అసోంను వీడని ఉధృతి
16 జిల్లాల్లో ఐదు లక్షల మందికి తీవ్ర ఇబ్బందులు
గువహటి: ఈశాన్యప్రాంతంలో బ్రహ్మపుత్ర సహా అనేక నదులు పొంగి పొర్లుతుండటంతో అసోంలో వరద ఉధృతి ఇంకాతగ్గుముఖం పట్టలేదు. భారీ వర్షాలు, వరదల కారణంగా అసోంలోని 16 జిల్లాల్లో 4.88 లక్షలమంద్రి ప్రజలు అవాసాలు కోల్పో యి వరద బాధితులుగా మారారు. ప్రధాన నదులన్నీ ప్రమాదస్థాయిని దాటి ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో జవావాసాలు నీట మునిగాయి. అనేక ప్రాంతాలలో భారీగా వర్షపాతం నమోదైంది. సెంట్రల్ వాటర్ కమిషన్ శుక్రవారం ప్రకటించిన నివేదిక ప్రకారం, బ్రహ్మపుత్ర నది నెమటిఘాట్ వద్ద ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తోంది. నీరు పొంగిపొరలి జనావాసాల్లో ప్రవేశించింది. పుథిమరి, పగ్లాదియా నదులకు గండ్లు పడ్డాయి. కామ్‌రూప్, నల్‌బరి జిల్లాలలో ప్రమాదకర పరిస్థితులు తలెత్తాయని సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రకటించింది. శనివారంనాడు ప్రాం తీయ వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసినప్పు డు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ప్రవర్తించాలని వాతావరణశాఖ ప్రకటించింది. వరదల కారణంగా ఇప్పటివరకూ ఇద్దరు మరణించారు. వరద ఉధృతివల్ల బజాలి సబ్ డివిజన్ తీవ్రంగా నష్టపోయింది. ఆ ప్రాంతంలో 2.67 లక్షలమంది ప్రజలు వరద బారిన పడ్డారు. నల్‌బరి, బార్‌పేట జిల్లాలో కూడా తీవ్ర పరిస్థితులు నెలకున్నాయి. ఈ నల్‌బరి లో 80 వేలమంది, బార్‌పేటలో 73 వేలమంది ప్రజలు వరదల బారిన పడ్డారు. 140 పునరావాస కేంద్రాలలో ఇప్పటివరకూ 35 వేలమంది ప్రజలు వెళ్ళి ఆశ్రయం పొందారు. మరో 75 వరద సహాయ కేంద్రాలు, పంపిణీ కేంద్రాలు కూడా పనిచేస్తున్నాయి. ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, సివిల్ డిఫెన్స్ సిబ్బందితోపాటు సాహసంగల స్థానిక ప్రజలు కూడా సహాయ చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు. పాలనా యంత్రాంగానికి స్థానిక ప్రజలు సహకారం అందజేస్తున్నారు. బాజాలి, బాక్సా, బార్‌పేట, కచార్, చిరాంగ్, దర్రాంగ్, ధెమాజీ, ధుబ్రి, గోయాల్‌పర, కరింగంజ్, కోక్రాఝార్, మజులి, నల్‌బరి జిల్లాలు వరద బారిన పడ్డాయి.
హిమాచల్‌ప్రదేశ్‌లో విరిగిపడిన కొండచరియలు
రాష్ట్రాన్ని ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు తాకాయి. శనివారం వర్షాలు కురిశాయి. చాంబా జిల్లా భార్మౌర్ ప్రాంతంలోని కుగ్జి జోట్ సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో300 మేకలు మరణించాయి. మరో 50 మేకలు గాయపడ్డాయి. భారీవర్షాలతో రుతుపవనాలు హిమాచల్ ప్రజలను పలకరించాయి. సిమ్లాలో రాబోయే రెండు రోజులు నీటి సరఫరాకు ఇబ్బంది కలుగుతుందని సంబంధిత అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలోని ఏడు ప్రాంతాలలో భారీగా వర్షాలుకురిశాయి. నైరుతీ రుతుపవనాలు సాధారణంగా హిమాచల్‌ను జూన్ 28,29 తేదీలలో పలకరిస్తాయి. ఈసారి ముందుగానే వచ్చాయి. మండిజిల్లా కతౌలాలో 163.3 మిల్లీమీటర్ల వర్‌సం కురిసింది. కాసౌలీలో 160 మిల్లీ మీటర్లు,కాంగ్రాలో 145 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది.అదేవిధంగా మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లా అలీబాగ్‌ను తొలకరి జల్లులు ముందుగానే పలుకరించాయి. రాబోయే 48 గంటల్లో ఈ మేఘాలు ముంబయికి వెళతాయి. ఈనెల 11నే ముంబయిలో వర్షాలు పడాల్సి ఉంది.
రెండు రోజుల్లో రాజధాని ఢిల్లీకి రుతుపవనాలు
దేశరాజధాని ఢిల్లీ నగరంలోకి మరో రెండు రోజుల్లో రుతుపవనాలు ప్రవేశిస్తాయి. తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు కూడా రుతుపవనాలు భారీగా విస్తరిస్తాయి. ఈనెల 27వ తేదీ మంగళవారంనాటికల్లా ఢిల్లీ వాసులు తొలకరి జల్లులను ఆస్వాదిస్తారని భారత వాతావరణ విభాగం (ఐఎండి) శనివారం అంచనావేసింది. రుతుపవనాల్లో కుదుపులు మొదలు కావడంతో మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లోకి రుతుపవానాలు విస్తరిస్తున్నాయి. యావత్ కర్ణాటక, కేరళ, తమిళనాడు, చత్తీస్‌గఢ్, ఒడిశా, ఈశాన్యప్రాంత రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, తూర్పు ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలతోపాటు కొన్ని ప్రాంతాలకు రుతుపవానాలు విస్తరిస్తున్నాయని ఐఎండి పేర్కొంది. మహారాష్ట్రలో ముంబయి సహా మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయని ఐఎండి పేర్కొంది. మధ్యప్రదేశ్,ఉత్తర ప్రదేశ్,జమ్మూ కశ్మీర్, లఢఖ్, ఢిల్లీ, చండీగఢ్ సహా హర్యానాలోని చాలా ప్రాంతాలకు రుతుపవనాలు రెండు రోజుల్లో విస్తరిస్తాయని పేర్కొంది. దీంతోపాటు గుజరాత్, తూర్పు రాజస్తాన్, పంజాబ్‌లకు కూడా మంగళవారంనాటికి రుతుపవనాలు విస్తరిస్తాయి. గత ఏడాది జూన్ నెల ౩౦ వ తేదీకిగానీ తొలకరి జల్లులు పడలేదు. 2021లో జులై 13న, 2020లో జూన్ 25న, 2019లో జులై 5న, 2018లో జూన్ 28న రుతుపవనాలు ఢిల్లీని తాకాయని ఐఎండి గుర్తుచేసింది. ఈ ఏడాది జూన్ 8 నాటికి నైరుతీ రుతుపవనాలు కేరళను తాకాయి. వాస్తవానికి జూన్ 1 నాటికే కేరళలో వర్షాలు కురవాల్సి ఉండగా, వారం రోజులు ఆలస్యమైంది. అయితే కేరళకు ఆలస్యంగా వచ్చినంతమాత్రాన రుతుపవనాలు వాయువ్య భారత రా్రష్ట్రాలకు ఆలస్యంగా వెళ్ళే అవకాశం లేదని కూడా పరిశోధకులు ముందే స్పష్టం చేశారు. రుతుపవనాల జాప్యంవల్ల ఏ విధంగానూ వర్షపాతంలో లోటు రాదని కూడా వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పారు. ఎల్‌నినో ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ ఈ ఏడాది దేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండి ఇప్పటికే అంచనావేసింది. తూర్పు, ఈశాన్య, సెంట్రల్, వాయువ్యప్రాంత రాష్ట్రాల్లో, దక్షిణాగ్రంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా. 94 నుండి 106 శాతం మేరకు సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండి పేర్కొంది. ఐఎండి అంచనాల ప్రకారం, 90 శాతం కంటే తక్కువగా కురిసే దీర్ఘకాలిక సగటు ప్రకారం 90 శాతం మధ్య కురిస్తే తక్కువ వర్షపాతం నమోదైనట్లు. 105 లేదా 110 శాతం వర్షం నమోదైతే సాధారణంకంటే అధికంగా కురిసినట్లే. 100 శాతం కంటే ఎక్కువ కురిస్తే అధిక వర్షమే.
తెలంగాణలో రోజులు తేలికపాటి వర్షాలు
ప్రజాపక్షం/హైదరాబాద్ : రాగల మూడు రోజుల్లో రాష్ర్టంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షం కురిసే సూచనలున్నాయన్నారు. ఆదివారం నుంచి సోమవారం పలు రాష్ర్టవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్నారు. ఈ మేరకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేశారు.