పోలీసులు, కార్యకర్తల బాహాబాహీ
ఎంపి కోమటిరెడ్డి, కాంగ్రెస్ నాయకుల అరెస్టు
ప్రజాపక్షం/యాదాద్రి భువనగిరి : స్థానిక సంస్థలకు నిధులు కేటాయించాలని సర్పంచుల అధికారాలను కాపాడాలని జాయింట్ చెక్ పవర్ రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ కార్యాలయం ముందు చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ధర్నాలో పాల్గొన్న ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడానికి ప్రయత్నించగా పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ తోపులాటలో మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు వనపర్తి గ్రామ సర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ్డి కాలు విరిగింది. నాయకు లు, పోలీసులు ఒకరిమీద ఒకరు పడడంతో కొంతమంది నాయకులకు, కార్యకర్తలకు స్వల్పగాయాలయ్యాయి. ఎట్టకేలకు పోలీసులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరికొంత మంది నాయకులను అరెస్టు చేసి భువనగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. కార్యకర్తలు ప్రభుత్వానికి, పోలీసులకు వ్య తిరేకంగా నినాదాలు చేశారు.కాలు విరిగిన సర్పంచ్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు.