కాట్సా చట్టం ప్రయోగం..?
రష్యా నుండి ఎస్ కొనుగోలు చేసినందుకే..
యుఎన్‌లో మూడుసార్లు ఓటింగ్‌కు దూరంగా ఉండటం కూడా కారణమే!
వాషింగ్టన్ : భారత్‌పై అమెరికా ఆంక్షలు అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు దక్షిణ,మధ్యాసియా వ్యవహారాల సహాయ కార్యదర్శి డోనాల్డ్ లూ చూచాయిగా అమెరికా చట్టసభ సభ్యులకు తెలియజేశారు. రష్యా నుండి యుద్ధరంగానికి సంబంధించిన అత్యంత కీలకమైన ఎస్ క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసినందుకే భారత్‌పై ‘కాట్సా’ చట్టం (కౌంటరింగ్ అమెరికా యాడ్వెరీర్సీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్) అమలు చేసే ఆలోచనలో ఉందని ఆయన అన్నారు. ఇరాన్, ఉత్తర కొరియా లేదా రష్యాల నుండి అత్యంత కీలకమైన యుద్ధరంగ సాంకేతిక పరిజ్ఞానం గల ఆయుధాలు కొనుగోలు చేసిన దేశాలపై ఆంక్షలు అమ లు చేయాలంటే దేశీయంగా ఒక చట్టం ఉండాలి. అందుకే శత్రుదేశాలను అడ్డుకునేందుకు అంక్షలు అమలు చేయడం కోసం కాట్సా చట్టం పనికొస్తుంది. 2014లో రష్యా అక్రమంగా దాడిచేసి తన పొరుగున ఉన్న క్రిమియాను తన దేశంలో కలిపేసుకోవడం, 2016లో అమెరికాలో జరిగిన ఎన్నికల్లో రష్యా ఓటర్లనుప్రభావితం చేసేందుకు అనవసర జోక్యం చేసుకోవడం వంటి ఆరోపణలు చేస్తూ రష్యాపై గుర్రుగా ఉన్న అమెరికా భారత్ ఎస్ కొనుగోలు చేసినందుకు కాట్సా చట్టం భారత్‌పై ప్రయోగించేందుకు ఇదే సరైన తరుణంగా భావిస్తున్నట్లు డోనాల్ట్ లూ సంకేతాలిచ్చారు. సమీప తూర్పు, దక్షిణాసియా,మధ్య ఆసియాపై పనిచేసే విదేశీ వ్యవహారాల సెనేట్ ఉప కమిటీ సమావేశంలో సభ్యులు భారత్‌పై కాట్సా చట్టం ప్రయోగించడంపై లేవనెత్తిన ప్రశ్నకు డోనాల్డ్ లూ జవాబిస్తూ, ఈ చట్టాన్ని భారత్‌కు వర్తింపజేయాలా? లేక ఆంక్షలు అమలు చేయకుండా రద్దు చేయాలా? అనే విషయాన్నే అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఆలోచిస్తున్నారని చెప్పారు. నేను మీకు గట్టిగా హామీ ఇవ్వలేను, కాట్సా చట్టాన్ని పరిపాలనావిభాగం పరిశీలిస్తోంది, ఆ చట్టాన్ని పూర్తిగా భారత్‌పై అమలు చేయాలా అనే విషయంపై కాంగ్రెస్‌ను సంప్రదిస్తోంది, మనం ఈ విషయంలో వాళ్ళల్లో ఎవరినైనా వివరంగా అడిగి తెలుసుకోవాలన్నారు.అయితే అక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయాన్ని దురదృష్టవశాత్తూ తాను చెప్పలేని స్థితిలో ఉన్నానని, నిర్ణయాల గురించి మాట్లాడితే అది ముందస్తు తొందరపాటు ఆలోచన అవుతుందని ఆయన అన్నారు. దేశాధ్యక్షుడు లేదా విదేశాంగ శాఖామంత్రి ఈ చట్టం కింద ఆంక్షలను రద్దు చేసే సమస్యగురించి లేదా అంక్షలు అమలు చేసే అంశంతోపాటు ఉక్రేన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ఈ అంశం తోకమీదకు వస్తుందా లేదా అనే విషయంపై ప్రకటన చేస్తారన్నారు. బైడెన్ పాలనా యంత్రాంగం ఇంకా ఈ విషయంపై కాట్సా చట్టం అమలు చేయడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. వాస్తవానికి అమెరికాకు ప్రస్తుతం భారతదేశం ఒక అతిముఖ్యమైన భద్రతా భాగస్వామి అని, భారత్‌కు తామెంతో విలువ ఇస్తామని, ఈ విలువైన భాగస్వామితో కలిసి ముందుకు కొనసాగేందుకే తాము ప్రాధాన్యమిస్తామని, అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటూ ఉన్న తరుణంగా భారతదేశం తదుపరి రష్యాకు దూరంగా ఉండటానికి ఇదే సరైన తరుణంగా ఉంటుందని, ఈ విషయంలో తాము ఆశాభావంతో ఉన్నామని ఆయన అన్నారు. రష్యా బ్యాంకింగ్ వ్యవస్థపై సమూలమైన ఆంక్షలు విధించి వాటిని అమలు చేస్తున్న తరుణంలో రష్యా నుండి యుద్ధరంగంలో అత్యంత ప్రధానమైన ఆయుధాలు కొనుగోలు చేయడం ఏ దేశానికైనా కష్టంగా ఉంటుందని ఆయన అన్నారు. గడచిన కొన్ని వారాలుగా భారత్‌ను తాము గమనిస్తున్నామని, మిగ్ యుద్ధ విమానాల ఆర్డర్‌ను రద్దు, రష్యా హెలికాప్టర్ల ఆర్డర్లు, యుద్ధ శకటాల విధ్వంస ఆయుధాల ఆర్డుర్లు రద్దు గురించి తాము ఎదురుచూస్తున్నామన్నారు. ఉక్రేన్‌పై రష్యా ఫిబ్రవరి 24వ తేదీన దాడి ప్రారంభించిన మరునాడు 25వ తేదీ భద్రతా మండలిలో రష్యాకు వ్యతిరేకంగా జరిగిన ఓటింగ్‌లో భారత్ దూరంగా ఉండిపోయింది. తరువాత ఫిబ్రవరి 27వ తేదీన జనరల్ అసెంబ్లీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం కోసం జరిగిన భద్రతామండలి లాంఛనపూర్వకమైన సమావేశంలో కూడా ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. మూడోసారి బుధవారంనాడు మార్చి 2వ తేదీన జరిగిన ఓటింగ్‌లో కూడా పాల్గొనకుండా భారత్ దూరం పాటించడంతో అమెరికా తన వైఖరిని తెలియజేయడానికి, భారత్‌ను అదుపులో పెట్టడానికే కాట్సా చట్టం ప్రస్తావనను ముందుకు తెచ్చినట్లు భావిస్తున్నారు. బుధవారంనాడు జరిగిన ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉండటంతో అమెరికా కాంగ్రెస్‌లో అటు డెమోక్రాట్లు, ఇటు రిపబ్లికన్లు కూడా భారత్‌ను తప్పుపట్టారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అత్యవసర సమావేశంలో మొత్తం 141 దేశాలు ముక్తకంఠంతో రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేశాయి. రష్యా దాడిని ఖండించాయి. ఉక్రేన్‌కు మద్దతుగా నిలిచాయి. భారత్ సహా 35 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండగా, ఐదు దేశాలు మాత్రం రష్కాకు అనుకూలంగా స్పందించాయి. ఉక్రేన్ అనుకూల తీర్మానాన్ని వ్యతిరేకించాయి. భద్రతామండలి రెండోసారి సమావేశంలో తీర్మానానికి తొమ్మిదిఓట్లు సరిపోతాయి. కానీ 11 దేశాలు ఉక్రేన్‌కు అనుకూలంగా ఓటు వేశాయి. మొదటిసారి రష్యా వీటో పవర్ ఉపయోగించి తీర్మానాన్ని నెగ్గకుండా చేసింది. రెండోసారి ఆ అవకాశం లేకపోవడంతో రష్యా వ్యతిరేకంగా ఓటు వేసింది. మూడోసారి జనరల్ అసెంబ్లీలో కూడా రష్యా వ్యతిరేక తీర్మానానికి భారత్ దూరంగా ఉండిపోయింది.2018 అక్టోబరులో భారత్ రష్యా మధ్య ఐదు బిలియన్ డాలర్ల ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందం కింద ఎస్ గగనతలాన్ని రక్షించుకోవడం కోసం శత్రుదేశాల యుద్ధవిమానాలపై ప్రయోగించే క్షిపణి వ్యవస్థను భారత్‌కు సరఫరా చేసేందుకు ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం తమకు ఇష్టం లేకుండా జరుగుతోందని, ఒప్పందం చేసుకోవద్దని అమెరికా హెచ్చరిక చేసినప్పటికీ భారత్ తన దేశ భద్రత దృష్ట్యా ఆంక్షలకు సిద్ధపడే ఈ ఒప్పందం రష్యాతో కుదుర్చుకుంది. ఇదే ఇప్పుడు ఉక్రేన్‌తో రష్యా యుద్ధం నేపథ్యంలో ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉన్న పూర్వరంగంలో ప్రధాన అంశంగా ముందుకు వచ్చింది.