నేడు న్యూజిలాండ్‌తో రెండో టి20
ఆత్మవిశ్వాసంతో విలియమ్సన్ సేన
సిరీస్ కాపాడుకునేందుకు టీమిండియా కసరత్తులు
ఉ॥ 11:30 నుంచి స్టార్ నెట్‌వర్క్‌లో ప్రసారం
ఆక్లాండ్: న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన తొలి టి20లో ఘోర ఓటమిని చవిచూసిన టీమిండియాకు రెండో టి20 చావోరేవోగా మారింది. ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలిస్తేనే సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంచుకోగలదు. మరోవైపు విజయంతో జోరుమీదున్న న్యూజిలాండ్ రెండో మ్యాచ్‌తోనే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. కలిసికట్టుగా రాణించి మరో విజయం సాధిస్తామని ఆతిథ్య కివీస్ దృఢ సంకల్పంతో ఉంది. నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో టి20 మ్యాచ్ జరగనుంది. ఒకవైపు కివీస్ జట్టు ఆత్మవిశ్వాసంతో బరిలో దిగుతుంటే.. మరోవైపు రోహిత్ సేన సిరీస్‌ను కాపాడుకునేందుకు అన్ని విధాలుగా సిద్ధమై మైదానంలో అడుగుపెట్టనుంది. ఇక బుధవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో విఫలమైంది. ముందు బౌలింగ్, ఫీల్డింగ్‌లో విఫలమై భారీ పరుగులను సమర్పించుకుంది. ఆ తర్వాత ఛేదనలో బ్యాట్స్‌మెన్స్ చేతులెత్తేయడంతో 80 పరుగులతో భారీ ఓటమి పాలైంది. అంతేకాకుండా పరుగుల పరంగా అతి పెద్ద ఓటమిగా చెత్త రికార్డును కూడా మూటగట్టుకుంది. ఇక శుక్రవారం ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగే రెండో టి మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో జరిగిన తప్పులను పునరావృతం కాకుండా చూసుకుంటామని భారత సారథి రోహిత్ శర్మ అన్నాడు. ఆ తప్పులను నుంచి తమ ఆటగాళ్లు గుణపాఠాలు నేర్చుకుంటున్నారని ఆయన పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో కొన్ని మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది.
జట్టులో మార్పులు..
గత మ్యాచ్‌లో బౌలింగ్‌లో విఫలమైన ఖలీల్ అహ్మద్ స్థానంలో సిద్దర్థ్ కౌల్ లేదా మహ్మద్ సిరాజ్‌ను ఆడించే అవకాశం ఉంది. ఖలీల్ అహ్మద్‌కు రెండు, మూడు అవకాశాలు ఇచ్చిన అతను తన ఉనికిని చాటుకోలేకపోయాడు. మరోవైపు వన్డే సిరీస్‌లో హైదరాబాదీ పేస్ బౌలర్ సిరాజ్‌కు ఒక అవకాశం లభించినా అతను దానిని సద్వినియోగ పరుచుకోలేకపోయాడు. ఇక టి20 సిరీస్‌లో భారత జట్టులో చోటు దక్కించుకున్న సిద్దార్థ్ కౌల్ తుది జట్టులో మాత్రం అవకాశం లభించలేదు. ఇక రెండో టి20 ద్వారా ఇతను తుది జట్టులో చోటు సంపాదించుకునే అవకాశాలు మెరుగ్గా కనపడుతున్నాయి. స్పిన్నర్ల విషయంలో కూడా ఒక మార్పు జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రధాన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు రెండో మ్యాచ్‌లో ఆడే అవకాశాలు మెరుగ్గా కనపడుతున్నాయి. గత మ్యాచ్‌లో కృనాల్ పాండ్యా, యాజువేంద్ర చాహల్ పర్వాలేదనిపించారు. కానీ సిరీస్ కాపాడుకోవడానికి భారత్‌కు ఇది చివరి అవకాశం. అందుకే తమ పూర్తి బలగాలతో బరిలో దిగాలని టీమిండియా భావిస్తోంది. అందుకే చాహల్ స్థానంలో చైనామన్ బౌలర్ కుల్దీప్ తుది జట్టులో వస్తాడనే వార్తాలు వినిపిస్తున్నాయి. ఇక టెస్టుల్లో చెలరేగిన యువ సంచలనం రిషభ్ పంత్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రాణించలేకపోతున్నాడు. ఇతనికి కొన్ని అవకాశాలు లభించినా తన పూర్తి స్థాయి ఆటను ప్రదర్శించలేకపోయాడు. కివీస్‌తో జరిగిన తొలి టి20లోనూ (4) పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచాడు. కానీ పంత్‌కి పరిమిత ఓవర్ల క్రికెట్లో మరిన్ని అవకాశాలు ఇవ్వాలని సీనియర్లు కోరుతున్నారు. ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ దృశ్య పంత్‌కు బ్యాట్స్‌మన్‌గా తన సత్తా చాటుకునేందుకు మరిన్ని అవకాశాలు కల్పించాలని మాజీలు అభిప్రాయపడుతున్నారు. వన్డే సిరీస్‌లో విఫలమైన యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు పొట్టి సిరీస్‌లో మరో అవకాశం ఇస్తారన్న విషయం ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.
రోహిత్ బ్యాట్ ఝుళిపించాలి..
గత కొన్ని మ్యాచుల్లో విఫలమవుతున్న భారత తాత్కాలిక సారథి రోహిత్ శర్మ ఈ కీలక మ్యాచ్‌లో తన సత్తా చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మ్యాచ్‌లో నెగ్గితేనే సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంటాయి. అందుకే ఓపెనర్‌గా బరిలో దిగే రోహిత్ శర్మ తన బ్యాట్‌ను ఝుళిపించాల్సిన సమయం ఆసన్నమైంది. మరో ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి భారత్‌కు మంచి ఆరంభాన్ని అందించాలని అందరూ ఆశిస్తున్నారు. వీరిద్దరూ చెలరేగితే ఎంత పెద్ద టార్గెట్ అయినా సరే భారత్ ఈజీగా ఛేదించగలుగుతుంది. రోహిత్ ఒకసారి తన పాత ఫామ్‌ను అందుకుంటే చాలు కివీస్ బౌలర్లు బోల్తా పడడం ఖాయం. ఇతను క్రీజులో ఉన్నంత సేపు పరుగుల వరద పారిస్తాడు. ఇతనికి ధావన్ తోడైతే ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్లు అయినా సరే చేమటలు పట్టాల్సిందే. వీరి జోరును అడ్డుకోవడం ఎవరి తరం కాదనే చెప్పాలి. ఇక శుక్రవారం జరిగే మ్యాచ్‌లో ఈ ఓపెనర్లు రాణించి భారత్‌కు శుభారంభం అందించాలని అందరూ ఆశిస్తున్నారు.
టాప్ ఆర్డర్‌పైనే భారం..
