నేడు బెల్జియంతో కీలక పోరు, హాకీ ప్రపంచకప్
రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్‌లో ప్రత్యక్ష ప్రసారం
భువనేశ్వర్: పురుషుల హాకీ ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో విజయం సాధించి జోరుమీదున్న భారత్‌కు అసలైన పరీక్ష నేటి మ్యాచ్‌లో ఎదురుకానుంది. పూల్-సిలో భాగంగా ఆదివారం జరిగే మ్యాచ్‌లో భారత జట్టు పటిష్టమైన బెల్జియంతో తలపడనుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ కంటే బెల్జియం మెరుగ్గా ఉంది. భారత్ ఐదో ర్యాంక్‌లో ఉంటే.. బెల్జీయం మూడో ర్యాంక్‌లో కొనసాగుతున్నది. గత కొన్నేళ్లుగా బెల్జియం మంచి ఫామ్‌లో ఉంది. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో రన్నరప్‌గా నిలిచి రజత పతకం సొంతం చేసుకున్న బెల్జియం జట్టు ప్రస్తుతం భారత్ కంటే బలంగానే కనిపిస్తోంది. కానీ ఈ ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో 5-0తో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా కూడా జోరుమీదుంది. ఆరంభపు మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన భారత్ అదే జోరును మిగతా మ్యాచుల్లో కూడా కొనసాగించేందుకు సిద్ధంగా ఉంది. భారత జట్టులో సీనియర్లతో పాటు యువ ఆటగాళ్లు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. ఇప్పటి వరకు తమ పూల్‌లో భారత జట్టే అందరికంటే ఎక్కువ గోల్స్ నమోదు చేసింది. మొదటి మ్యాచ్‌లో టీమిండియా ఐదు గోల్స్‌తో చెలరేగిన విషయం తెలిసిందే. భారత్ తరఫున సిమ్రన్‌జీత్ సింగ్ రెండు గోల్స్ చేస్తే.. మన్‌దీప్ సింగ్, అకాశ్ దీప్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్ తలొక గోల్ సాధించి విజయంలో తమవంతు సహకారం అందించారు. మరోవైపు గోల్ కీపర్ శ్రీజేశ్ కూడా ప్రత్యర్థి దాడులను సమర్థంగా అడ్డుకొని వారికి ఒక్క గోల్ కూడా చేయనివ్వలేదు. ఈ మ్యాచ్‌లో టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయించి ఏకపక్షంగా మ్యాచ్‌ను గెలుచుకుంది. 1975లో తొలి సారిగా స్వర్ణం గెలుచుకున్న భారత్ అప్పటినుంచి ఇప్పటివరకు మరో టైటిల్ కోసం ఎదురుచూస్తునే ఉంది. ఈసారి భారత జట్టు పతకం సాధించి తమ ఉనికిని తిరిగి చాటుకుంటుందని భారత కెప్టెన్ మన్‌దీప్ సింగ్ అంటున్నాడు. గెలుపుతో టోర్నీని ఆరంభించిన తాము ఈ సారి ఎలాగైన పతకం గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు. బెల్జియంతో జరిగే పోరు తమకు పరీక్ష లాంటిదే.. కానీ ఈ పరీక్షలో విజయం తమదేనని, తమ జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనున్నదని భారత సారథి మన్‌దీప్ సింగ్ చెప్పాడు. ఈ మ్యాచ్ భారత్‌కు చాలా కీలకమైంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే నాకౌట్ బెర్త్ దాదాపు ఖాయమైపోతుంది. మరోవైపు బెల్జియంను తక్కువ అంచన వేయలేము. బెల్జియం తమ తొలి మ్యాచ్‌లో 2-1తో కెనడాను ఓడించి టోర్నీను శుభారంభం చేసింది.ఇక ఈ రెండు జట్ల రికార్డులను ఒకసారి చూస్తే భారత్ కంటే బెల్జియం రికార్డులే మెరుగ్గా ఉన్నాయి. ఇప్పటి వరకు ఇరు జట్లు మొత్తం 19 సార్లు తలపడగా.. అందులో భారత్ ఐదు మ్యాచ్‌లలోనే విజయం సాధిస్తే.. బెల్జియం 13 మ్యాచుల్లో గెలిచింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. ఈ నేపథ్యంలో ఈరోజు బెల్జియంతో జరిగే పోరు భారత్‌కు పెద్ద సవాలే.. అయినా భారత జట్టు కఠిన సవాళ్లను ఎదుర్కొనేందుకు పూర్తిగా సిద్ధంగా ఉందని, విజయమే లక్ష్యంగా మైదానంలో అడుగుపెట్టనుందని భారత జట్టు కోచ్ హరేంద్ర సింగ్ అన్నారు.