HomeNewsBreaking Newsభవిష్యత్తు తాకట్టు

భవిష్యత్తు తాకట్టు

రాష్ర్ట ఖజానా ఖాళీ చేసి రూ. 7 లక్షల కోట్లు అప్పు
గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై మంత్రి భట్టి ఆగ్రహం
ఇందిరమ్మ రాజ్య స్థాపనే కాంగ్రెస్‌ లక్ష్యం
ప్రతి హామీని అమలు చేస్తాం
ప్రజాపక్షం/ ఖమ్మం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి భవిష్యత్తును గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్‌శాఖమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బతుకులు మారుతాయని ప్రజలు కలలుగన్నారని, నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మ గౌరవం, ఇంటి స్థలాలు, ఇండ్లు వస్తాయని ఆశపడితే… ఆశలను అడియాశలుగా మార్చారని విమర్శించారు. మంత్రి భట్టివిక్రమార్క శనివారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మధిర నియోజకవర్గ పరిధిలోని ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామంలో జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొని ప్రజల దరఖాస్తుల స్వీకరణను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ దేశానికి స్వాతంత్య్రం తీసుకు రావడానికి అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావం జరిగిన డిసెంబరు 28 నుంచి దరఖాస్తులను స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. ఆరు గ్యారంటీలు అమలు చేయడం తో పాటు సృష్టించిన సంపదను ప్రజలకు పం చుతామని భట్టి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ మాట లు విశ్వసించి ప్రజలు అద్భుతమైన తీర్పుతో కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటుకు కారణమయ్యారని ప్రజల ఆశలను అడియాశలు కానివ్వబోమని హామీ ఇచ్చారు. ఆరు గ్యారంటీల అమలుకు కావాల్సిన నిధుల సమీకరణకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు. నెల రోజులు గడవక ముందే ఆరు గ్యారంటీల అమలులో విఫలమయ్యారని బిఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారని జనం వాతలు పెట్టినా, అధికారం కోల్పోయినా మాటలు, చేతలు మారలేదని భట్టి అన్నారు. అధికారాన్ని వదిలిపెట్టి బతకలేకపోతే ఎలా అంటూ ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌ చెప్పింది చేస్తుందని… గతంలోనూ చేసిందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని భట్టి మరోమారు తెలిపారు. చివరి మూడు నెలల బడ్జెట్‌ను కూడా ఎన్నికలకు ముందే బిఆర్‌ఎస్‌ నేతలు డ్రా చేసి ఖర్చు చేశారని, రాష్ట్ర ఖజానాను దివాళా తీయించినా ఒకటవ తేదీనే ఉద్యోగులకు వేతనాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదన్నారు. అసమర్థ బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏనాడూ ఒకటవ తారీఖున వేతనాలు ఇవ్వలేదని, ఉద్యోగాల కల్పనలో పూర్తిగా విఫలమైందన్నారు. నైపుణ్యంతో కూడిన విద్యా వ్యవస్థను ఏర్పాటు చేసి ఉపాధి కల్పన అవకాశాలు కల్పిస్తామని భట్టి తెలిపారు. కరెంటు కావాలా… కాంగ్రెస్‌ కావాలా అని బిఆర్‌ఎస్‌ ప్రశ్నించిందని, జనం కాంగ్రెస్‌ కావాలని తీర్పునిచ్చారని… 2014కు ముందున్న ప్రభుత్వాలు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణం చేయడం వల్లే బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం విద్యుత్‌ సరఫరా చేయగలిగింది కానీ…. ఇది మరిచి బిఆర్‌ఎస్‌ చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదన్నారు. భద్రాద్రి పవర్‌ ప్రాజెక్టును అవుట్‌ డేటెడ్‌ టెక్నాలజీతో నిర్మించారని, ఇది తెలంగాణ ప్రజలకు భారంగా మారనుందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని అత్యంత ప్రజాస్వామిక రాష్ట్రంగా తీర్చిదిద్దుతుందని, విద్య, వైద్యరంగానికి పెద్దపీట వేయనున్నామని ప్రతి మండలంలో ఇంటర్నేషనల్‌ స్కూల్‌ను ఏర్పాటు చేస్తామని భట్టివిక్రమార్క తెలిపారు. ప్రపంచీకరణ నేపథ్యంలో పెరిగిన పోటీతత్వానికి అనుగుణంగా రాష్ట్ర యువతను తయారు చేస్తామన్నారు. బనిగండ్ల పాడులో పిహెచ్‌సి ఆసుపత్రిని మోడల్‌ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని కమ్యూనిటీ హాల్స్‌ మొదలైన వాటి నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తామని భట్టి హామీ ఇచ్చారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments