ప్రజాపక్షం/ఖమ్మం : రెండు తెలుగు రాష్ట్రాల నడుమ ఇప్పుడు భద్రాచలం చర్చనీయాంశమైంది. సానుకూలత ఏర్పడుతుందని ఆశించిన తెలంగాణ ప్రజలకు నిరాశే ఎదురుకానుందన్న వార్తలు వినపడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రాష్ట్ర విభజన భద్రాచలం ప్రాంతంపై ప్రభావం చూపింది. పోలవరం ప్రాజెక్టు ముంపు పేరుతో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశా రు. ముఖ్యంగా భద్రాచలం పట్టణం చుట్టూ ఉన్న గ్రామాలతో పాటు దేవాలయ భూములు ఉన్న గ్రామాలను కూడా ఆంధ్రాలో విలీనం చేయడం పట్ల అప్పట్లో నిరసన వ్యక్తమైంది. కెసిఆర్ భద్రాచలం వచ్చినప్పుడు విలీన గ్రామాలు తిరిగి మనవైపుకు వచ్చే అవకాశం ఉందంటూ ప్రకటన చేశారు. ఆ తర్వాత ఏళ్లు గడచినా ఆ విషయం ప్రస్తావనకు రాలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జగన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భద్రాచలాన్ని ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తారన్న ప్రచారం జోరందుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి భద్రాద్రి పట్ల విపక్ష కొనసాగుతూనే ఉంది. కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక దేవాలయాలకు తిరిగి అభివృద్ధ్ది చేసినా భద్రాచలం పట్ల మాత్రం కొంత వివక్షత ప్రదర్శించారు. ఐదు సార్లు ఆయన హయాంలో కల్యాణాలు జరిగితే రెండు సార్లు మాత్రమే హాజరయ్యారు. రూ.100 కోట్ల నిధులు ప్రకటించి సంవత్సరాలు గడచినా ప్రణాళికలు, డిజైన్లు, మ్యాపులు అంటూ కాలయాపన చేశారే తప్ప ఆ దిశగా పనులు చేపట్టింది లేదు. 1956 సంవత్సరంలో గోదావరి ఆవల గల భద్రాచలం డివిజన్‌ను ఖమ్మం జిల్లాలో విలీనం చేశారు. ప్రత్యేకమైన ఇక్కడి గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు రాష్ట్రానికే కీర్తిని తెచ్చిపెట్టాయి. అపారమైన అటవీ సంపద, ఖనిజ నిక్షేపాలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. పోలవరం ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనం తర్వాత భద్రాచలం పట్టణం మాత్రమే మిగిలి మండలంలోని గ్రామాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లో కలిశాయి. భద్రాచలం డివిజన్‌లోని చింతూరు, కూనవరం, విఆర్‌పురం కూడా అటువైపుకే వెళ్లాయి. భద్రాచలం దేవాలయంతో తెలంగాణ ప్రాంతానికి శతాబ్దాల అనుబంధం ఉంది. నైజాం ప్రభుత్వంలో తహసీల్దార్‌గా పనిచేసిన కంచర్ల గోపన్న ఈ దేవాలయాన్ని నిర్మించారని ప్రతీతి. అప్పటి నుంచి నైజాం సంస్థానం నుంచి సీతారాముల కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు పంపడం ఆచారంగా వస్తుంది. గతంలో ముఖ్యమంత్రులే స్వయంగా తీసుకు వచ్చేవారు. గత మూడు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదు. ఇప్పుడు ఏకంగా భద్రాచలాన్ని వదిలివేస్తున్నారన్న ప్రచారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశమైంది. విలీన మండలాల పైనే పెద్ద ఎత్తున ఆందోళన జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా భద్రాచలాన్నే వదిలేస్తే సహించేది లేదని స్థానిక ప్రజలు అంటున్నారు. ఇక చారిత్రాత్మక, ఆధ్యాత్మిక ప్రదేశమైన భద్రాచలాన్ని వదులుకునేందుకు ఉమ్మడి జిల్లా ప్రజలు సిద్ధ్దంగా లేరు. రాజకీయ దృష్టితోనే భద్రాచలం విషయంలో రెండు ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఇటీవల నార్కో సంస్థ పోలవరం ముంపుపై చేసిన సర్వేలో భద్రాచలం కూడా ముంపులోనే ఉన్నట్లు చెప్పారని సమాచారం. మొత్తంగా ఇప్పుడు భద్రాచలం ఇరు రాష్ట్రాల నడుమ చర్చనీయాంశమైంది. తెలంగాణ వదులుకుంటుందో లేక భద్రాచలం చుట్టూ ఉన్న గ్రామాలను రాబట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.
భద్రాద్రిపై అభద్రతా భావం
RELATED ARTICLES