ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన
ఏడు పతకాలతో 48వ స్థానం
పతకాలు సాధించింది వీరే..
భారత్‌కు టోక్యో ఒలింపిక్స్‌లో ఏడు పతకాలు లభించాయి. వాటిలో ఒకటి స్వర్ణం, రెండు రజతాలుకాగా, మిగతా నాలుగు కాంస్య పతకాలు.
1. నీరజ్ చోప్రా (పురుషుల జావెలిన్ త్రో/ స్వర్ణం), 2. మీరాబాయ్ చాను (మహిళల 49 కిలోల వెయిట్‌లిఫ్టింగ్/ రజతం), 3. రవి కుమార్ దహియా (పురుషుల 57 కిలోల వెయిట్‌లిఫ్టింగ్/ రజతం), 4. పివి సింధు (మహిళల బాడ్మింటన్/ కాంస్యం), 5. లవ్లీనా బొర్గొహైన్ (మహిళల వెల్టర్‌వెయిట్ బాక్సింగ్/ కాంస్యం), 6. బజరంగ్ పునియా (పురుషుల 65 కిలోల రెజ్లింగ్/ కాంస్యం), 7. భారత పురుషుల హాకీ జట్టు (కాంస్యం).
టోక్యో : ప్రపంచ క్రీడా సంరంభం ఒలింపిక్స్‌కు ఆదివారం నాటి ముగింపు ఉత్సవంతో తెరపడింది. భారత్‌కు 48వ స్థానం దక్కడం క్రీడల్లో ఏ స్థాయిలో ఉన్నామనే విషయాన్ని స్పష్టం చేస్తున్నది. అమెరికా, చైనా జపాన్ వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. కాగా, జనాభా పరంగాప్రపంచంలోనే రెండో స్థానాన్ని ఆక్రమించిన భారత్‌కు పట్టుపని పది పతకాలు కూడా రాకపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తున్నది. ఒలింపిక్స్‌కు సంసిద్ధ పేరుతో వేల కోట్ల రూపాయలను ఖర్చుచేసినప్పటికీ ఫలితాలు ఆశాజనంగా లేవనే చెప్పాలి. అయితే, నాణానికి మరోవైపు చూస్తే, గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్ ఏడు పతకాలను కైవసం చేసుకుంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో ఆరు పతకాలు లభించగా, ఇప్పుడు అంతకంటే మెరుగైన ప్రదర్శనతో రాణించడం విశేషం. అంతేగాక, 1900 పారిస్ ఒలింపిక్స్‌లో బ్రిటిష్ ఇండియా తరఫున నార్మన్ పిచర్డ్ రెండు పతకాలను సాధించిన తర్వాత, భారత్ తొలిసారి ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకొని మెరిసిపోయింది. పురుషుల జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ పురుషుల 10 మీటర్ల షూటింగ్‌లో అభినవ్ బింద్రా స్వర్ణ పతకాన్ని సాధించగా, అతని తర్వాత ఇండివిజుల్ ఈవెంట్‌లో పసిడిని ఒడిసి పట్టుకున్న ఘనత నీరజ్‌కు దక్కుతుంది. పతకాల పరంగానేగాక, ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్‌లో మొట్టమొదటిసారి పతకాన్ని సాధించడంలోనూ టోక్యో ఒలింపిక్స్ భారత క్రీడా రంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయనే చెప్పాలి. అయితే, ఇలాంటి మేజర్ ఈవెంట్స్ వచ్చినప్పుడు తప్ప మిగతా సమయాల్లో క్రీడల గురించి ఆలోచించని ప్రభుత్వాలు ఇప్పటికైనా మారుతాయా అన్నది అనుమానమే. మొత్తం 18 క్రీడాంశాల్లో పోటీ పడేందుకు 126 మందిని భారత్ బరిలోకి దించింది. ఏడు పతకాలను గెల్చుకుంది.
ఒలింపిక్స్‌లో ‘టాప్ 10’ దేశాలు
1. అమెరికా (39 స్వర్ణం, 41 రజతం, 33 కాంస్యం-, మొత్తం 113 పతకాలు), 2. చైనా (38 స్వర్ణం, 32 రజతం, 18 కాంస్యం, మొత్తం 88 పతకాలు), ౩. జపాన్ (27 స్వర్ణం, 14 రజతం, 17 కాంస్యం, మొత్తం 58 పతకాలు) 4. గ్రేట్ బ్రిటన్ (22 స్వర్ణం, 21 రజతం, 22 కాంస్యం, మొత్తం 65పతకాలు), 5. రష్యన్ ఒలింపిక్ కమిటీ (డోపింగ్ నిబంధనలను పాటించని కారణంగా రష్యాపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిషేధం విధించింది. దీనితో రష్యా అథ్లెట్లు తమ దేశ ఒలింపిక్ కమిటీ పేరుతో టోక్యో ఒలింపిక్స్‌కు హాజరయారు. 20 స్వర్ణం, 28 రజతం, 23 కాంస్యం, మొత్తం 71పతకాలు), 6. ఆస్ట్రేలియా (17 స్వర్ణం, 7 రజతం, 22 కాంస్యం, మొత్తం 46 పతకాలు), 7. నెదర్లాండ్స్ (10 స్వర్ణం, 12 రజతం, 14 కాంస్యం, మొత్తం 36 పతకాలు), 8. ఫ్రాన్స్ (10 స్వర్ణం, 12 రజతం, 11కాంస్యం, మొత్తం 33 పతకాలు), 9. జర్మనీ (10 స్వర్ణం, 11 రజతం, 16 కాంస్యం, మొత్తం 37 పతకాలు), 10. ఇటలీ (10 స్వర్ణం, 10 రజతం, 20 కాంస్యం, మొత్తం 40 పతకాలు). భారత్ ఒక స్వర్ణం, రెండు రజతం, నాలుగు కాంస్యాలతో మొత్తం 7 పతకాలను గెల్చుకొని 48వ స్థానంలో నిలిచింది.