HomeNewsBreaking Newsభూ పోరాటం అడ్డగింత

భూ పోరాటం అడ్డగింత

నిరసనగా వరంగల్‌లో సిపిఐ రాస్తారోకో

ప్రజాపక్షం/వరంగల్‌ ప్రతినిధి వరంగల్‌ నగరం మట్టెవాడ శివారు ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ భూములలో శుక్రవారం పేదలు నివాస స్థలాల కోసం సిపిఐ ఆద్వర్యంలో చేపట్టిన భూ పోరాటాన్ని పోలీసులు అడ్డుకున్నారు.సిపిఐ నాయకులతో కలిసి పేద ప్రజలు నివాస స్థలాల కోసం గుడిసెలు నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు వారిని అడ్డుకుని జులుం ప్రదర్శించారు. నాయకులను, పేదలను చెల్లా చెదరు చేసి భయబ్రాంతులకు గురి చేసారు. దీనిని నిరసిస్తూ సిపిఐ నాయకులు, కార్యకర్తలు వరంగల్‌ గోపాల స్వామి గుడి దేవాలయం సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో నిర్వహిస్తున్న వారిని సైతం బలవంతంగా అడ్డుకుని తొలగించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులకు,సిపిఐ నాయకులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సందర్భంగా సిపిఐ వరంగల్‌ మండల కార్యదర్శి బుస్సా రవిందర్‌ మాట్లాడుతూ మట్టెవాడ శివారు ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ భూములైన సర్వే నెంబర్‌ 373, 374, 375, 376, 378లలో పేదలు గుడిసెలు వేసుకుంటుం టే పోలీసులు అడ్డుకుంటున్నారని, కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. ఇదే ప్రభుత్వ భూమిని భూ కబ్జాదారులు ప్లాట్లుగా చేసి విక్రయిస్తుంటే మాత్రం వారికి అండగా ఉంటున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి నిలువ నీడ లేని వారికి ఈ ప్రభుత్వ భూమలలో పట్టాలు ఇచ్చి పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేసారు.ఈ రాస్తారోకో, భూ పోరాట కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు సండ్ర కుమార్‌,పరికిరాల రమేష్‌,భూజుగుండ్ల రమేష్‌,మండల నాయకులు షబానా,ఎండి అంజద్‌, మార్కండేయ, ప్రసాద్‌, స్వప్న, సత్య ,పద్మ, శారద తదితరులు పాల్గొన్నారు.
పేదలను భయబ్రాంతులకు గురిచేస్తే సహించం : శ్రీనివాసరావు
భూ పోరాటంలో పాల్గొంటున్న పేదలను పోలీసులు భయబ్రాంతులకు గురిచేస్తే సహించబోమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు హెచ్చరించారు. ప్రభుత్వ భూములపై రెవెన్యూ అధికారులు స్పందిస్తారని,అక్కడ పోలీసులకు ఏం పని అని ప్రశ్నించారు.ప్రభుత్వ భూములను కాపాడుకునే భాద్యత ప్రజలదేనని,పోలీసులు రియల్‌ ఎస్టేట్‌ దారులకు,భూ కబ్జాదారులకు వంత పాడడం మానుకోవాలని సూచించారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేదలను ఆదుకోవాలని డిమాండ్‌ చేసారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments