నిమోనియాతో తనువు చాలించిన బెనర్జీ
కోల్‌కతా: భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్, లెజెండరీ ఆటగాడు ప్రదీప్ కుమార్ బెనర్జీ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుతూ శుక్రవారం కోల్‌కతాలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. నిమోనియా కారణంగా శ్వాసకోశ సమస్యలతో సుదీర్ఘ కాలం పాటు ఆయన పోరాడారు. మార్చి 2 నుండి ఆసుపత్రిలోనే ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం 12:40 గంటలకు తుదిశ్వాస విడిచారని చెప్పారు. బెనర్జీకి ఇద్దరు కుమార్తెలు. పౌలా, పూర్ణ ఇద్దరు కుమార్తెలు ప్రఖ్యాత విద్యావేత్తలు. ఇక తమ్ముడు ప్రసూన్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. 1962లో జకార్తాలో జరిగిన ఆసియా గేమ్స్‌లో ప్రదీప్ కుమార్ బెనర్జీ స్వర్ణం సాధించారు. భారత్ తరఫున 84 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించిన బెనర్జీ.. 65 గోల్స్ సాధించారు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆయన కోచ్‌గా కూడా పనిచేశారు. జూన్ 23, 1936లో పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురి శివార్లలోని మొయినాగురిలో ప్రదీప్ కుమార్ బెనర్జీ జన్మించారు. కొంత కాలం తర్వాత జంషెడ్‌పూర్‌లోని తన మామయ్య స్థలానికి మకాం మార్చారు. బెనర్జీ 1960 రోమ్ ఒలింపిక్స్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించారు. కఠిన ప్రత్యర్థి ఫ్రెంచ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌ను 1-1తో డ్రాగా ముగించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అంతకుముందు 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లోనూ భారత్‌లు ప్రాతినిధ్యం వహించారు. ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 4-2 తేడాతో భారత్ విజయం సాధించడంలో బెనర్జీదే ముఖ్య భూమిక. భారతీయ ఫుట్‌బాల్‌కు బెనర్జీ చేసిన సేవలకుగానూ ప్రపంచ పాలక మండలి ఫిఫా గుర్తించి 2004లో సెంటెనియల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రదానం చేసింది.
భారత ఫుట్‌బాల్ లెజెండరీ ప్రదీప్ మృతి
RELATED ARTICLES