రెండు కొత్త బిల్లులు కార్మిక హక్కులను కాలరాయడమే
10 కేంద్ర కార్మిక సంఘాలు, ఐజెయు ఇతర సంఘాలు కన్నెర్ర
ఈ బిల్లులను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్
ప్రజాపక్షం/న్యూఢిల్లీ : కార్మిక చట్టాల క్రోడీకరణ పేరుతో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత చర్యలను కేంద్ర కార్మిక సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఇది కార్మిక రంగ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నమని పది కేంద్ర కార్మిక సంఘాలు ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, సిఐటియు, ఎఐయుటియుసి, టియుసిసి, ఎస్‌ఇడబ్ల్యుఎ, ఎఐసిసిటియు, హెచ్‌ఎంఎస్, ఎల్‌పిఎఫ్, యుటియుసిలతోపాటు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజెయు), ఇతర స్వతంత్ర సంఘా లు, సమాఖ్యలు విమర్శించాయి. ఈ మేరకు పది కేంద్ర కార్మిక సంఘాలు ఒక సంయుక్త ప్రకటనను బుధవారం నాడు విడుదల చేశాయి. రాజ్యాంగంలో పేర్కొన్న ఉమ్మడి జాబితాలో రాష్ట్ర పరిధితో నిమిత్తం లేకుండా మోడీ ప్రభుత్వం వివిధ కార్మిక చట్టాలను క్రోడీ కరించాలని నిర్ణయించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయం ప్రకటించారు. అలా ప్రకటించి ఇరవై రోజులు కూడా గడవక ముందే, జులై 23వ తేదీ మంగళవారం కోడ్ ఆన్ వేజెస్ బిల్ 2019, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండీషన్స్ కోడ్ బిల్ 2019లను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కార్మిక హక్కులను కాలరాసే ఈ బిల్లుల్లోని వివిధ నిబంధనలపై అభ్యంతరాలను, ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. కేంద్ర కార్మిక సంఘాలు లేవనెత్తిన కార్మిక ప్రయోజనాలపై విద్వేషాన్ని వెల్లగక్కుతోంది. కార్మికుల ప్రయోజనాలను కాపాడుతున్నామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు భిన్నంగా ఈ బిల్లులు కన్పిస్తున్నాయి. ప్రస్తుత చట్టాలు కార్మికులకు కల్పిస్తున్న ఎన్నో ప్రయోజనాలను ఈ కొత్త స్మృతి (కోడ్) కాలరాస్తోంది. 15వ భారత కార్మిక సదస్సు ఆమోదించిన వేతన గణన సూత్రాలను ఈ కొత్త వేతన స్మృతి పూర్తిగా నిరాకరిస్తున్నది. రప్తాకోస్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 25 శాతం వేతన అన్వయింపు సూత్రాన్ని 45, 46 భారత కార్మిక సదస్సులు కూడా ఏకగ్రీవంగా అంగీకరించాయి. కానీ దీన్ని కూడా కొత్త బిల్లులు విస్మరించాయి. కేంద్ర సర్కారు నియమించిన నిపుణుల కమిటీ కేంద్ర కార్మిక సంఘాల భాగస్వామ్యాన్ని గానీ, జాతీయ కనీస వేతన నిర్ధారణ, విధానంపై ఆ సంఘాలు సూచించిన పద్ధతులను కూడా పట్టించుకోలేదు. పైగా 2016 జనవరి 1న 7వ సిపిసి కనీస వేతనంగా రూ. 18,000ను సిఫార్సు చేయగా, కేంద్ర కార్మిక మంత్రి 2019 జులై 10న జాతీయ కనీస వేతనంగా రూ. 4628ను ఏకపక్షంగా ప్రకటించడం విడ్డూరం. ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండీషన్స్ కోడ్ బిల్లు ప్రస్తుతం అమల్లో ఉన్న 13 కార్మిక చట్టాల స్థానంలో రాబోతున్నది. అంటే దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలుగా పనిచేస్తున్న సంఘటిత, అసంఘటిత రంగాల్లో 90 శాతం మంది కార్మికులపై ఈ బిల్లు తీవ్రమైన ప్రభావం చూపుతుంది. గనులు, డాక్‌వర్కర్స్, భవనాలు, నిర్మాణ రంగ కార్మికులు, ప్లాంటేషన్ లేబర్, కాంట్రాక్ట్ లేబర్, ఇంటర్ స్టేట్ మైగ్రేంట్ వర్క్‌మెన్, వర్కింగ్ జర్నలిస్టులు, ఇతర పత్రికాసిబ్బంది, మోటారు ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్, సేల్స్ ప్రమోషన్స్ ఎంప్లాయీస్, బీడి, సిఆర్ వర్కర్స్, సినీ వర్కర్స్, సినిమా థియేటర్ వర్కర్స్ సంబంధించిన 13 ప్రత్యేక చట్టాలను ఇది రద్దు చేస్తుంది. అనేక పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న 8 గంటల పనిదినాన్ని కూడా ఈ కోడ్‌లో నిర్వర్తించకుండా ప్రభుత్వ ఇష్టఇష్టాలకు వదిలివేశారు.