ఓపెనర్లు విఫలమైనా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ జట్టు భారాన్ని మోయాలి. అందరూ కలిసికట్టుగా రాణించి భారీ స్కోరు అందించాలి. కీలక భాగస్వామ్యాలు ఏర్పర్చడం ముఖ్యం. ప్రతి వికెట్‌కి కనీసం 30 పరుగులు జోడించాలి. ఒకరు తేలిపోయినా మరొకరూ ఆదుకోవాలి. టీమ్ వర్క్‌గా ముందుగా సాగాలి. అప్పుడే మంచి ఫలితాలు రాబట్టవచ్చు. తొలి మ్యాచ్‌లో కీవిస్ ఆటను చూసి మనం పాఠాలు నేర్చుకోవాలి. వారందరూ ఒకరిపై మరొకరు ఆధారపడకుండా మంచి పరుగులు సాధించారు. ఎవరికీ వారు దూకుడుగా ఆడుతూ పోయారు. అందుకే 219 పరుగుల భారీ స్కోరును నమోదు చేయగలిగారు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. వేగంగా ఆడుతూ పరుగులు సాధించాడు. శంకర్ ఇప్పటి వరకు ఆడిన దాదాపు అన్ని మ్యాచుల్లో మెరుగైన ప్రదర్శనలు చేశాడు. రిషభ్ పంత్ తన సత్తా చాటుకోవాల్సిన సమయం వచ్చేసింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పోటీ ఎక్కువగా ఉండడంతో తన ప్రదర్శనను ఇంకా మెరుగు పర్చుకోవాలి. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇక సీనియర్ బ్యాట్స్‌మన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. చాలా మ్యాచుల్లో భారత్‌కు అండగా నిలిచాడు. కీలకసమయాల్లో రాణిస్తున్నాడు. చివరి మ్యాచ్‌లోనూ అతనే టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేశాడు. ఇక లోయర్ ఆర్డర్‌లో దినేష్ కార్తిక్, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా రాణించాల్సిన అవసరం ఉంది. గత మ్యాచ్‌లో వీరిద్దరూ అనవసరమైన షాట్లు కొట్టే ప్రయత్నంలో ఔటయ్యారు. వీరి షాట్ సెలక్షన్ తప్పుగా ఉంది. ఈసారైనా వీరు తెలివిగా ఆడాలని కెప్టెన్ ఆశిస్తున్నాడు. చెత్త బంతులను భారీ షాట్లు ఆడితే చాలని, కఠినమైన బంతులను సింగిల్స్, డబుల్స్ తీస్తూ పోవాలని వీరికి సూచించడం జరిగింది. మీది బ్యాట్స్‌మెన్స్ విఫలమైతే జట్టు భారం వీరిపైనే ఎక్కువగా ఉంటుంది. ఈసమయంలో వీరు జాగ్రత్తగా ఆడాలి. తమ వికెట్లను కాపాడుకుంటునే పరుగులను రాబట్టుకోవాలి. ఈ సమయంలో వికెట్లు కాపాడుకోవడం ఎంతో కీలకం.
పరుగులు నియంత్రించాలి..
బౌలర్లు పరుగులను సమర్పించకుండా నియంత్రించుకోవాలి. బుధవారం జరిగిన మొదటి టి20లో టీమిండియా బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. సీనియర్ భువనేశ్వర్ కుమార్‌తో పాటు, యువ ఆటగాళ్లు ఖలీల్ అహ్మద్, హార్దిక్ పాండ్యా భారీగా పరుగులు ఇచ్చుకున్నారు. స్పిన్నర్లు పర్వాలేదనిపించినా పేసర్లు మాత్రం తేలిపోయారు. ఇక శుక్రవారం జరిగే మ్యాచ్‌లో వీరు తమ తప్పులను సరిదిద్దుకొని మైదానంలో అడుగుపెడుతున్నారని బౌలింగ్ కోచ్ అన్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సిరీస్‌పై కన్నేసిన కివీస్..
మొదటి మ్యాచ్ గెలిచి జోరుమీదున్న విలియమ్సన్ సేన ఇక సిరీస్‌పై కన్నే సింది. గత మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో అద్భుతంగా పోరాడిని కివీస్ జట్టు భారీ విజయాన్ని సాధించింది. అదే జోష్‌తో ఈ రెండో టి20 కూడా గెలవాలని భావిస్తోంది. గుప్టిల్ స్థానంలో జట్టులోకి వచ్చిన యువ ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ తొలి మ్యాచ్‌లోనే ఇరగదీశాడు. ఇత నిపై మరోసారి జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. బౌలింగ్‌లోనూ కివీస్ పటిష్టంగా ఉంది. టిమ్ సౌథీ 17 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఇతర బౌలర్లు సైతం మెరుగైన ఆటను కనబర్చడంతో కివీస్ తొలి టి20లో ఘన విజయం సాధించింది. ఇక రెండో మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించి ఈ మ్యాచ్‌లోనే సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో కివీస్ రెట్టింపైన ఆత్మవిశ్వాసంతో బరిలో దిగుతోంది.
భారత్‌కు చావోరేవో..
RELATED ARTICLES