సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజాతో సిపివి పొలిట్‌బ్యూరో సభ్యులు
హనొయ్ : భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ప్రధాన కార్యదర్శి డి.రాజా నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి వియత్నాం కమ్యూనిస్టు పార్టీ(సిపివి) ఘన స్వాగతం పలికింది. సిపివి పొలిట్‌బ్యూరో సభ్యులు లువాంగ్ కువాంగ్ సోమవారం నాడు వియత్నాం రాజధాని హనోయ్‌లో డి.రాజాను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజా నేతృత్వంలో వియత్నాంకు వెళ్ళిన సిపిఐ ప్రతినిధి బృంద సభ్యులు రామకృష్ణ పాండ, చాడ వెంకట్ రెడ్డి తదితరులతో సిపివి ప్రతినిధులు సమావేశమయ్యారు. ఆ దేశం సాధించిన విజయాలు, పార్టీ నిర్మాణం, ఇరుదేశాల మధ్య సంబంధాల గురించి చర్చించారు. ఉభయ దేశాల పార్టీలు, రాష్ట్రాలు, ప్రజల మధ్య సంఘీభావం, ప్రత్యేక స్నేహం నిరంతర వృద్ధి చెందుతుండడంపై సిపివి పొలిట్‌బ్యూరో సభ్యులు కువాంగ్ హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థుల గెలుపుపై అభినందనలు తెలియజేశారు. పార్టీ నిర్మాణం, అవినీతి వ్యతిరేక, సామాజిక ఆర్థిక అభివృద్ధి వంటి కీలక అంశాలపై సిపివి చురుకుగా చర్యలు తీసుకుంటున్నదన్నారు. సిపివి నేతృత్వంలో 40 ఏళ్ళలో సాధించిన ఘనతలకు చారిత్రక ప్రాధానత్య ఉన్నదని వివరించారు. ఈ సందర్భంగా డి.రాజా మాట్లాడుతూ సిపివికి సిపిఐ దృఢమైన సంఘీభావం ప్రకటిస్తున్నదని, వియత్నాం, భారతదేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి మద్దతునిస్తున్నదని పునరుద్ఘాటించారు. వియత్నాం పురోగతిని ప్రశంసిస్తూ, ఆ దేశంలో సమసమాజ నిర్మాణ ప్రక్రియను తాము దగ్గర నుంచి గమనిస్తున్నామని, 13వ జాతీయ పార్టీ మహాసభలో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించే సామర్థ్యం సిపివికి ఉన్నదని విశ్వాసం వ్యక్తం చేశారు. 14వ జాతీయ మహాసభ విజయవంతం కావాలని ఆకాంక్ష వ్యక్తంచేశారు. ప్రజలకు ప్రయోజనం కలిగించేందుకు, ఇరు దేశాల అభివృద్ధికి సిపివి అనుభవాలను తెలుసుకోవాలని భావిస్తున్నట్లు రాజా పేర్కొన్నారు. ఈ సందర్భంగా సాంప్రదాయంగా వస్తున్న స్నేహాన్ని బలోపేతం చేసుకోవాలని,ఇరు పార్టీల మధ్య ఫలప్రదమైన సహకారం పెంపొందించుకోవాలని, పార్టీ నిర్మాణం విధానాలు సహా నాలుగు దశాబ్దాలలో వియత్నాం సామాజిక ఆర్థిక అభివృద్ధి, సైద్ధాంతి, అనుభవ పాఠాలను పరస్పరం పంచుకోవాలని చర్చల్లో అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్థిక, వాణిజ్య, పెట్టుబడి, వ్యవసాయ, ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను విస్తరించాలని పేర్కొన్నారు. యువజన, మహిళా సంఘాలు సహా ప్రజా సంఘాల పరస్పర పర్యటనల ద్వారా ఉభయ పార్టీలు, దేశాల మధ్య సంఘీభావం, స్నేహం, సాంప్రదాయ సహకారం గురించి అవగాహన చేసుకోవచ్చని ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.