ఆరుగురు మావోయిస్టులు మృతి
ఉలిక్కిపడ్డ మణుగూరు డివిజన్
ప్రజాపక్షం/ ఖమ్మం / కరకగూడెం
తెలంగాణలోని గోదావరి పరీవాహక ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. గురువారం తెల్లవారు జామున జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. ముగ్గురు పోలీసులు సైతం గాయపడినట్లు సమాచారం. ఒకప్పుడు నక్సలైట్లకు కేంద్రంగా ఉన్న ఇల్లందు, మణుగూరు సబ్ డివిజన్లలో గత కొంత కాలంగా మావోల కదలికలు ప్రారంభమయ్యాయి. రెండు నెలల క్రితం జరిగిన ఎన్ కౌంటర్‌లో మావోయిస్టు ఒకరు మరణించగా గురువారం ఆరుగురు మరణించారు. పూర్తి ఏజెన్సీ మండలమైన కరకగూడెం మండలం మోతె అటవీ ప్రాంతం దోనాలగుట్ట సమీపంలోని రఘునాథపాలెం వద్ద ఉదయం ఏడు గంటలకు జరిగిన తుపాకుల మోతతో ఈ ప్రాంత ప్రజలు ఉలిక్కిపడ్డారు. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో కుంజా వీరయ్య అలియాస్ లచ్చన్న దళం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఎన్‌కౌంటర్‌లో కుంజా వీరయ్య , సుక్రుడు, తులసి, వెల్లెద్దాం, దుర్గేష్, కట్ అనే మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉండడం గమనార్హం. లచ్చన్నదళం వేసవికి ముందు గోదావరి దాటి మణుగూరు, ములుగు అటవీ ప్రాంతాలలో సంచరిస్తూ పార్టీ వైపు యువతను ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమై లచ్చన్న దళాన్ని వెంటాడుతున్నారు. గోదావరికి వరదలు రావడంతో గోదావరి దాటే మార్గం కనిపించకపోవడం, ఇక్కడ సరైన రక్షణ లేక రోజుకో ప్రాంతానికి మారుతూ మోతె అడవుల్లో పోలీసులకు చిక్కింది. ఇటీవల కాలంలో తెలంగాణలో చోటు చేసుకున్న భారీ ఎన్‌కౌంటర్ ఇది. ఎన్‌కౌంటర్ ఘటన స్థలం నుంచి ఎకె 47 ఆయుధాలు రెండు, ఎస్‌ఎల్‌ఆర్ ఒకటి, 303 రైఫిల్ ఒకటి, ఫిస్టల్ ఒకటి, లైవ్ రౌండ్లు, కిట్ బ్యాగులు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన పోలీసులను తొలుత భద్రాచలం ఆసుపత్రికి అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. ఇదిలా ఉండగా మరణించిన మావోయిస్టులపై రివార్డులు ఉన్నాయి. కుంజా వీరయ్య అలియాస్ లచ్చన్నపై ఐదు లక్షల రివార్డు ఉండగా తులసి, దుర్గేష్‌లపై నాలుగు లక్షల చొప్పున రివార్డు ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో పార్టీ బలోపేతానికి ప్రయత్నిస్తున్న మావోయిస్టులకు ఇది గట్టి ఎదురు దెబ్బ.
విప్లవ ద్రోహుల పనే….
కరకగూడెం మండలం రఘునాథపాలెం ఎన్‌కౌంటర్ విప్లవ ద్రోహులు అందించిన సమాచారంతోనే జరిగిందని భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ మావోయిస్టు కార్యదర్శి ఆజాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్‌కౌంటర్ అనంతరం ఆజాద్ ఒక లేఖను విడుదల చేశారు. లచ్చన్నతో పాటు ఆరుగురిని నర హంతక గ్రేహౌండ్స్ పోలీసులు హత్య గావించారని దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్లు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని మావోయిస్టు పార్టీకి త్యాగాలు కొత్త కాదని ఆజాద్ తెలిపారు. మరణించిన లచ్చన్నది ఛత్తీస్‌గఢ్‌లోని రాయగూడెం అని తులసి లచ్చన్న సతీమణి అని ఇమెది ఛత్తీస్‌గఢ్‌లోని కుంబాడు గ్రామమని, మిగిలిన వారిది యేటపాక, ఛత్తీస్‌గఢ్‌లోని కోమటిపల్లి కాగా దుర్గేష్‌ది బొట్టేం గ్రామమని వీరితో పాటు ఒక గ్రామస్తున్ని కూడా పోలీసులు హత్య చేసినట్లు సమాచారం ఉందని ఆజాద్ ఆరోపించారు. రఘునాథపాలెం ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈనెల తొమ్మిదిన బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఆజాద్ తెలిపారు.
అప్రమత్తమైన పోలీసులు
ప్రజాపక్షం/హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గురువారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు.ఛతీస్‌ఘడ్ సరిహద్దులపై పోలీసులు ప్రత్యేక నిఘా పెంచారు. ఈ ఎన్‌కౌంటర్‌తో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉన్న ప్రజాప్రతినిధులను అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించినట్లు తెలిసింది. అధికార కార్యక్రమాలుగాని, వరద ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు వెళ్లేముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కూడా సూచించినట్లు తెలిసింది. దీంతో పాటు ఆయా జిల్లాలలో మావోయిస్టు కదలికలపై నిఘా పెంచాలని డిజిపి జితేందర్ ఎస్‌పిలు, కమిషనర్లకు ఆదేశించినట్లు సమాచారం. ఛతీస్‌ఘడ్‌లో ఎన్‌కౌంటర్‌లు, కూంబింగ్‌లు పెరగడంతో తెలంగాణలోకి మావోయిస్టులు వస్తున్నారనే సమాచారం ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.