నేటి నుంచి తెలంగాణలో టెన్త్ పరీక్షలు
హైదరాబాద్: తెలంగాణలో టెన్త్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమై, 13న ముగియనున్నాయి. గతంలో 11 పేపర్లు ఉన్న టెన్త్‌ను ఇప్పుడు ఆరు పేపర్ల పరీక్షా విధానంగా మార్చారు. దీనితో ఈసారి విద్యార్థులు ఆరు పేపర్లే రాయాలి. ఒక్కో సబ్జెక్ట్‌లో 80 మార్కులకు పరీక్షా విధానం ఉంటుంది. మిగతా 20 మార్కులను ఇంటర్నల్స్ లేదా ఫార్మేటివ్ అసెస్మంట్ ఆధారంగా ఇస్తారు. జనరల్ సైన్స్ విషయానికి వస్తే, ఈ పది మార్కులను ఫిజిక్స్, బయాలజీ విభాగాలకు సమంగా ఉంటాయి. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా 4లక్షల 94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. 2,652 పరీక్షా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పరీక్ష కేంద్రాల వద్ద అవసరమగు సదుపాయాలు, తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను సర్కారు అందుబాటులో ఉంచనుంది. సాధారణంగా వార్షిక పరీక్షలు అంటే విద్యార్థుల్లో ఆందోళన ఉంటుంది. కానీ, ఎలాంటి సందేహాలు, భయాలు లేకుండా ధైర్యంగా రాస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని నిపుణులు అంటున్నారు. వారి సూచనలను అనుసరించి విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకాగ్రతను కోల్పోరాదు. పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలోనేకాదు.. పరీక్షలు రాసే సమయంలోనూ ఈ సూత్రాన్ని పాటించాలి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి కాబట్టి తరచుగా నీళ్లు, జావ, మజ్జిగ వంటి ద్రవపదార్థాలు తీసుకోవాలి. రాత్రి ప్రశాంతంగా నిద్రపోతేనే పగలు ఉత్సాహంగా ఉండగలుగుతారు. నిద్రలేమి వల్ల పరీక్షా కేంద్రాల్లో కునుకిపాట్లు పడాల్సి ఉంటుంది. అంతేగాక, నిద్ర సరిగ్గా లేకపోతే అసహనం పెరుగుతుంది. కాబట్టి విద్యార్థులు తగినంతగా నిద్రపోవాలి. ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. ఇక పరీక్షల సమయంలో పోషకాహారం తీసుకోవడం కూడా అత్యవసరం. ఎండు ఫలాలు, నట్స్ బాగా తినాలి. ఎండు ద్రాక్ష, ఖర్జూర, పల్లి పట్టీలు, బాదం, జీడిపప్పు, కిస్మిస్, పండ్లు, కూరగాయలు, పప్పులు, ధాన్యాలు, ఆకు కూరలు తీసుకోవాలి. వీటి వల్ల బి6 విటమిన్, ఐరన్, పొటాషియం, విటమిన్-ఏ, ఈ, పీచు, రాగి, మెగ్నీషియం, కాల్షియం దండిగా ఉంటాయి. ఇవి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పరీక్షలు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాయగలుగుతారు. టీ, కాఫీ, కూల్ డ్రింక్స్‌ను సాధ్యమైనంత వరకూ దరిచేయనీయకూడదు. బయట తిండి అసలే పనికిరాదు. ఈ సూత్రాలు పాటిస్తూ, భయంపడకుండా పరీక్షలు రాస్తే, మంచి మార్కులతో పాస్ గ్యారంటీ.