- ఎవరు ఉండాలనే విషయంపై అధిష్టానానిదే తుది నిర్ణయం
- నేను ఎవరినీ ప్రతిపాదించను
- ప్రతిపక్షనాయకుల కేసుల విషయంలో చట్టప్రకారమే ముందుకు
- కులగణన ఆషామాషీగా చేసింది కాదు
- ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం
- రెండురోజుల్లో టిపిసిసి కార్యవర్గం కొలిక్కి
- పార్టీ ,పార్టీనేతల మనోభావాలకు అనుగుణంగా ఉంటా
- ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్టిలో సిఎం రేవంత్రెడ్డి
- ఎఐసిసి అధ్యక్షుడు ఖర్గేతో భేటీ
- కేబినేట్ విస్తరణ, నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
ప్రజాపక్షం / హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్టేనని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ అన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. “మంత్రివర్గంలో ఎవరు ఉండాలనేది అధిష్టానానిదే తుది నిర్ణయం. నేను ఎవరి పేరు ప్రతిపాదించట్లేదు. ప్రతిపక్ష నేతలపై కేసుల విషయంలో చట్ట ప్రకారమే ముందుకు వెళతాం. త్వరగా అరెస్టు చేయించి జైలులో వేయాలనే ఆలోచన మాకు లేదు. నాకు ఉన్న అవకాశం మేరకు అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తున్నాం. కులగణన ఆషామాషీగా చేసింది కాదు.. ఎంతో పకడ్బందీగా చేశాం. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని కులగణన సర్వే చేశాం. కులగణనతో ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం లభించినట్లు అయింది. టిపిసిసి కార్యవర్గ కూర్పు కొలిక్కి వచ్చింది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో ప్రకటన ఉంటుంది” అని సిఎం రేవంత్ చెప్పారు. ‘రాహుల్ గాంధీ అపాయింట్ తాను కోరలేదు. రాహుల్ నా అనుబంధంపై తెలియనివాళ్లు మాట్లాడితే నాకేంటి. ప్రభుత్వం, పార్టీలో కీలక నిర్ణయాలు అధిష్ఠానం దృష్టిలో ఉంటాయి. పార్టీ, పార్టీ నేతల మనోభావాలకు అనుగుణంగానే ఉంటాను. వ్యక్తిగత నిర్ణయాలు ఎప్పుడూ ఉండవు. పార్టీ ఇచ్చిన పని పూర్తి చేయడమే నా లక్ష్యం. పని చేసుకుంటూ పోవడమే నాకు తెలుసు. ప్రతి ఒక్క విమర్శకు స్పందించాల్సిన అవసరం లేదు’ అని రేవంత్ అన్నారు. కులగణనలో బిసిలు ఐదున్నర శాతం పెరిగారని, బిసిలు పెరిగిన విషయాన్ని లెక్కలతో సహా చూశాక బిజెపి ఎంఎల్ పాయల్ శంకర్ అసెంబ్లీలో అంగీకరించారని అని సిఎం చెప్పారు. కాగా అంతకు ముందు పార్లమెంట్ ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సందర్భంగా చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, పార్టీ పని తీరు, తాజా రాజకీయ పరిస్థితులపై ఖర్గేకు ముఖ్యమంత్రి వివరించినట్లు సమాచారం. సిఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి ఎన్.ఉత్తంకుమామార్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షులు బి.మహేష్ గౌడ్ చర్చల్లో పాల్గొన్నారు. ఎస్ వర్గీకరణ, కుల గణన అంశాలపై కూడా వారు చర్చించినట్లు సమాచారం. తెలంగాణలో ఎస్ వర్గీకరణను అమలు చేయాలని నిర్ణయించినట్లు ఖర్గేకు వారు తెలిపారు. సూర్యాపేటలో ఈ నెలలో నిర్వహించనున్న కుల గణన బహిరంగ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఎస్ వర్గీకరణకు సంబంధించి ఏప్రిల్ గజ్వేల్ సభ నిర్వహిస్తున్నామని, ఈ సభకు రావాలని ఖర్గేను ముఖ్యమంత్రి కోరారు.
టిపిసిసి కార్యవర్గానికి గ్రీన్ సిగ్నల్?
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) కార్యవర్గం ప్రకటించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఆమోదముత్ర వేసింది. ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా టిపిసిసి కార్యవర్గం ప్రకటించనున్నారు. అందులో సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుని ఒక మాదిగ, ఒక ముస్లిం, ఒక లంబాడా, ఒక రెడ్డి వర్గాలతో నలుగురు కార్యనిర్వాహక అధ్యక్షులు ఉండనున్నట్లు తెలుస్తోంది. టిపిసిసి కార్యవర్గంలో 15 నుంచి 20 మంది వరకు ఉపాధ్యక్షులు ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులపై కూడా కెసి వేణుగోపాల్ జరిగిన చర్చల్లో కసరత్తు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.