ఆదివాసీల ఆకలి కేకలు – దళారులకు కాసుల పంటలు
కడుబీద బతుకులతో ఆడుకుంటున్న లేబర్ కాంట్రాక్టర్లు
అనుమతులు లేకుండా ఇష్టారాజ్యం
అధికారుల మౌనం వెనుక ఆంతర్యమేమిటో…
భద్రాచలం : అక్రమాలకు నిలయంగా మారిపోతోంది ఏజె న్సీ ముఖ ద్వారం. అమాయక ఆదివాసీ ప్రాం తాలకు నిలువెత్తు నిదర్శనమైన ఈ ప్రాంతం అదే అమాయకులతో ఆటలాడుకునే దళారుల చేతిల్లో నలిగిపోతోంది. ఒకటికాదు రెండు కాదు… అనేక అక్రమాలు. అందులో ఒకటి మానవ అక్రమ రవాణా కూడా ఉంది. భద్రాచలం కేంద్రంగా గత కొంత కాలంగా మానవ అక్రమ రవాణా ఎలాంటి అడ్డూ అదుపు లేకుండా సాగిపోతోంది. ఇందుకు ఆదివాసీలు సమిదలవుతున్నారు. ధనార్జనే ధ్యేయంగా చేసుకుని కొందరు ఆదివాసీల కష్టాన్ని కాజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న ఛత్తీస్గఢ్, ఒడిశాల్లో అనాగరిక ఆదివాసీలు అధికంగా జీవిస్తుంటారు. వారి వారి గ్రామాల్లో కొండలు, గుట్టల మధ్య పోడు వ్యవసాయం చేసుకుని తిండిగింజలు సంపాదించుకోవడం మాత్రమే వారికి తెలుసు. వర్షాకాలం పోయిన తర్వాత వేసవిలో పనులు లేక ఇబ్బందులు పడుతూ బతుకు దెరువు కోసం కూలీ పనులు వెతుక్కుంటూ పట్టణాలవైపు చూస్తుంటారు. ఇం దుకు వారికి తెలిసింది కేవలం భద్రాచలం వరకు చేరుకోవడమే. ఇక్కడికి గుంపులు గుంపులుగా చేరుకునే వారు బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఉంటూ ఎవరైనా పనులకు పిలవక పోతారా అంటూ ఎదురు చూస్తుంటారు.
గుండుగుత్తాగా : ఆదివాసీల అవసరాలను, ఇత ప్రాంతాల్లో కూలీల కొరతను ఆసరాగా చేసుకుని లేబర్ కాంట్రాక్టరుగా అవతారమెత్తారు కొందరు. ఆదివాసీ కూలీలలకు పనులు చూపుతామంటూ నమ్మబలికి వారి ని గుండుగుత్తాగా 20 నుండి 30 మందిని పనులకు పంపించేస్తుంటారు. ఇందు కోసం ముందుగానే ఇతర రాష్ట్రాలై కర్నాటక తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో కొందరితో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అయితే లేబర్ కాంట్రాక్టర్లుగా చెప్పుకునే వారు ముందు గా మాట్లాడే రేటు వేరు, పని చేసినవారికి చెల్లించే ధర వేరు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఒక్కొక్కరికి రూ. 3వేల రూపాయలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒప్పందం ప్రకారం లేబర్ కాంట్రాక్టర్ బ్యాంకు ఖాతాలో డబ్బులు పడ్డాకే వీరిని ఇక్కడి నుంచి పంపిస్తుంటారు. అయితే పనిచేసే ప్రదేశంలో కూలీలకు ఖర్చుల నిమిత్తం కొదో ్దగొప్పో పనులకు తీసుకెళ్లిన వారు చెల్లిస్తుంటారు. మిగతా డబ్బులను మళ్లీ ఇక్కడి నుండి పనులకు పంపిన వారి ఖాతాలో వేయించుకుంటారు. ఇంత వరకు బాగానే ఉన్నా పనులు ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత అవతలి వాళ్లు డబ్బులు ఇంకా ఇవ్వలేదని చెబుతూ కాలయాపన చేస్తూ కొద్ది మొత్తాల్లో చెల్లించి పంపించేస్తూ పెద్ద మొత్తాల్లో కూలీ డబ్బులను కాజేస్తున్నట్లు తెలుస్తోంది. గట్టిగా డబ్బులు కావాలని అడిగితే దెబ్బలు, చివాట్లు వారికి తప్పడం లేదు. చేసిన కష్టానికి కూలీ డబ్బులు రాక, తిరిగి తన్నులు తినలేక అమాయకంగా చెమ్మగిల్లుతున్న కళ్లతో దారిపడుతున్నట్లు తెలుస్తోంది.
