మరో 12 మందికి తీవ్ర గాయాలు
ఎపిలోని ఏలూరు జిల్లాలో రసాయన పరిశ్రమలో పేలిన రియాక్టర్
పరిశ్రమ మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లాలోని ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలో ఉన్న పోరస్ రసాయన పరిశ్రమలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్ర మాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పరిశ్రమలోని యూనిట్-4లో గ్యాస్ లీకై మం టలు చెలరేగి రియాక్టర్ పేలిపోయింది. ప్రమాదం సమయంలో 50 మందికిపైగా కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. మంటల ధాటికి ఆరుగురు మృతి చెందారు. ఘటనాస్థలంలోనే ఐదుగురు సజీవదహనమవగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరోకరు మృతి చెందారు. మృతుల్లో నలుగురు బీహార్ వాసులున్నట్లు గుర్తించారు. బాధితులను మొదట నూజివీడు ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడ జిజిహెచ్ తీసుకెళ్లారు. అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కొంతసేపటి తర్వాత మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఏలూరు ఎస్పి ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ రసాయన పరిశ్రమలో ఔషధాల్లో వాడే పొడిని తయారు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో నూజివీడు నుంచి విజయవాడ జిజిహెచ్కు మొత్తం 13 మందిని తీసుకొస్తుండగా.. మార్గం మధ్యలో ఒకరు చనిపోయారు. మిగతా 12 మందిలో ఒకరికి 4 శాతం గాయాలు కావడంతో అతడికి ప్రాథమిక చికిత్స అందించి స్థానిక ఆస్పత్రికి పంపేశారు. మిగిలిన 11 మంది బాధితులకు జిజిహెచ్ ఐసియులో చికిత్స అందించారు. ఈ 11 మందిలో 9 మంది 90శాతానికి పైగా, ఇద్దరు 40శాతానికి పైగా గాయాలైనట్లు బాధితులు తెలిపారు. ఈ 11మంది బాధితులను జిజిహెచ్ నుంచి మెరుగైన చికిత్స కోసం గొల్లపూడిలోని ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు. మృతులను మనోజ్ కుమార్(25), అబ్బూదాస్(27),కారు రవిదాస్(40),సువాస్ రవిదాస్(32),ముప్పూడి కిరణ్(25),కిష్టయ్యగా గుర్తించారు.
ఫ్యాక్టరీ మూసివేత
ప్రమాదం తరువాత ఫ్యాక్టరీని తాత్కాలికంగా మూసివేస్తున్నామని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ప్రమాద స్థలాన్ని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఏలూరు ఎంపి కోటగిరి శ్రీధర్, నూజీవీడు ఎంఎల్ఎ వెంకట అప్పారావు తదితరులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఫోరస్ ఫ్యాక్టరీని తాత్కాలికంగా మూసివేస్తున్నామని ప్రకటించారు. కాగా ఈ ప్రమాదంపై సీఎస్ సమీర్ శర్మ కలెక్టర్కు ఫోన్ చేసి ఆరా తీశారు. ప్రమాదం ఘటన ఎందుకు జరిగింది? ఎలా జరిగిందో దర్యాప్తు చేయాలని ఆదేశించారు. ఫోరస్ ఫ్యాక్టరీలో ప్రమాదానికి గల కారణాలను అధికారు బృందం దర్యాప్తు చేస్తుందన్నారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నంత కాలం కంపెనీ వేతనం చెల్లించనుందని కలెక్టర్ తెలిపారు. కంపెనీలోని రియాక్టర్ లో హై ప్రెషర్ వల్లే ప్రమాదం జరిగిందని తేలిందని కలెక్టర్ వివరించారు. ఈ ప్రమాదంపై విచారణ చేస్తున్నామన్నారు.
హాని కలిగించే పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహించదు: హోంమంత్రి
ప్రజలకు హానికలిగించే పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహించదని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. రసాయన పరిశ్రమలో జరిగిన ఘటనపై సిఎం జగన్ స్పందించి, పరిశ్రమను సీజ్ చేయటానికి ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. విజయవాడ గొల్లపూడిలో ఉన్న ఆంధ్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను హోం మంత్రి పరామర్శించారు. మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి రూ. 25లక్షలు, పరిశ్రమ నుంచి రూ.25లక్షలు సాయం అందిస్తున్నట్టు వివరించారు. గాయపడిన వారికి రూ.5లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించినట్టు హోంమంత్రి తెలిపారు. పరిశ్రమ నుంచి లీకేజీల వల్ల అక్కడి ప్రజలకు సమస్య ఉన్నట్టు గ్రామస్థులు తెలిపారని మంత్రి పేర్కొన్నారు.
వెంకయ్యనాయుడు, మోడీ సంతాపం..
ఏలూరు ఘటన అత్యంత విచారకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్కనాయుడు అన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
భారీ అగ్నిప్రమాదం ఆరుగురు కార్మికులు సజీవనం దహనం
RELATED ARTICLES