HomeNewsLatest Newsభౌతిక దూరం అందరికీ... లీడర్లకు తప్ప!

భౌతిక దూరం అందరికీ… లీడర్లకు తప్ప!

భౌతిక దూరం పాటించని ప్రజాప్రతినిధులు
ముఖ్యమంత్రి కెసిఆర్‌ అదేశాలు బేఖాతర్‌
వరుస ఉల్లంఘనలకు పాల్పడుతన్న వైనం
లాక్‌డౌన్‌ మార్గదర్శకాలు పాటించని మంత్రి తలసాని, ఎంఎల్‌ఎ ముఠా గోపాల్‌
నేతల తీరుపై సర్వత్రా విమర్శలు

ప్రజాపక్షం/హైదరాబాద్‌ : నేతల నుంచి ప్రజలను కాపాడాల్సిన పరిస్థితులు హైదరాబాద్‌ మహానగరంలో నెలకొన్నాయి. ప్రజాప్రతినిధులే భౌతిక దూరాన్ని పాటించకపోవడంతో వైరస్‌ వ్యాప్తికి కారణమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా వైరస్‌ నిర్మూలనకు భౌతిక దూరం పాటించడమే మార్గమని ప్రపంచ వ్యాప్తంగా వైద్య నిపుణులు చెబుతున్నారు. భౌతిక దూరాన్ని  పాటించి కరోనా వ్యాప్తి నివారించాలని పలు పర్యాయాలు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ముఖ్యమంత్రి అదేశాలను గ్రేటర్‌ హైదరాబాద్‌ నేతలు సరిగ్గా విన్నంటులేరు. పశుసంవర్థక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ముషీరాబాద్‌ ఎంఎల్‌ఎ ముఠా గోపాల్‌లు పదేపదే భౌతిక దూరాన్ని పాటించకుండానే కార్యక్రమాలకు హాజరు కావడం సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. హైదరాబాద్‌ మహానగరంలో వేగంగా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న సమయంలో ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించి, పౌరులకు ఆదర్శకంగా ఉండాల్సిన నేతలు.. వాటిని తుంగలో తొక్కుతున్నారు. లాక్‌డౌన్‌లో పేదలకు చేసే సహాయక కార్యక్రమాలు ప్రచార ఆర్భాటాలుగా మారుతున్నాయి. బియ్యం, కూరగాయాలు ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాలను హంగు ఆర్భాటాలతో నిర్వహిస్తున్నారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారీ కాన్వాయ్‌లతో విచ్చేసి అనుచరగణంతో పంపిణీ కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు హాజరవడం ఆందోళన కలిగిస్తోందని నగర వాసులు అంటున్నారు. సరుకుల పంపిణీ కార్యక్రమాల్లో భౌతిక దూరాన్ని పాటించకపోవడంతో వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ పలు పర్యాయాలు లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆదివారం రాంనగర్‌ డివిజన్‌ పరిధిలోని బాగ్‌లింగంపల్లి శ్రీరాంనగర్‌లో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపణీ కార్యక్రమానికి ముషీరాబాద్‌ ఎంఎల్‌ఎ గోపాల్‌, స్థానిక కార్పొరేటర్‌ వి.శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి మంత్రి తలసాని హాజరయ్యారు. అయితే మాస్కులు కూడా సరిగ్గా పెట్టుకోకుండానే కార్మికులకు సరుకులు అందజేశారు. ఇక్కడ మంత్రి, ఎంఎల్‌ఎ, కార్పొరేటర్‌, నేతలు ఎవ్వరు కూడా కనీస భౌతిక దూరాన్ని పాటించకపోవడం స్థానికులకు విస్మయం కలిగించింది. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు కనీస దూరాన్ని పాటించకపోవడం విమర్శలకు తావిస్తోంది. లాక్‌డౌన్‌ విధించిన ఇటీవలి కాలంలో మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ సామాజిక దూరాన్ని పాటించకుండానే పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నగరంలో ప్రతిరోజు 30 చొప్పున కొత్త కరోనా వైరస్‌ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా వైరస్‌ విస్తరిస్తుందనే కారణంగా శాసనసభ సమావేశాలను సైతం రాష్ట్ర ప్రభుత్వం కుదించుకుంది. మార్చి 22వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుతాలు అమలు చేస్తున్నాయి. లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పలు పర్యాయాలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మాస్కులు ధరించడాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరి చేశాయి. ముఖ్యమంత్రి స్వయంగా మాస్కు ధరించి, అధికారులు, మీడియా సమావేశాలకు హాజరవుతున్నారు. మంత్రి, ఎంఎల్‌ఎ, కార్పొరేటర్లు జన సమూహంలో మాస్కులు సరిగ్గా పెట్టుకోకుండానే సరుకుల పంపణీ చేశారు. ఇక ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే ఈ విధంగా లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సామాన్య ప్రజలకు ఎలాంటి సందేశం వెళ్తుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకసారి అంటే ఎమో అనుకోవచ్చు కానీ నగరంలో వైరస్‌ వేగంగా విస్తురిస్తున్న సమయంలో  పదే పదే భౌతిక దూరాన్ని పాటించకుండానే కార్యక్రమాలకు హాజరకావడం సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నేతలే ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే ప్రజలకు ఎవరు జవాబుదారీగా ఉంటారనే విషయం ప్రశ్నార్థకంగా మారుతోంది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments