దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఎ
9 మంది అల్ ఖైదా ఉగ్రవాదుల అరెస్టు
దస్త్రాలు, డిజిటల్ డివైస్‌లు, జీహాదీ సాహిత్యం స్వాధీనం
న్యూఢిల్లీ / కోల్‌కతా : దేశంలో ఉగ్ర దాడుల కు కుట్రపన్నిన ఆల్‌ఖైదా ఆపరేటర్లను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అరెస్ట్ చేసింది. ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి వచ్చిన సమాచారంతో అప్రమత్తమైన ఎన్‌ఐఎ భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసింది. దేశవ్యాప్తంగా ఎన్‌ఐఎ జరిపిన సోదాల్లో 9 మంది ఆల్‌ఖైదా ఉగ్రవాదులు పట్టుబడ్డారు. వీరందరినీ పశ్చిమబంగాల్‌లోని ముర్షీదాబాద్, కేరళలోని ఎర్నాకుళంలో దర్యా ప్తు అరెస్టు చేసింది. వీరిలో ఆరుగురు ముర్షీదాబాద్‌కు చెందిన వారు కాగా, మిగిలిన ముగ్గు రు ఎర్నాకుళంకు చెందిన వారని ఎన్‌ఐఎ తెలిపింది. దేశవ్యాప్తంగా జనసమ్మర్థ ప్రదేశాల్లో బాంబు దాడులు జరిపి అమాయకుల ప్రాణా లు తీసేందుకు కుట్ర చేస్తున్నట్లు ఎన్‌ఐఎ ఆరోపించింది. ఉగ్రవాదుల నుంచి భారీ ఎత్తున దస్త్రాలను, డిజిటల్ డివైస్‌లను, జీహాదీ సాహిత్యాన్ని, దేశీయంగా తయారైన తుపాకులు, శరీర కవచాలు, ఇంట్లోనే పేలుడు పదార్థాలు తయారు చేయడానికి అవసరమైన పరిజ్ఞానంతో కూడిన మెటీరియల్, పదునైన ఆయుధాలను ఎన్‌ఐఎ స్వాధీనం చేసుకుంది. వీరంతా పాకిస్థాన్ కేంద్రంగా పని చేసే అల్‌ఖైదా అనుబంధ సభ్యులని ఎన్‌ఐఎ వెల్లడించింది. సామాజిక మాధ్యమాల ద్వారా అల్‌ఖైదాలో చేరి ఢిల్లీ సహా, దేశ వ్యాప్తంగా దాడులకు కుట్ర చేసినట్లు పేర్కొంది. నిధుల సేకరణకు పాల్పడటం సహా, వీరిలో కొందరు ఢిల్లీ వెళ్లి ఆయుధాలు కొనుగోలు చేసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు వివరించింది. ”అల్‌ఖైదాకు చెందిన అంతర్రాష్ట్ర ఉగ్రముఠా పశ్చిమబెంగాల్, కేళలోని వివిధ ప్రాంతాల్లో సామాన్య ప్రజలే లక్ష్యంగా పేలుళ్లకు పాల్పడేందుకు పన్నాగం పన్నుతున్నట్లు తెలిసింది. అంతేకాకుండా మరి కొందరిలో ఉగ్రబీజాలు నాటేందుకు వీరంతా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో దాడులు నిర్వహించి వారందరినీ అరెస్టు చేశాం” అని ఎన్‌ఐఎకు చెందిన ఓ సీనియర్ అధికారి మీడియాకు వెల్లడించారు. ముర్షీద్ హసన్, యాకుబ్ బిస్వాస్, ముషారప్ హుస్సేన్‌లను కేరళలో అరెస్టు చేయాగా.. షకీబ్, అబు సోఫియాన్, మెయినల్ మోండల్, యీన్ అహ్మద్, మనుమ్ కమల్, రెహ్మాన్‌లను ముషీరాబాద్‌లో అరెస్టు చేసినట్లు చెప్పారు. వీరిని సంబంధిత కోర్టుల్లో హాజరుపరుస్తామని ఎన్‌ఐఎ అధికారులు తెలిపారు. కాగా శుక్రవారం నాడు కశ్మీర్‌లోని గుడీకల్ ప్రాంతంలో భారీ పేలుడు సామాగ్రీని భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడి తరహాలోనే మరోసారి విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని బలగాలు భావిస్తున్నాయి. ఆ ప్రాంతంలో 125 గ్రాముల చొప్పున మొత్తం 416 ప్యాకెట్లలో పేలుడు పదార్థాలు లభించాయని ఆర్మీ వెల్లడించింది. మరిన్ని సోదాలు నిర్వహించగా మరో ట్యాంక్‌లో 50 డిటోనేటర్లు కనుగొన్నామని పేర్కొంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో హోంశాఖ అధికారులు అప్రమ్తతమైయ్యారు.
భారీ ఉగ్రకుట్ర భగ్నం
RELATED ARTICLES