ముంబయి : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) శుక్రవారం భీమా-కొరెగావ్ కేసులో ఎనిమిది మందిపై ఛార్జిషీటు దాఖలు చేసింది. 2018 జనవరి 1న హింసాత్మక సంఘటనలకు పాల్పడేవిధంగా ప్రజలను రెచ్చగొట్టడంలో వీరి ప్రమేయం ఉందని ఆరోపించింది. సామాజిక కార్యకర్త గౌతమ్ నవలఖ, ఢిల్లీ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొపెసర్ హనీ బాబు, గిరిజన నేత ఫాదర్ స్టాన్ స్వామి తదితరుల పేర్లు ఈ ఛార్జిషీట్‌లో ఉన్నాయి. ఎన్‌ఐఎ అధికార ప్రతినిధి, పోలీస్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డిఐజి) సోనియా నారంగ్ మాట్లాడుతూ ఛార్జిషీటును కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. దర్యాప్తు సందర్భంగా ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. పుణే సమీపంలోని కొరెగావ్ వద్ద యుద్ధం జరిగి 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2018 జనవరి 1న పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హింసాత్మక సంఘటనలు జరిగే విధంగా నిందితులు రెచ్చగొట్టినట్లు ఎన్‌ఐఎ ఆరోపించింది. ఈ హింసాత్మక సంఘటనల్లో ఒకరు మరణించగా, చాలా మంది గాయపడ్డారు. ఎన్‌ఐఎ ఛార్జిషీటులో పేర్కొన్నవారు : సామాజిక కార్యకర్త గౌతమ్ నవలఖ, ఢిల్లీ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొపెసర్ హనీ బాబు, గిరిజన నేత ఫాదర్ స్టాన్ స్వామి, గోవా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్ ఆనంద్ తెల్టుంబే, జ్యోతి జగతప్, సాగర్ గోర్ఖే, రమేశ్ గైచోర్, భీమా-కొరెగావ్ శౌర్య దిన్ ప్రేరణ అభియాన్ గ్రూప్ ఉద్యమకారులు. ఈ కేసులో నిందితుల్లో ఒకరైన మిలింద్ తెల్టుంబే పరారీలో ఉన్నారు.
స్టాన్ స్వామి అరెస్టు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భీమా కొరెగావ్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ మరో సామాజికవేత్తను అరెస్ట్ చేసింది. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఫాదర్ స్టాన్ స్వామి (83)ని ఎన్‌ఐఎ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. కాగా, ఆదివాసీల హక్కుల కోసం స్టాన్ స్వామి గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నారు. భీమా కొరెగావ్ కేసులో అరెస్టయిన రోనా విల్సన్, అరుణ్ ఫెరారియతో స్తాన్ స్వామికి సంబంధం ఉన్నట్టు ఎన్‌ఐఎ అధికారులు ఆధారాలు సేకరించినట్టు సమాచారం. అయితే, ఎలాంటి వారెంట్ లేకుండా స్టాన్ స్వామిని అరెస్టు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భీమా-కొరెగావ్ కేసులో 8 మందిపై ఛార్జిషీటు
RELATED ARTICLES