చరిత్ర సృష్టించిన పంజాబీ నటి హర్నాజ్ సంధు
20 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి..!
ఐలాట్ (ఇజ్రాయిల్) : పంజాబీ సినీ నటి, 21 సంవత్సరాలు వయసుగల మోడల్ హర్నాజ్ సంధు ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుని చరిత్ర సృష్టించారు. ఇజ్రాయిల్‌లో సోమవారం జరిగిన ప్రపంచ సుందరీమణుల (మిస్ యూనివర్స్) పోటీల్లో హర్నాజ్ సంధు ఆ గొప్ప గౌరవాన్ని దక్కించుకున్నారు. 2020లో ఈ ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న మెక్సికో సుందర మిస్ అండ్రూ మెజా వేదికపైకి వచ్చి కరతాళ ధ్వనులమధ్య హర్నాజ్ సంధుకు మిస్ యూనివర్స్ కిరీటాన్ని అలంకరించారు. పరాగ్వేకు చెందిన అందాల యువతి నదియా ఫెర్రైరా (22) ద్వితీయ స్థానంలో నిలిచారు. దక్షిణాఫ్రికాకు చెందిన అందాల యువతి లలేలా మెస్వానే (24) తృతీయస్థానంలో నిలిచారు. విశేషం ఏమిటంటే ఇజ్రాయిలీ దేశం మొట్టమొదటిసారి ఈ విశ్వసుందరి పోటీలకు ఆతిథ్యం ఇచ్చింది. ఇజ్రాయిలీ పర్యాటక మంత్రిత్వశాఖ ఈ విశ్వసుందరి పోటీలకు 6.5 మిలియన్లు (సుమారు రూ.16 కోట్లు) తన వంతుగా ఖర్చు చేసింది. విశ్వసుందరిగా హర్నాజ్ సంధు వ్యక్తం చేసిన భావాలు, అభిప్రాయాలు అక్కడ హాజరైన అతిథులను ముగ్ధుల్ని చేశాయి. మళ్ళీ 20 ఏళ్ల తర్వాత భారదేశ యువతికి ప్రపంచ సుందరీమణుల పోటీల్లో ఉన్నత గౌరవాన్ని తెచ్చి సంధు చరిత్ర సృష్టించారు. ఇంతకుముందు 2000 సంవత్సరంలో జరిగిన ప్రపంచ సుందీమణుల పోటీలో భారత్‌కు చెందిన లారాదత్తాకు ఈ గౌరవం దక్కగా, మళ్ళీ సంధు ఈ మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఇప్పడు కైవసం చేసుకుంది.79 దేశాలకు చెందిన సుందరీమణులు ఈ ప్రపంచ కిరీటం కోసం పోటీపడ్డారు. అంతకుముందు 1994లో సుస్మితా సేన్ ఈ ఘనత సాధించారు. ఈ ప్రపంచ సుందరీమణుల పోటీల్లో ఈ కిరీటాన్ని దక్కించుకున్న మూడవ భారతీయ యువతి హర్నాజ్ సంధు. ఇప్పటివరకు 70 సార్లు ఈ పోటీలు జరిగాయి. ఈ సారరి 70వ పోటీలు ఇజ్రాయిల్‌లోని ఎర్ర సముద్రతీరంలో ఉన్న పర్యాటక పట్టణ కేంద్రం ఐలాట్‌లో నిర్వహించారు. సంధు పేరు ప్రకటించగానే ఒక్కసారిగా హాలంతా చప్పట్లతో, కేరింతలతో దద్దరిల్లిపోయింది. ఇక తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సంధు అయితే మాత్ర కన్నీరు పెట్టుకుంది. పట్టుదల, కృషి ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదని ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు అతిథుల మన్ననలు చూరగొన్నాయి. మన జీవితానికి మనమే నాయకులం, మన జీవితానికి మనమే మహారాజులం, ఆత్మవిశ్వాసంతో దాన్ని ముందుకు నడిపించాలి అన్నారామె. భారత్‌కు చెందిన ఎంతో మంది ప్రముఖులు ఈ ఉత్సవంలో పాల్గొని ఆమెకు ఊతంగా నిలిచారు. సంధు ఆద్యంతం ఈ కార్యక్రమంలో చిరునవ్వులు చిందిస్తూ, గొప్ప ఎనర్జిటిక్‌గా వ్యవహరించారు.
పంజాబ్ రాష్ట్రం చండీగడ్‌లో 2000 సంత్సరం మార్చి మూడవతేదీ శుక్రవారం జన్మించిన సంధు 1.76 సెంటీమీటర్ల ఎత్తు (5.9 అడుగులు) యాభై కిలోల బరువుతో శారీరక సౌష్టవం, మానసిక ప్రామాణికతలతో అన్ని కొలతలకూ అతికినట్టు సరిపోయారు. 2017లో ‘టైమ్స్ ఫ్రెష్ ఫేస్’ అవార్డు గెలుచుకునానరు. 17 ఏళ్ళ వయసులోనే ఆమె చండీగఢ్ తరపున ఈ పోటీలకు ప్రాతినిధ్యం వహించారు. 2019లో ఫెమీనా మిస్ ఇండియా పంజాబ్ లివా మిస్ దివా 2021 విజేతగా టైటిల్స్ గెలుచుకున్నారు సంధు. చండీగఢ్‌లోని శివాలిక్ పబ్లిక్ స్కూలులో చదువుకున్న సంధు చండీగఢ్ బాలికల కళాశాలలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలనాశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు హర్నాజ్ సంధు. ఆమె కొన్ని పంజాబీ సినిమాలలో నటించారు. ‘యారా దియాన్ పూ బరన్’, బై జీ కుట్టాంగ్’ వంటి చిత్రాల్లో నటించి పేరు పొందారు. అమెరికా గాయని జోజో ఈ విశ్వసుందరి పోటీల వేదికకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. స్టీవ్ హార్వే కార్యక్రమం నిర్వహించారు.
2015 యూనివర్స్ ఇండియా, నటి, యూర్వశీ రౌతెలా సహా అదమారి లోపెజ్, అద్రినా లిమా, చెస్లి క్రైస్ట్, ఐరిస్ మిట్టెనార్, లోరి హార్వే, మారియన్ రివేరా, రేనా సోఫెర్ లు ఈ విశ్వసుందరి పోటీల్లో మిస్ యూనివర్స్‌ను ఎంపిక చేసే సెలక్షన్ కమిటీ సభ్యులుగా వ్యవహరించారు.
ఇతరులతో పోలిక వద్దు
మీ జీవితానికి మీరే నాయకులు
“నిత్యం నా వెంట ఉండి, నన్ను ప్రేమిస్తూ, నాకు మద్దతు ఇస్తూ, నాకు మార్గదర్శకంగా నిలిచిన ఆ సర్వాంతర్యామికి, నా తల్లిదండ్రులకు, మిస్ ఇండియా సంస్థకు, నా ఈ ప్రపంచ సుందీరీమణి కిరీటం దక్కాలని ప్రార్థించిన, వాంఛించిన ప్రతిఒక్కరికీ సర్వదా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను” అని విశ్వసుందరి కిరీటం దక్కించుకకున్న హర్నాజ్ సింధు అందాల పోటీల వేదికపై చెప్పారు. భారతదేశానికి 21 సంవత్సరాల తర్వాత ఇంత గొప్ప ఘనకీర్తి దక్కినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు. సింధు త్వరలోనే న్యూయార్క్‌లో స్థిరపడతారు. ఆమె మిస్ యూనివర్స్ సంస్థతో పాటు అనేక సంస్థలకు వాచస్పతిగా వ్యవహరిస్తారు. ఈ పోటీల్లో నిర్వాహకులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు అందరినీ ముగ్ధుల్ని చేశాయి. ఫైనల రౌండ్లో అడిగిన ప్రశ్నలకు ఆమె మంచి సమాధానాలిచ్చారు. ఈనాటి యువతరానికి మీరు ఇచ్చే సందేశం ఏమిటి? ఈ కాలంలో ఎదురవుతున్న ఒత్తిడిని వారు అధిగమించాలంటే ఏం చేయాలి? అని ప్రశ్నించినప్పుడు, తడబడకుండా అలవోకగా ఆమె సమాధానం చెపారు. “ప్రపంచంలో ఈనాటి యువతరానికి ఎదురవుతున్న అతిపెద్ద ఒత్తిడి తమను తాము ఎదుర్కోవడం! ఏది తమ కంటే భిన్నమైనది, ఏది మనల్ని విభిన్నంగా ఆకర్షిస్తుంది, ఏది మన జీవితాన్ని అందంగాతీర్చి దిద్దుతుందనే విషయాల్ని ఈ నాటి యువతరం తెలుసుకోవాలి. మనల్ని మనం ఇతరులతో పోల్చుకోకూడదు, అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే, ప్రపంచంలో ఏది అతిముఖ్యమైనదో, ప్రపంచవ్యాప్తంగా ఏదైతే జరుగుతోందో అలాంటి ముఖ్య విషయాల గురించే ఇతరులతో మనం మాట్లాడాలి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి ఇదే ఎంతో అవసరం. ముందుకు వచ్చి మీ గురించి మీరు మాట్లాడండి, ఎందుకంటే, మీ జీవితానికి మీరే నాయకులు గనుక..మీ జీవితానికి మీరే ప్రతినిధి, మీ జీవితానికి నడిపించే నిజమైన గొంతుక మీరే. నన్ను నేను గాఢంగా విశ్వసిస్తాను, అందుకే ఈ రోజు ఇలా వచ్చి మీ అందరిముందూ నిలబడగలిగాను” అని సభావేదిక దద్దరిల్లిపోయేలా చేసిన కరతాళ ధ్వనులమధ్య ఆమె ఉద్వేగంగా చెప్పారు.
భారతీయ యువతికే విశ్వసుందరి కిరీటం
RELATED ARTICLES