గురుపూజోత్సవంలో విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
131 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం
ప్రజాపక్షం/హిమాయత్‌నగర్; ఉపాధ్యాయ వృత్తికి భారతదేశంలో ఉన్న గౌరవం ప్రపంచంలో ఏ దేశంలో లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గురుపూజోత్సవం జరిగింది. ఈ సందర్భంగా విద్యారంగంలో విశేష సేవలందించిన 131 మంది ఉత్తమ ఉపాధ్యాయులను మంత్రి ఘనంగా సన్మానించి అవార్డులను ప్రదానం చేశా రు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మన దేశం లో ఉన్న యూనివర్సిటీలు ఏ దేశంలో లేవని, మన యూనివర్సిటీలకు అనేక ఏళ్ల చరిత్ర ఉందన్నారు. గురువు ప్రాధాన్యతను గుర్తించింది భారతీయ సమాజమేనని, మనిషి ఎంత ఎత్తుకు ఎదిగిన గురువులను మర్చిపోరని, అందుకు ఉదాహరణ సిఎం కెసిఆర్ అని గుర్తు చేశారు. పిల్లలకు జన్మనిచ్చింది తల్లిదండ్రులు అయితే వారికి విద్యా బుద్దులు నేర్పి ప్రయోజకులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనన్నా రు.ఉపాధ్యాయులు సమాజానికి ఆదర్శంగా ఉం టూ ఉత్తమ ఉపాధ్యాయులుగా రాణించాలన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉండే సంతృప్తి ఏ వృత్తిలో ఉండదని, సమాజాన్ని సైతం ప్రభావితం చేసే స్థాయి ఉపాధ్యాయులకు ఉందన్నారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్ధన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంఎల్‌సిలు కె.జనార్ధన్‌రెడ్డి, రఘోత్తమరెడ్డి, ఎ.నర్సిరెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ టి.పాపిరెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు.