ఆర్‌టిసి సమ్మె, కొత్త సచివాలయ భవనం, నూతన రెవెన్యూ చట్టంపై సుదీర్ఘ చర్చ
ప్రజాపక్షం/ హైదరాబాద్: కొత్త రెవెన్యూ చట్టం, ఉద్యోగుల ఐఆర్, సచివాలయ తరలింపు, ఆర్‌టిసి సమ్మె తదితర కీలక అంశాలపై రాష్ట్ర మంతి వర్గం చర్చించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంగళవారం ప్రగతి భవన్‌లో సాయంత్రం సుమారు నాలుగు గంటలకు ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం రాత్రి 11 గంటల వరకు కొనసాగింది. సుమారు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సుదీర్ఘపాటు చర్చించారు. ఆర్‌టిసి సమ్మె, నూతన రెవెన్యూ చట్టం, కొత్త సచివాలయం నిర్మాణం, మున్సిపాలిటి ఎన్నికలు తదితర అంశాలపై మంత్రి వర్గంలో సుధీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. ఆర్‌టిసిని మూడు జోన్‌లుగా చేసే అంశంపై కూడా చర్చ సాగిందని సమాచారం. వివిధ శాఖల్లో మంజూరు చేసిన పోస్టుల భర్తీకి మంత్రి వర్గం ఆమోదముద్ర వేసినట్లు తెలిసింది. సచివాలయ తరలింపుపై హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగలడంతో తీసుకోవాల్సిన న్యాయపరమైన చిక్కులు, అంశాలపై ఆరా తీసినట్లు తెలిసింది. అలాగే ప్రగతి భవన్ వద్ద మీడియా సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పడిగాపులు పడ్డారు.
హుజూర్‌నగర్ ఉప ఎన్నిక : హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారడంతో ఈ అంశంపై కూడా ముఖ్యమంత్రి మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమైనట్లు తెలిసింది. ఎన్నికల వ్యూహం, ప్రచారశైలి, ప్రచార అంశాలు, తదితర అంశాలపై చర్చ జరిగినట్లు తెలిసింది.