జగిత్యాలలో ముగ్గురి దారుణ హత్య
జనగామలో ఇద్దరికి తీవ్ర గాయాలు
ప్రజాపక్షం / జగిత్యాల బ్యూరో మంత్రాలు చేస్తున్నారనే నెపంతో పలువురిపై కత్తులతో దాడి చేసిన రెండు వేర్వేరు సంఘటనలు రాష్ట్రంలో గురువారం చోటుచేసుకున్నాయి. ఒక ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోని తారకరామనగర్‌లో మంత్రాలు చేశారనే నెపంతో గుర్తు తెలియని వ్యక్తులు ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకొడుకులను దారుణంగా హతమార్చారు. కాలనీలో కుల సంఘం సమావేశం జరుగుతుండగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తండ్రీకొడుకులైన నాగేశ్వర్‌రావు (50), రాంబాబు (40), రమేష్ (30)లను ప్రత్యర్థులు కత్తులతో కిరాతకంగా నరకడంతో వారు అక్కడికక్కడే మరణించారు. విషయం తెలుసుకున్న జగిత్యాల జిల్లా ఎస్‌పి సింధుశర్మ, అడిషనల్ ఎస్‌పి రూపేష్‌లు ఘటనా స్థలానికి చేరుకుని హత్యలకు సంబంధించిన వివరాలను జగిత్యాల డిఎస్‌పి ఆర్.ప్రకాష్‌ను అడిగి తెలుసుకున్నారు. ఇందుకు బాధ్యులైన వారి కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. కాగా నాగేశ్వరరావు కుటుంబంపై పాత కక్షలతో కోపం పెంచుకున్న ప్రత్యర్థులు అదునుచూసి దాడి చేసి హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో తారకరామనగర్ కాలనీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. “ఆరు నెలలకోసారి గ్రామంలో కుల సంఘం సమావేశం జరుగుతుంది. ఆడవాళ్లమంతా ఓ చోట ఉన్నాం. సమావేశంలో ఒక్కసారిగా ముగ్గురిపై వారంతా కత్తులు, మారణాయుధాలతో దాడి చేసి దారుణంగా పొడిచారు. మేము ఏ తప్పూ చేయలేదు. మాకు ఏ పాపం తెలియదు. ఎందుకు చంపారో కూడా తెలియదు. గతంలోనూ సిరిసిల్లలో ఇలాగే మా ఇంటి సభ్యుడిపై దాడి చేశారు.” అని మృతుల కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు.
జనగామలో తండ్రీకొడుకులపై కత్తులతో దాడి
వరంగల్ టౌన్ : మంత్రాలు చేస్తున్నారనే నెపంతో తండ్రీకొడుకులపై దాడి చేసిన మరో సంఘటన జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలం తీగారంలో చోటుచేసుకుంది. బాధితుని బంధువుల కథనం ప్రకారం గోరేమియా, అలీం అనే తండ్రి కొడుకులపై మంత్రాల నెపంతో అదే గ్రామానికి చెందిన యాకూబ్ అనే వ్యక్తి కత్తులతో దాడి చేశారు. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దాడిలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మంత్రాల నెపంతో కత్తులతో దాడి
RELATED ARTICLES