తొలి వన్డేలో ఆసీస్ ఘన విజయం
వార్నర్, పించ్ సెంచరీలు
10 వికెట్లతో టీమిండియాను చిత్తు చేసిన కంగారులు
చేతులెత్తేసి భారత టాప్ ఆర్డరర్స్
తేలిపోయిన బౌలింగ్ దళం
సిరీస్ 1-0 ఆధిక్యంలో ఆస్ట్రేలియా
ముంబయి : చాలా రోజుల తర్వాత టీమిండియా ఓ చెత్త ఓటమిని నమోదు చేసింది. అటు బ్యాటింగ్‌తో పాటు ఇటు బౌలింగ్‌లోనూ పేలవ ప్రదర్శన కనబర్చింది. ఫలితంగా
10 వికెట్లతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం వాంఖడే స్టేడియం వేదికగా భారత్‌తో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. టీమిండియా నిర్దేశించిన 256 పరుగుల విజయ లక్ష్యాన్ని 37.4 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా చేధించింది. ఆస్ట్రేలియా ఓపెనర్లు ఆరోన్ ఫించ్ 114 (110 బంతులు: 13×4, 2×6) సిక్సులు), డేవిడ్ వార్నర్ 128 (112 బంతులు: 17×4, 3×6)లు సెంచరీలు సాధించి ఆసీస్‌కు ఘన విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1–0 ఆధిక్యంలో నిలిచింది. అంతకముందు టీమిండియా 49.1 ఓవర్లలో 255 పరుగులు చేసి ఆలౌటైంది. ఫలితంగా ఆస్ట్రేలియాకు 256 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, కేన్ రిచర్డ్‌సన్‌లు చెరో రెండు వికెట్లు.. ఆడమ్ జంపా, ఆష్టన్ ఆగర్లు తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఆరంభంలో గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ(10) వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను శిఖర్ ధావన్ తన భుజాలకెత్తుకున్నాడు. కేఎల్ రాహుల్ కొంచెం నెమ్మదిగా ఆడినప్పటికీ… శిఖర్ ధావన్ మాత్రం చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ స్కోరు బోర్డుని నడిపించాడు. ఈ క్రమంలో 66 బంతుల్లో 9 ఫోర్లు సాయంతో శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ సాధించాడు. వన్డేల్లో ధావన్‌కు ఇది 28వ హాఫ్ సెంచరీ. వీరిద్దరి జోడీ 121 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత రాహుల్ ఔటయ్యాడు. జట్టు స్కోరు 134 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ ముంగిట ఆస్టన్ అగర్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత ఆరు పరుగుల వ్యవధిలోనే శిఖర్ ధావన్(91 బంతుల్లో 74, 9 ఫోర్లు, సిక్స్) సైతం ఔటయ్యాడు. దీంతో ఆరు పరుగుల వ్యవధిలో భారత్ రెండు కీలక వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా ఊరిస్తూ వేసిన బంతికి స్టయిట్ డ్రైవ్ కొట్టబోయి రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. అంతకుముందు బంతిని సిక్స్ కొట్టిన కోహ్లి.. ఆపై మళ్లీ బంతిని హిట్ చేద్దామనుకునే వికెట్‌ను సమర్పించుకున్నాడు. దాంతో భారత్ 156 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ను కోల్పోయింది. మరోవైపు శ్రేయస్ అయ్యర్(4) సైతం నిరాశపరిచాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ క్యారీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అవుట్ స్్ైడ ఎడ్జ్ తీసుకున్న బంతిని వికెట్ కీపర్ కేరీ సునాయాసంగా అందుకున్నాడు. దీంతో భారత్ కష్టాలు మరింత పెరిగాయి. అయ్యర్ స్థానంలో రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. రిషబ్ పంత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే, రిచర్డ్సన్ వేసిన 43వ ఓవర్ తొలి బంతికి రవీంద్ర జడేజా(25) ఆష్టన్ టర్నర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత జట్టు స్కోరు 229 పరుగుల వద్ద ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో రిషబ్ పంత్(28) కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆల్ రౌండర్ శార్ధూల్ ఠాకూర్(10 బంతుల్లో 13, 2 ఫోర్లు) కాస్త మెరుపులు మెరిపించినప్పటికీ…. మిచెల్ స్టార్క్ ఓ అద్భుతమైన బంతికి అతడిని పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్(17), మహ్మద్ షమీ(10) స్కోర్ పెంచే ప్రయత్నం చేశారు. కానీ, ఆసీస్ బౌలర్లు రాణించడంతో టీమిండియా 49.1 ఓవర్లలో 255 పరుగులు చేసి ఆలౌటైంది.
రాహుల్ హాఫ్ సెంచరీ మిస్..
134 పరుగుల జట్టు స్కోర్.. 27.1ఓవర్ల వద్ద కేఎల్ రాహుల్ ఔటయ్యాడు. హాఫ్ సెంచరీకి 3 పరుగుల దూరంలో రాహుల్ పెవిలియన్ చేరాడు. 61 బంతుల్లో 4 ఫోర్లతో కలిపి 47 పరుగులు చేయగలిగాడు. అగర్ బౌలింగ్ లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఎ్ండ లో ఓపెనర్ శిఖర్ ధావన్ దూకుడైన బ్యాటింగ్‌కు చక్కటి భాగస్వామ్యం అందించాడు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే మ్యాచ్ వాంఖడే స్టేడియం వేదికైంది. రెండో వన్డే గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఈ నెల 17న, మూడో వన్డే 19న బెంగుళూరులో జరుగనున్నాయి. పూర్తి స్థాయి బలాలతో రెండు జట్లు బరిలోకి దిగాయి. దీంతో ఈ వన్డే సిరీస్ హోరాహోరీగా జరగనుంది. సొంతగడ్డపై దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్, శ్రీలంకలతో వరుసగా గెలిచిన విరాట్ సేనకు..ఈ సిరీస్ అసలైన పరీక్ష కానుంది. 2019 మార్చిలో భారత్‌లోనే జరిగిన వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు టీమిండియా గెలవగా.. చివరి మూడు గెలిచిన ఆసీస్.. సిరీస్ సొంతం చేసుకుంది.
భారత్ బోర్లా!
RELATED ARTICLES