HomeNewsBreaking Newsభద్రాద్రి బంద్‌ సక్సెస్‌

భద్రాద్రి బంద్‌ సక్సెస్‌

సంపూర్ణ సహకారం అందించిన వ్యాపారులు, ప్రజలు
ఎర్రజెండాలతో హోరెత్తిన పురవీధులు
మూడు పంచాయతీల ముచ్చటే వద్దంటూ నినాదాలు
ప్రజాపక్షం/భద్రాచలం
భద్రాచలం పట్టణాన్ని మూడు పంచాయతీలుగా మారుస్తూ, ఇక్కడి ప్రజానికాన్ని మరోసారి వం చించేందుకు ఏకపక్షంగా తెచ్చిన జిఓ 45ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం అఖిలపక్షం నిర్వహించిన భద్రాద్రి బంద్‌ విజయవంతమైంది. ఈ బంద్‌కు వ్యాపారవర్గాలతో పాటు పట్టణ ప్రజానికం సంపూర్ణ మద్దతునిచ్చింది. ఫలితంగా హోటళ్లు, సినిమాహాళ్లు, పెట్రోల్‌ బంక్‌లు, షాపింగ్‌మాళ్లు తదితర చిన్నచిన్న దుకాణాలు కూడా తెరుచుకోలేదు. తెల్లవారుజామునే రోడ్లపైకి ఎర్రజెండాలతో చేరుకున్న సిపిఐ శ్రేణులు ఆర్‌టిసి బస్టాండ్‌ ఇన్‌గేట్‌ వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. భద్రాచలాన్ని వంచిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని, ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తూ అడుగడుగునా వంచిస్తున్న బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీరు దుర్మార్గమని అన్నారు. పట్టణ పురవీధుల్లో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్‌తో కలిసి శ్రేణులు పెద్దఎత్తున కలియతిరిగారు. పట్టణంలో మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించి బంద్‌ పాటించాలని విజ్ఞప్తి చేశారు. భద్రాచలం పంచాయతీని ముక్కలు చేసే జిఒను రద్దు చేయాలని, భద్రాచలాన్ని కాపాడుకుందామని బైక్‌ ర్యాలీ లో పాల్గొన్న యువత పెద్ద పెట్టున నినదించారు. ఈ సందర్భంగా రావులపల్లి రాంప్రసాద్‌ మాట్లాడుతూ భద్రాచలం పరిరక్షణ కోసం మొదటి నుంచీ సిపిఐ కట్టుబడే ఉందని, ఈ ప్రాంతాన్ని రక్షించుకునేందుకు, ఇక్కడి ప్రజలకు న్యాయం జరిగేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమే అన్నారు. భద్రాచలంపై బిజెపి, బిఆర్‌ఎస్‌ పార్టీల వైఖరి స్పష్టంగా లేదని, పోలవరం ముంపు పేరుతో రాత్రికి రాత్రి ఆర్డినెన్సు తెచ్చి ఏడు మండలాలను లాక్కున్నారని, సిఎం కెసిఆర్‌కు వైఖరి అందుకు భిన్నంగా ఏమీ లేదని విమర్శించారు. బిజెపి ఉన్న వాటిని లాక్కుపోతే, బిఆర్‌ఎస్‌ మిగిలినదాన్ని ముక్కచెక్కలు చేస్తోందని, క్రమంగా ఈ ప్రాంతాన్ని నిర్వీర్యం చేయడమే ఈ ప్రభుత్వాల పనిగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని నిరసస్తూ ప్రజలకు న్యాయం చేద్దామనే ఆలోచన స్థానిక ఎంఎల్‌ఎకు లేదన్నారు. ప్రజాభిప్రాయం లేకుండా ఏజెన్సీలో మార్పులు చేసే అధికారం ఎవ్వరికీ లేదని, ఎలాంటి గ్రామసభల తీర్మాణాలు లేకుండా భద్రాచలం మేజర్‌ గ్రామపంచాయితీని మూడు ముక్కలు చేయడమేమిటని ప్రశ్నించారు. జిఓను రద్దు చేయనట్లయితే ప్రజాశ్రేయస్సు కోసం కలిసొచ్చే వారితో కలిసి న్యాయం పోరాటం కూడా చేస్తామని హెచ్చరించారు. భద్రాచలం మేజర్‌ గ్రామపంచాయతీని యధావిధిగా కొనసాగించి పాలకమండలి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ప్రజలంతా ఏకమై ప్రభుత్వవిధానాలను ఖండిస్తూ భద్రాద్రి రక్షణ కోసం పాటుపడే సిపిఐకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు, పట్టణ కార్యదర్శి ఆకోజ్‌ సునీల్‌ కుమార్‌, నాయకులు మారెడ్డి శివాజీ, బత్తుల నర్సింహులు, విద్యార్థి, యువజన నాయకులు కొలిపాక శివ, మారెడ్డి గణేష్‌, గిరిజన సమాఖ్య నాయకులు కల్లూరి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ నేతల భైఠాయింపు : భద్రాచలం పంచాయితీని మూడుగా విభజిస్తూ తెచ్చిన జీఓం నెం.45ను తక్షణమే రద్దు చేయాలని ఎంఎల్‌ఎ పొదెం వీరయ్య డిమాడ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ తీరును నిరసించారు. భద్రాచలం నియోజకవర్గాన్ని ప్రభుత్వం చిన్న చూపుచూస్తోందని, ప్రథానంగా భద్రాచలంపై సవతితల్లి ప్రేమను చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే సమయం అతి సమీపంలోనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు బుడగం శ్రీనివాస్‌, సరెళ్ల నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.
సహించేది లేదు: సిపిఐ(ఎం) :గ్రామపంచాయినీ మూడు ముక్కలు చేస్తే సహించేది లేదని, దొడ్డిదారిని తెచ్చిన జీఓనెం.45ను తక్షణమే రద్దు చేయాలని సిపిఐ(ఎం) నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు ప్రభుత్వాని డిమాండ్‌ చేశారు. ప్రజల మధ్య ప్రభుత్వం విభజన రేఖ పేరుతో చిచ్చుపెడుతుంద్న విమర్శించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) నాయకులు ఎంబి.నర్సారెడ్డి, బి.వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా బిజెపి నాయకులు, కార్యకర్తలు కూడా జిఓపై నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను పక్కదారి పట్టిస్తూ ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటోందని బిజెపి నేతలు రామ్మోహాన్‌ రావు, నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments