బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా చిత్తు
సిరీస్‌లో 2- ఆధిక్యం
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో భారత్ 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆదివారం మిగిలిన రెండు వికెట్లు పడగొట్టి భారత్ విజయ లాంఛనాన్ని పూర్తి చేసింది. కొద్ది సేపు వర్షం అంతరాయం కలిగించినా చివరికి లంచ్ తర్వాత టీమిండియా చారిత్రక గెలుపును అస్వాధించింది. ఈ విజయంతో భారత్ ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన టెస్టులో విజయాన్ని నమోదు చేసిన భారత్ ఈ బాక్సింగ్ డే టెస్టులో తొలి విజయాన్ని అందుకొని కొత్త చరిత్ర సృష్టించింది. 399 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా (89.3 ఓవర్లలో) 261 పరుగులకే ఆలౌటైపోయింది. దీంతో భారత్‌కు 137 పరుగుల విజయం దక్కింది. భారత బౌలర్లు ఆసాధారణ బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. వీరి ధాటికి ఆతిథ్య ఆసీస్ జట్టు కుదేలైంది. ఈ విజంయతో భారత్ నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2- ఆధిక్యం సాధించింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్స్‌లో పాట్ కమ్మిన్స్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. శనివారమే ముగియాల్సిన భారత విజయం కమ్మిన్స్ వల్లే ఆదివారానికి వాయిదా పడింది. అయితే ఆదివారం చివరి రోజు 258/8 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా భారత బౌలర్ల ధాటికి 261 పరుగులకే ముగిసింది. అర్ధ శతకంతో రాణించిన ఆల్‌రౌండర్ కమ్మిన్స్ (63; 114 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్)ను జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బంతితో పెవిలియన్ పంపాడు. తర్వాత నాథన్ లియాన్ (50 బంతుల్లో 7)ను ఇషాంత్ శర్మ ఔట్ చేసి ఆసీస్ ఓటమిని ఖరారు చేశాడు. అద్భుత బౌలింగ్‌తో చెలరేగిన జస్ప్రీత్ బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 9 వికెట్లు పడగొట్టిన బుమ్రా తొలి ఇన్నింగ్స్‌లో ఆరు, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ విజయంతో భారత్ 150వ టెస్టు విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఐదో జట్టుగా భారత్ నిలిచింది.
భారత్ చారిత్రక విజయం
RELATED ARTICLES