హక్కుల సాధన కోసం శక్తినంతా కూడదీసి పోరాడాలి
ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు జాతీయ ప్రధాన కార్యదర్శి అనీరాజ పిలుపు
ప్రజాపక్షం/హైదరాబాద్ హక్కుల సాధన కోసం శక్తినంతా కూడదీసి పోరాడాలని భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు) ప్రధాన కార్యదర్శి అనీరాజా పిలుపునిచ్చారు. హైదరాబాద్ హిమాయత్ నగర్‌లోని సత్యనారాయణరెడ్డి భవన్‌లో ఆదివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర రెండవ ఎఎన్‌ఎంల యూనియన్ రెండవ రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సదస్సుకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బడేటి వనజ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా అనీరాజా మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ఇంకా మహిళలు అణిచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌ఎచ్‌ఎం)లో పనిచేస్తున్న ఎఎన్‌ఎంలను రెండవ ఎఎన్‌ఎంలు అని పిలవటం ఏమిటని ఆమె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. వివక్షత అనేది ప్రారంభంలోనే మొదలైందని, అది రూపుమాపే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. భయపడుతూ పోరాడితే ఏదీ సాధించలేమని, తెగించి పోరాడితే హక్కులను సాధిస్తామన్నారు. పోరాటాన్ని అణిచివేయటానికి ప్రభుత్వాలు ఎప్పుడూ ముందుంటాయని, అణిచివేతను దాటుకుని వెళ్లితేనే విజయం వరిస్తుందన్నారు. మణిపూర్ లో మహిళలు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూడటానికి వెళ్లిన తనను అరెస్ట్ చేసినప్పుడు తాను భయపడలేదని తెలిపారు. రెగ్యులరైజేషన్ కోసం పోరాటం చేసేటప్పుడు ఎఎన్‌ఎంలకు కూడా అణిచివేత, అరెస్టులు తప్పవని, వాటికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. రెండవ ఎఎన్‌ఎంల సర్వీసులు రెగ్యులరైజ్ అయ్యేంత వరకు పోరాడాలన్నారు. పోరాటానికి తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఎఐటియుసి జాతీయ నాయకురాలు డా॥ బివి విజయలక్ష్మి మాట్లాడుతూ 103 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఎఐటియుసి ఆధ్వర్యంలో ఎంతో మంది కార్మికులు పోరాటాలు చేసి, ఎన్నో విజయాలు సాధించారని గుర్తు చేశారు. ఎఐటియుసి పోరాటాల వల్లనే శ్రామిక మహిళలకు సంబంధించిన హక్కుల చట్టాలు వచ్చాయని ఆమె చెప్పారు. ఈ ఎర్రజెండా నీడలో పోరాడుతున్న కార్మికులు, ఉద్యోగులు కచ్చితంగా విజయం సాధిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహ, రాష్ట్ర నాయకులు తోట రామాంజనేయులు, తెలంగాణ రాష్ట్ర రెండవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాండ్ల మధురిమ, కార్యనిర్వహక కార్యదర్శి సి.హెచ్.విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.
భయపడితే…ఏదీ సాధించలేం
RELATED ARTICLES