సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్
ప్రజాపక్షం / హైదరాబాద్
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ భూముల కొనుగోలు వ్యవహారంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆగమేఘాలపై తీసుకున్న చర్యలు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. రాజేందర్ వ్యవహారం అధికార టి ఆర్‌ఎస్ పార్టీ వ్యవహారంగానే పరిగణించడానికి వీలులేదని, అనేక మంది ప్రభుత్వ పెద్దలపై ఇలాంటి పలు ఆరోపణలు వచ్చాయని, నయీం భూముల కుంభకోణం, హఫీజ్‌పేట ప్రభుత్వ భూముల కొనుగోలు వ్యవహారం, తాజాగా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ భూముల విషయాలలో ప్రభుత్వ వ్యవహారం లాలూచి కుస్తీగా సాగుతోందని, అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నదని ఆయన విమర్శించారు. ఈ వ్యవహారాలన్నింటితో పాటు హైదరాబాద్ పరిసరాలకు చెందిన పలు జిల్లాలలోని విలువైన భూముల ఆక్రమణలు, ఆరోపణలు, పేద ప్రజల అసైన్డు భూముల క్రయవిక్రయాలపై హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి రాజేందర్‌పై వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణల లాంటివి ఇంకా పలువురు మంత్రులు, శాసనసభ్యులు, అధికార పార్టీ ప్రముఖులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అసైన్డ్ భూములను, పేద రైతుల భూములను, ప్రభుత్వ భూములను ఆక్రమించిన సంఘటనలను సిపిఐ, ప్రజాసంఘాలు ప్రభుత్వం, అధికారుల దృష్టికి పలు పర్యాయాలు తీసుకొచ్చినా ఎలాంటి స్పందన లేదని చాడ వెంకట్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పేద ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డు భూములను ఆక్రమించినా, విక్రయించినా చట్టపరంగా నేరమనేది అందరికి తెలుసునని అన్నారు. అభివృద్ధి పేరుతో రహదారులు, పరిశ్రమలు, ఔషధ నగరాలను నిర్మించడానికి ప్రభుత్వం పేద ప్రజల భూములనే స్వాధీనపర్చుకుంటున్నదని, తమ పార్టీతోసహా పలు సంఘాలు ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించాయని, ఇలాంటి విధానం సామాజిక అభివృద్ధికి దోహదపడేవి కాదని ఆయన తెలిపారు. ఏభూ రికార్డుల ప్రక్షాళన గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిదని, అది తప్పుల తడక అన్నది అన్నింటా రుజువవుతున్నదని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టగానే భూ ఆక్రమణ వ్యతిరేక కోర్టును రద్ధు చేయడం విచారకరమన్నారు.
భూ ఆక్రమణలపై హైకోర్టు న్యాయమూర్తితో సమగ్ర విచారణ
RELATED ARTICLES