరణలను దృష్టిలో పెట్టుకునే కెసిఆర్ మంత్రివర్గాన్ని కూర్పు చేయనున్నట్లు తెలిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఓడిపోయారు. ఈ జిల్లాలో టిఆర్‌ఎస్ నుంచి పువ్వాడ అజయ్ కుమార్ ఒకరే గెలుపొందారు. దీంతో పువ్వాడ అజాయ్‌ను మంత్రివకర్గంలో తీసుకునే అవకాశం ఉన్నదనే ప్రచారం జరుగుతోంది. అలాగే టిఆర్‌ఎస్ ప్రభుత్వం లో మంత్రులుగా పనిచేసిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా అజ్మీర చందూలాల్, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావులు ఓడిపోయిన విషయం తెలిసిందే.
దీంతో మిగతా మాజీలు కల్వకుంట్ల తారకరామారావు, టి.హరీశ్‌రావు, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జి.జగదీశ్‌రెడ్డి, జోగురామన్న, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావుగౌడ్, డాక్టర్ లక్ష్మారెడ్డిలు తిరిగి ఎన్నికయ్యారు. అయితే ఇందులో పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఈటల రాజేందర్, శాససనసభ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేదేందర్ రెడ్డి పేర్లు స్పీకర్ పదవి పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే మాజీ డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డిలు కూడా మరోసారి అవకాశం లభిస్తుందనే ఆశలో ఉన్నారు. కెటిఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్నవారికి అవకాశం లభించనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంత్రివర్గంలోనికి కొత్తగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, బాల్కసుమన్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, సి.హెచ్ మల్లారెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఈసారి మంత్రివర్గంలో మహిళలకు అవకాశం ఇవ్వనున్న నేపథ్యంలో గొంగిడి సునీత, రేఖనాయక్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. మంత్రి లేదా స్పీకర్‌గా ఏదో ఒక పదవికి పద్మాదేవేందర్ రెడ్డి పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సీనియర్‌లలో ఎవరికి శాసనసభ స్పీకర్ పదవిని అప్పగిస్తారనేది పార్టీలో ఆసక్తిగా మారింది.