వేడిమి, వేడిగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి
ఉద్యోగులు, వీధి వ్యాపారులకు తప్పని తిప్పలు
ఇళ్లకే పరిమితమైన జనం
భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం
ప్రజాపక్షం న్యూస్ నెట్‌వర్క్ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి.ఉదయం నుంచే భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండ తీవ్రతకు తోడు వేడిగాలులు వీస్తుండడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నా రు.హైదరాబాద్ జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గురువారం 40 డిగ్రీలుగా పగటి ఉష్ణోగ్రతలు, రాత్రి పూట కూడా 27 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నది. హైదరాబాద్ జిల్లాలో 39.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా చేప్రాలలో 43.3 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలకు బయటికి రావాలంటేనే జనాలు జంకుతున్నారు..ఫిబ్రవరి మధ్య వరకు కూడా ఈ సారి చలి ప్రభావం కనిపించింది. ఫిబ్రవరి చివరికి వచ్చే సరికి మెల్లమెల్లగా వేడి మొదలైంది. మార్చి మొదటి వారం నుంచి చివరికి వచ్చే సరికి ఉష్ణోత్రగతలు పెరిగాయి. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మార్చి చివరిలోనే ఎండ వేడిమి ఇలా ఉందంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఎండ కారణంగా ఉద్యోగాలకు వెళ్ళే వారు, రోడ్లపై వ్యాపారాలు చేసే వాళ్ల తిప్పలు అంతా ఇంతా కాదు. ఈ ఎండలకు రోడ్లపై తిరిగితే కచ్చితంగా వడదెబ్బ తగులుతుందని, అనారోగ్యానికి గురవుతారని వాతవరణ శాఖ హెచ్చరిస్తునే ఉంది. ఎండ తీవ్రతతో ప్రజలు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఇంటి వద్దనే ఉండాలని వాతావరణ నిఫుణులు సూచిస్తున్నారు. నీటిని ఎక్కువగా తీసుకోవాలని, పగటి పూట అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని, ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నీడపట్టున ఉండాలంటున్నారు.
దడ పుట్టిస్తున్న వడ గాల్పులు
పర్యావరణ పరంగా తీవ్ర వత్తిడులు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం వడ గాల్పులు దడ పుట్టిస్తున్నాయి. ఎండలు మండుతుండటంతో.. ఉదయం పది తర్వాత కాలు బయట పెట్టాలంటేనే జనం భయపడిపోతున్నారు. ఎండ వేడి తాళలేక ఇళ్లకే పరిమితమవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. పగటి ఉష్ణోగ్రతలు నిత్యం పెరిగిపోతున్నాయి. అకాల వర్షాలు, విపరీతమైన చలి.. వీటికితోడు మండే ఎండలు. ఆరోగ్యంపై, జంతుజాలంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఈ ఏడాది వేసవిలో సూరీడు తన ప్రతాపం చూపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
పెరిగిన విద్యుత్ వినియోగం
ఎండ వేడిమి తట్టుకోలేక ప్రజలు ఇంటికి పరిమితం కావడంతో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దక్షిణ భారతంలో అత్యధిక విద్యుత్ వినియోగ రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. మార్చిలోనే ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. మార్చి 29వ తేదీన 14,117 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు కాగా విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. అయినప్పటికీ 18 వేల మెగావాట్ల డిమాండ్ వచ్చినా.. సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదని విద్యుత్ శాఖ అధికారులు అభయమిస్తున్నారు.
పాటించాల్సిన జాగ్రత్తలు
రానున్న రోజుల్లో ఎండలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని వైద్య, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరం డీ హైడ్రేట్ కాకుండా తరచూ నీళ్లు తాగుతూ ఉండాలని సూచిస్తున్నారు. శరీరానికి ఎలక్ట్రోలైట్స్ అందించే ద్రావణాలు తాగాలని చెబుతున్నారు. కొబ్బరి బోండాలు తాగాలని, నీరు అధికంగా ఉండే ద్రాక్ష, పుచ్చకాయలు తినాలని సూచిస్తున్నారు. మార్కెట్‌లో దొరికే కూల్ డ్రింక్స్ కాకుండా సహజ పానీయాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎండలో నుంచి వెళ్లి వచ్చిన వెంటనే ఫ్రిజ్‌లో నుంచి అతి చల్లని నీళ్లు ఒకే సారి తాగకుండా.. కాసేపు కూర్చుని నెమ్మదిగా నార్మల్ వాటర్ లేదా తక్కువ చల్లటి నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో తప్పనిసరి అయితే తప్పా బయటకు వెళ్లకూడదని చెబుతున్నారు. ఒక వేళ వెళ్లాల్సి వస్తే గొడుగు, క్యాప్ లేదా ఎండ నుంచి రక్షణను ఇచ్చే వస్తువులను వెంట తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. అతినీల లోహిత(యూవీ) కిరణాలు తాకితే చర్మం దెబ్బతింటుంది. ఆ కిరణాలు మరీ ఎక్కువగా తాకితే చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఎండ వల్ల రెండేళ్లలో ఒకసారి చర్మం కమిలిపోయినా, చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం మూడు రెట్లు పెరుగుతుందని పరిశోధకులు అంటున్నారు. సుమారు 90 శాతం చర్మ క్యాన్సర్లు అధిక సూర్యరశ్మి వల్లే వస్తున్నాయి. చర్మంలో మార్పు కనిపించగానే, వైద్యులను సంప్రదించాలి. చాలావరకు అది చర్మ క్యాన్సర్ అయ్యుండదు. ఒకవేళ క్యాన్సర్ అయినా కూడా లేత దశలో వైద్యం ప్రారంభిస్తే కోలుకునే అవకాశం మెరుగవుతుంది. మనకు సూర్యరశ్మి అవసరం. కాబట్టి ఎండకు వెళ్లేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏ సమస్యా ఉండదు. వేడి గాలులు చెవులకు తగలకుండా జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
భానుడి సెగలు
RELATED ARTICLES