చెలరేగిన చాహల్, బుమ్రా.. రోహిత్ సెంచరీ
సౌతాఫ్రికా హ్యాట్రిక్ ఓటమి
ఐసిసి వన్డే వరల్డ్‌కప్-2019
లండన్: భారత జట్టు తొలి బోణి అదిరింది.. సమష్టిగా దంచారు…గెలిచారు.. బౌలర్లతో పాటు బ్యాట్స్‌మెన్లు సైతం అద్భుతంగా రాణించారు. 4 వికెట్ల నష్టానికి 230 పరుగులు సాధించారు. ఇదిలా ఉంటే రోహిత్‌శర్మ సెంచరీ చేసి జట్టు విజయానికి చేదోడుగా నిలిచాడు. బౌలర్లలో చాహల్ మాయ అందర్నీ ఆకట్టుకుంది. నాలుగు వికెట్లు సాధించి సౌతాఫ్రికాకు ముకుతాడు వేశాడు. బూమ్రా, భువనేశ్వర్ చెరో రెండు వికెట్లు తీసి తమ సత్తా చాటుకున్నారు. కులదీప్ యాదవ్ సైతం ఒక వికెట్ తీసి తన టాలెంట్ నిరూపించుకున్నాడు. ఇదిలా ఉంటే సౌతాఫ్రికా జట్టులో ప్రతి ఒక్కరూ 50 పరుగులలోపే ఔటయ్యారు. క్రిస్ మోరిస్ 42, ప్లెస్సిస్ (కెప్టెన్) 38, ఫెహ్లుక్వియో 34 పరుగుల వద్ద పెవిలియన్ బాట పట్టారు. ఇమ్రాన్ తాహిర్ అయితే ఖాతా తెరవకుండానే క్రీజ్‌ను వదిలాడు. మొత్తం మీద నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. భారత్ ఎదుట 228 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. సౌతాంప్టన్ వేదికపై భారత్ జట్ల మధ్య బుధవారం పోరు ఆరంభమైంది. భారత బౌలర్లు చెలరేగారు. అటు పేసర్లు, ఇటు స్పినర్లు దూకుడు సాగించడంతో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది.
సౌతాఫ్రికా బ్యాటింగ్ ఇలా…
హషిమ్ ఆమ్లా 6 పరుగుల తర్వాత బూమ్రా బౌలింగ్‌లో రోహిత్‌శర్మకు క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్) 10 పరుగులు చేసి బూమ్రా బౌలింగ్‌లో విరాట్ కోహ్లి చేతికి చిక్కాడు. ప్లెసిస్ (కెప్టెన్) 38 పరుగులు చేసి చాహల్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. డూసెన్ 22 పరుగుల వద్ద చాహల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయి వెనుదిరిగాడు. దుమిని 3 పరుగులు చేశాక కులదీప్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు అయ్యాడు. డేవిడ్ మిల్లర్ 31 పరుగుల వద్ద చాహల్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ఆండిలో ఫెహ్లుక్‌వాయో ౩4 పరుగుల వద్ద చాహల్ బౌలింగ్‌లో ధోనికి క్యాచ్ ఇచ్చాడు. క్రిస్ మోరిస్ 42 పరుగుల వద్ద భువనేశ్వర్ బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇమ్రాన్ తాహిర్ ఖాతా తెరవకుండానే భువనేశ్వర్ బౌలింగ్‌లో కేదర్‌కు క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. రబాదా 31పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇదిలా ఉండగా 5౦ ఓవర్లు ముగిసేటప్పటికీ సౌతాఫ్రికా జట్టు 9 వికెట్ల నష్టానికి 227 పరుగులు సాధించింది. భారత్ ఎదుట 228 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇదిలా ఉంటే భారత్ బౌలర్లలో బూమ్రా 2, కులదీప్ యాదవ్ 1, భువనేశ్వర్‌కుమార్ 2, చాహల్ 4 వికెట్లు తీసుకున్నారు.
భారత్ బౌలర్లు ఇలా…
భువనేశ్వర్ కుమార్ 10 ఓవర్లు వేసి 43 పరుగులిచ్చి 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. బూమ్రా 10 ఓవర్లు వేసి 35 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. హర్దిక్ పాండ్యా 6 ఓవర్లు వేసి 31 పరుగులిచ్చాడు. కులదీప్ యాదవ్ 10 ఓవర్లు వేసి 46 పరుగులిచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. యుజ్వేంద్ర చాహల్ 10ఓవర్లు వేసి 51 పరుగులిచ్చి 4 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కేదార్ జాదహ్వ్ 4 ఓవర్లు వేసి 16 పరుగులిచ్చాడు.
భారత్ బ్యాటింగ్ ఇలా..
228 పరుగుల లక్ష్యంతో భారత్ బ్యాట్స్‌మెన్లు బరిలోకి దిగారు. శిఖరథావన్ 8 పరుగుల వద్ద రబదా బౌలింగ్‌లో కాక్‌కు క్యాచ్ ఇచ్చాడు. విరాట్ కోహ్లి 18 పరుగుల వద్ద ఫెహ్లువియో బౌలింగ్‌లో కాక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. లోకేష్ రాహుల్ 26 పరుగుల వద్ద రబదా బౌలింగ్‌లో ప్లెస్సిస్‌కు క్యాచ్ రూపంలో దొరికాడు. ధోని 34 పరుగుల వద్ద క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రోహిత్ శర్మ 122, హర్దిక్ పాండ్యా 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఇదిలా ఉండగా రబదా 2, ఫెహ్లుక్వియో 1, క్రిస్ మోరిస్ 1 వికెట్ సాధించారు.
సౌతాఫ్రికా బౌలింగ్ ఇలా..
ఇమ్రాన్ తాహిర్ 10 ఓవర్లు వేసి 58 పరుగులిచ్చాడు. రబాదా 10 ఓవర్లు వేసి 39 పరుగులిచ్చి 2 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. క్రిస్ మోరిస్ 10 ఓవర్లు వేసి 36 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. ఫెహ్లుక్వియో 8.3 ఓవర్లు వేసి 40 పరుగులిచ్చి 1 వికెట్ తీసుకున్నాడు.తబ్రిజ్ షమ్సి 9 ఓవర్లు వేసి 54 పరుగులిచ్చాడు.
భారత్ బోణీ
RELATED ARTICLES