అఫ్గానిస్థాన్‌లో 1000 మందికిపైగా మృత్యువాత
మరో 1500 మందికి గాయాలు
రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదు
తాలిబన్ ప్రభుత్వానికి అగ్నిపరీక్ష
కాబూల్ : అంతర్గత సంక్షోభం, ఆర్థిక సంక్షోభం మధ్య కొట్టుమిట్టాడుతున్న అఫ్గానిస్థాన్‌పై ప్రకృతి విరుచుకుపడింది. భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. బుధవారం తెల్లవారుజామున తూర్పు అఫ్గాన్‌లోని మారుమూల, ప్రర్వతాల ప్రాంతంలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. భూకంపలేఖినిపై తీవ్రత 6.1గా నమోదైంది. రెండు దశాబ్దాల తరువాత వాటిల్లిన అత్యంత భయంకరమైన భూకంప ధాటికి 1000కిపైగా మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1500 మంది గాయపడినట్లు దేశ అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు అధికారులు హెచ్చరించినట్లు తెలిపింది. కేవలం 10 కిలోమీటర్ల లోతు నుంచి భూ ప్రకంపనలు వచ్చినట్లు నిఫుణులు అంచనా వేశారు. తాలిబన్ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఈ విపత్తు అగ్నిపరీక్షగా మారింది. సహాయక చర్యలు చేపట్టేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రెస్క్యూ సిబ్బంది హెలికాప్టర్ ద్వారా ఘటనాస్థలికి చేరుకుంది. అయితే గత ఏడాది
అఫ్గాన్‌ను తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్న తరువాత అనేక అంతర్జాతీయ సహాయక సంస్థలు దేశాన్ని విడిచి వెళ్లడంతో రెస్క్యూ ప్రయత్నాలు క్లిష్టతరమయ్యే అవకాశముంది. చరిత్రలోనే సుదీర్ఘకాలం జరిగిన యుద్ధం నుంచి యుఎస్ మిలటరీని ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. కాగా, పాకిస్థాన్ సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించినప్పటికీ తూర్ప అఫ్గాన్‌లో పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది. కొండచరియలు విరిగిపడడం సాధారణం కావడం, ఇళ్లు, భవనాలను నాణ్యత లేకుండా నిర్మించండంతో అనేకం కుప్పకూలాయి. అఫ్గాన్‌లోని ఖోస్ట్ నగరానికి 44 కిలోమీటర్ల దూరంలో.. 51 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. పలుమార్లు ప్రకంపనలు చోటుచేసుకోవడంతో అనేక మంది శిథిలాల కింద చిక్కుకుని మరణించినట్లు అధికారులు తెలిపారు. ఫలితంగా పెషావర్, ఇస్లామాబాద్, లాహోర్, ఖైబర్ పఖ్తుంఖ్వా, పంజాబ్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు వివరించింది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం చోటుచేసుకోలేదని పాక్ అధికారులు తెలిపారు. భూకంపం వల్ల ఖోస్ట్ ప్రావిన్స్‌లో కూడా భవనాలు దెబ్బతిన్నాయి. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌కు 350 కిలోమీటర్ల దూరం వరకు కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. పక్తకాలో బాధితులు నెత్తిన బ్లాంకెట్లు పెట్టుకొని హెలికాప్టర్ల కోసం వేచి చూస్తున్న దృశ్టాలు వైరల్ అవుతున్నాయి. ఇళ్లు ధ్వంసమైన శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ ప్రాంతంలో సరైన వైద్య సదుపాయలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు సహాయం కోసం అర్ధించే పరిస్థితి నెలకొంది. తాజాగా భూకంపం 2002లో సంభవించి దానితో సమానంగా ఉన్నట్లు బఖ్తల్ వార్తా సంస్థ పేర్కొంది. అఫ్గాన్ మారుమూల ఈశాన్య ప్రాంతంలో 1998లో 6.1 తీవ్రతతో సంభవించిన భూకంపానికి 4500 మంది మృత్యువాత పడ్డారు. ఇదిలా ఉండగా, ఉపశమన ప్రయత్నాల్లో సమన్వయం కోసం కాబూల్‌లోని అధ్యక్ష భవనంలో ప్రధాని మమహ్మద్ హస్సన్ అఖుండ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఘటనాస్థలానికి సహాయ ఏజెన్సీలను పంపాలని విజ్ఞప్తి చేస్తూ తాలిబన్ ప్రభుత్వ డిప్యూటీ అధికార ప్రతినిధి బిలాల్ కరిమి ట్వీట్ చేశారు. అఫ్గాన్ రెడ్ క్రాస్ సొసైటీ భూకంప ప్రభావిత ప్రాంతానికి 4 వేల బ్లాంకెట్లను, 800 టెంట్లను, 800 కిచెన్ కిట్లను పంపినట్లు బఖ్తర్ డైరెక్టర్ జనరల్ అబ్దుల్ వాహిద్ రాయన్ తెలిపారు. ఏడు అంబులెన్స్‌లను పంపినట్లు వైద్య సహాయ అత్యవసర సంస్థ పేర్కొంది. అఫ్గాన్‌లోని దేశ అత్యవసర డైరెక్టర్ స్టీఫానో సొజ్జా మాట్లాడుతూ బాధితుల సంఖ్య పెరుగుతుందన్న భయాందోళన నెలకొన్నాయని, కుప్పకూలిన భవన శిథిలాల్లో అనేక మంది చిక్కుకున్నారన్నారు. తమ దేశ తరుపున సాయం అందిస్తామి పాక్ ప్రధాని షహబజ్ షరీఫ్ చెప్పారు. భారత్, అఫ్గాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లోని 500 కిలోమీటర్ల మేర భూకంప ప్రభావం కనిపించినట్లు యూరోపియన్ సీస్మోలాజికల్ ఏజెన్సీ (ఇఎంఎస్‌సి) తెలిపింది. ఆయా ప్రాంతాల్లోని 11.9 కోట్ల మంది భూ ప్రకంపనలు చవిచూసినట్లు పేర్కొంది. అఫ్గాన్‌నిస్థాన్‌లో ప్రకృతి విపత్తులు సాధారణం కాగా, 2002 సంభవించిన భారీ భూకంపంలో 1000 మందికి పైగా చనిపోయారు. అఫ్గానిస్థాన్‌లో ఏటా సగటున 560 మంది భూకంపాల కారణంగా మరణిస్తున్నట్లు ఐరాస మానవ హక్కుల సంఘం నివేదిక ఒకటి పేర్కొంది.
భూకంప విలయం
RELATED ARTICLES