అమాయక బతుకులతో ఆటలు : చదువు సంధ్యా లేక అడవుల్లో మగ్గుతూ తిండి గింజల కోసం వందలాది కిలోమీటర్లు వచ్చి పనులు చేసుకునే అమాయక బతుకులతో లేబర్ కాంట్రాక్టర్లు ఆటలాడుతున్నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పనులకు వెళ్లిన ప్రదేశంలో చాలా మంది ప్రమాదాలకు గురైనప్పటికీ పట్టించుకోకుండా వదిలేస్తున్నట్లు తెలుస్తోంది. అసలు పనులకు ఎక్కడికి పంపుతున్నారు, రోజూ వారీ కూలీ ఎంత చెల్లిస్తారు, తమకు రక్షణ ఏంటి అనే విషయం కూడా తెలియని వారు దళారులు చెప్పే మాటలు నిమ్మి మోసపోతూనే ఊన్నారు. బోరు పనులకు వెళ్లిన సందర్భాల్లో చాలా మంది చేతులు, వేళ్లు, కాళ్లు తెగినపడిన సందర్భాలు ఉన్నాయి. ఆ సమయంలో వైద్య ఖర్చుల నిమిత్తం కొద్దిపాటి డబ్బులు ఇచ్చి తిరిగి పంపించేస్తున్నారు. నష్ట పరిహారం చెల్లించాల్సి ఉన్నప్పటికీ కూలీలను వదలించుకునేందుకు సర్వప్రయత్నాలు చేసి, తీరా పనికి తీసుకెళ్లినవారి నుండి నష్టపరిహారం కింది లక్షలాది రూపాయలు కాజేస్తూ ఆదివాసీలను మరో రకంగా కూడా మోసం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
పరిమిషన్ ఎవరిచ్చారు : లేబర్ సప్లు పరిమిషన్ ఉంటే తప్ప మనుష్యులను ఇతర ప్రాంతాలకు కూలీ పనుల నిమిత్తం పంపేందుకు వీలుకాదు. చిన్నాపెద్ద కలిపి ఇక్కడ మొత్తం 50 మందికి పైగా లేబర్ కాంట్రాక్టర్లుగా అవతారమెత్తారు. ఒకరిద్దరికి తప్ప మిగతా వారికి అనుమతులు లేవని తెలుస్తోంది. మానవ అక్రమ రవాణా తీవ్రమైన నేరమని న్యాయస్థానాలు చెబుతున్నప్పటికీ దానిని ఎవరూ పట్టించుకోవడం లేదు.కూలీ పనుల నిమి త్తం మనుష్యులను పంపే ముందు అనుమతులున్న కాం ట్రాక్టర్లు కూలీకి వెళ్లే వారి ఆధార్ కార్డు, వారి పూర్తి వివరాలతో, ఫొటోలు జతచేసి ఎక్కడి నుండి ఎక్కడికి వెళుతున్నారో పొందు పరచాల్సి ఉంటుంది. దానిని లేబర ఆఫీసులో చూపించి వివరాల ప్రకారం అనుమతులు పొంది వారివారి పేర్లమీద కొద్దిమొత్తం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అదేమీ కనిపించడం లేదు. పట్టణంలో నిత్యం వేలాది మందిని కూలీ పనుల నిమిత్తం బహిరంగంగా పంపుతున్నప్పటికీ సంబంధిత అధికారుల మౌనపాత్రపోషించడం వెనుక అంతర్యమేమిటో? అంత జరుగుతున్నా విషయం అసలు అధికారులకు తెలుసా… తెలిసినప్పటికీ పట్టింమచుకోవడం లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికైనా అటు ప్రభుత్వాదాయానికి, ఇటు అమాయక ఆదివాసీలకు గండి కొడుతున్న లేబర్ కాంట్రాక్టర్లపైదృష్టి సారిం చి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
భద్రాద్రి సాక్షిగా మానవ అక్రమ రవాణా
RELATED ARTICLES