కాళేశ్వరం ప్రాజెక్టు 3వ టిఎంసి భూసేకరణ సర్వేను అడ్డుకున్న రైతులు
నోటీసులు ఇవ్వకుండా, అనుమతి తీసుకోకుండా ఎలా సర్వే చేస్తారు?
కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో అన్నదాతల ఆందోళన
ప్రజాపక్షం/కరీంనగర్ బ్యూరో
కాళేశ్వర ప్రాజెక్టు మూడో టిఎంసి పనులకు సంబంధించిన భూసేకరణ సర్వేను రైతులు అడ్డుకున్నారు. భూములు ఇచ్చేందుకు తాము సిద్ధంగా లేమని, ఇక్కడ ఎటువంటి సర్వేలు చేయవద్దని రైతులు ఎదురుతిరిగారు. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా గంగాధర మండలం రంగరావుపల్లి, కొండపల్లి గ్రామాల మధ్య బుధవారం స్థానిక తహశీల్దార్ శ్రీనివాస్ భూసేకరణలో భాగంగా సర్వే జరిపేందుకు చేరుకున్నారు. గంగాధర ఎస్‌ఐ నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు సైతం ఏర్పాటు చేశారు. రెవెన్యూ అధికారులు సర్వే కోసం వస్తున్నారన్న సమాచారం అందుకున్న రైతులు తమ భూముల వద్దకు చేరుకున్నారు. సర్వే చేసేందుకు అక్కడకు అధికారులు చేరుకోగానే తమ వ్యతిరేకతను తెలియజేసి సర్వేను అడ్డుకున్నారు. తమకు నోటీసులు ఇవ్వకుండా, తమ నుండి అనుమతి తీసుకోకుండా భూ సేకరణ ఎలా జరుపుతారంటూ ప్రశ్నించారు. ఇప్పటికే తాము భూములు అభివృద్ధి పనులకు ఇచ్చామని, మిగిలిన భూములను కూడా ఇచ్చేందుకు సుముఖంగా లేమని రైతులు తేల్చి చెప్పారు. అయితే నిబంధనల ప్రకారమే తాము సర్వే చేస్తున్నామని, అభ్యంతరం చెప్పడం సరికాదని, తహశీల్దార్ శ్రీనివాస్ రైతులకు వివరించారు. చట్టానికి లోబడే తాము సర్వే చేస్తున్నందున తమ పనికి ఆటంకం కలిగించవద్దని కోరారు. ఎస్‌ఐ నరేష్ రెడ్డి కూడా రైతులను సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ వారు మాత్రం ససేమిరా అన్నారు. మూడో టిఎంసి పనులకు తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని, తమ పొట్టకొట్టవద్దని రైతులందరూ కలిసి ఆందోళన నిర్వహించారు.
భూములివ్వం
RELATED ARTICLES