తొలిరోజు సార్వత్రిక సమ్మె ప్రశాంతం
బంద్‌లో పాల్గొన్న పది కార్మిక సంఘాలు
ప్రభుత్వకార్యాలయాలు, బ్యాంకులపై తీవ్ర ప్రభావం
స్తంభించిన రవాణా వ్యవస్థ
పలుచోట్ల రాస్తారోకో, రైలురోకో, నిరసనలు
న్యూఢిల్లీ : కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, ఏకపక్ష కార్మికచట్టాల సంస్కరణలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు మంగళవారం దేశవ్యాప్తంగా బంద్ చేపట్టాయి. పది కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా సంఘటిత, అసంఘటిత కార్మికులు బుధవారం విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. బుధవారం కూడా ఈ సమ్మె కొనసాగనుంది. బంద్ ప్రభావం అసోం, మేఘాలయ, కర్నాటక, మణిపూర్, బీహార్, రాజస్థాన్, గోవా, పంజాబా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, హర్యానాతో పాటు ప్రత్యేకించి వివిధ ఖనిజాలు, పరిశ్రమలే లక్ష్యంగా మారిన ప్రాంతాల్లో తీవ్రంగా ఉందని ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్ కౌర్ మీడియాకు వెల్లడించారు. కొన్ని రాష్ట్రాల్లో రవాణా విభాగాలు, ట్యాక్సీ డ్రైవర్లు, ఆటోరిక్షా డ్రైవర్లు కూడా ఈ రెండు రోజుల బంద్‌లో పాల్గొన్నారన్నారు. అదే విధంగా రైల్వే కార్మికులు గేట్ మీటింగ్‌లను నిర్వహించి బంద్‌కు సంఘీభావం ప్రకటించారని ఆమె చెప్పారు. కార్మిక సంఘాలు చేపట్టిన బంద్‌కు జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్లు కూడా సంఘీభావం తెలిపారని, ఇతర విద్యాసంస్థల యూనియన్లు కూడా మద్దతు తెలుతారని ఆశిస్తున్నామని ఆమె అన్నారు. భోపాల్‌లో రవాణా సంస్థ పూర్తిగా మూతపడిందని, హర్యానాలో కూడా రవాణా సంస్థ కార్మికులు బంద్‌లో పాల్గొన్నారన్నారు. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నియత, అనియత రంగాలకు చెందిన కార్మికులు పెద్ద ఎత్తున బంద్‌లో పాల్గొన్నారని కౌర్ చెప్పారు. టెలికాం రంగం, ఆరోగ్యం, విద్య, గని, స్టీల్, విద్యుత్, బ్యాంకింగ్, బీమా, రవాణా రంగాలు సమ్మెకు మద్దతు ఇచ్చాయన్నారు. బుధవారం దేశ రాజధాని ఢిల్లీలోని మండి హౌస్ నుంచి పార్లమెంట్ వరకు అన్ని యూనియన్లు కలిసి నిరసన ప్రదర్శనను నిర్వహిస్తాయని చెప్పారు. ఈ నిరసన ప్రదర్శనలు దేశవ్యాప్తంగా కూడా కొనసాగుతాయన్నారు. కార్మిక సంఘాల 12 డిమాండ్లను పరిష్కరించడంలో, ఉద్యోగాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆమె విమర్శించారు. సెప్టెంబర్ 2,2015 న సమ్మె చేపట్టిన నాటి నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన గల మం త్రుల బృందం ఇప్పటి వరకు ఎలాంటి చర్చలకు యూనియన్లను పిలువలేదని కౌర్ స్పష్టం చేశారు. కాగా, సమ్మె లో పది కేంద్ర కార్మిక సంఘాలైన ఐఎన్‌టియుసి, ఎఐటియుసి, హెచ్‌ఎంఎస్, సిఐటియు, ఎఐయుటియు సి, టియుసిసి,ఎస్‌ఇడబ్ల్యుఎ,ఎఐసిసిటియు,ఎల్‌పిఎఫ్, యు టియుసిలు పాల్గొన్నాయి. అయితే ఆర్‌ఎస్‌ఎస్ అనుబం ధ భారతీయ మజ్దూర్ సంఘ్(బిఎస్‌ఎస్) పాల్గొనలేదు. ఈ కార్మిక సంఘాలన్నీ ట్రేడ్ యూనియన్ చట్టం 1926 లో సవరణలు ప్రతిపాదించడాన్ని వ్యతిరేకించాయి.