ఈ ఎన్నికల్లో మెరిటే ప్రామాణికం కానుందా…?
రంగంలోకి దిగిన ఆశావహులు
ప్రజాపక్షం/హైదరాబాద్: మంత్రి పదవి దక్కాలంటే ఈ అగ్ని పరీక్షను ఎదుర్కోవాల్సిందే. ఇందులో పాస్ అయితే చాలదు, పోటీలో ఉన్న మిగిలిన వారి కంటే ఎక్కువ మార్కులు సాధించాలి. మంత్రి పదవి కోసం పరీక్ష ఏంటి, కొత్తగా ఉంది అనుకుంటే పొరపాటే. కాని ఇది నిజం, ఇప్పుడు రాష్ట్రంలో మంత్రి పదవుల కోసం రేసులో ఉన్న నియోజకవర్గాల్లో ఇదే హాట్‌టాపిక్. కారణం ఆయా నియోజకవర్గాల్లో గెలిచిన అధికార పార్టీ ఎంఎల్‌ఎలు సర్పంచ్ పదవుల రేసులో ఉన్న తమ పార్టీ అభ్యర్థుల కంటే కూడా ఎక్కువగా కష్టపడుతున్నారు. ఎవరెక్కువ పంచాయతీలను టిఆర్‌ఎస్ ఖాతాలో వేస్తారో వారి పేర్లనే మంత్రి పదవుల కోసం పరిశీలిస్తారని, ఈ ‘పంచాయతీ’ పరీక్షలో సాధించిన మెరిట్ ప్రకారమే మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందన్న ప్రచారం ఇప్పుడు పల్లెల్లో జోరుగా సాగుతోంది. అందుకు తగ్గట్టుగానే ఏకగ్రీవాల కోసం ఆరాటపడుతూ ఆపసోపాలు పడుతున్న ఎంఎల్‌ఎల తీరు ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తోంది. నిజానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే పంచాయ తీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే అప్పుడు అధికార పార్టీ సిట్టింగ్ ఎంఎల్‌ఎలు, మంత్రులతో పాటు టిక్కెట్ ఆశిస్తున్న అధికారపార్టీ నేతలు పంచాయతీ ఎన్నికలు ఇప్పుడే వద్దని పట్టుపట్టారని సమాచారం. అప్పుడే పెడితే సర్ప ంచ్, వార్డు సభ్యుల గెలుపు కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుందని, లేనట్లయితే అసెంబ్లీ ఎన్నికల్లో వారు తమకు సహకరించరని భావించారట. అందుకే పంచాయతీ ఎన్నికలు వాయిదా పడేటట్లు ప్రభుత్వ వ్యవహరించిందన్న ప్రచారం అప్పట్లో జరిగింది. తాజా ఎన్నికల్లో మళ్ళీ గెలిచి పార్టీ అధికారంలోకి రావడం జరిగిపోయినా సమయానికి మంత్రి వర్గ విస్తరణ జరగకపోవడం కొంత మంది అధికార పార్టీ నేతలు ఇప్పుడు ‘పంచాయతీ’ ఎదుట ఇలా ఇరుక్కుపోయారు. పార్టీ అధిష్టానం నుంచి ఇలాంటి సంకేతాలు, సూచనలు ఎవరికి జారీ కాకపోయినప్పటికి మంత్రి పదవుల రేసులో ఉన్న వారు మాత్రం ఇది నిజం, పంచాయతీ ఎన్నికల ఫలితాలు తమకు దక్కే పదవిపై ప్రభావం చూపెడుతాయని మాత్రం వందశాతం నమ్ముతున్నారు.