భారతీయుల సంక్షేమానికే ప్రాధాన్యం
ఉక్రేన్ సంక్షోభ నివారణకు మార్గాన్వేషణ
ఐక్యరాజ్యసమితి : ఉక్రేన్ సమస్యపై ఐక్యరాజ్యసమితిలో ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. చైనా కూడా ఇదే వైఖరి అనుసరించింది. అయితే ఉక్రేన్ సంక్షోభం పరిష్కారం కావడానికి అవసరమైన అన్ని మార్గాలను అన్ని పక్షాలతో కలిసి అన్వేషిస్తోంది. ఉక్రేన్ పై ఐక్యరాజ్యసమితిలో తీర్మానంపై ఓటింగ్ కు భారత్ దూరంగా ఉన్నప్పటికీ ఉక్రేన్ ప్రాంతీయ సమగ్రత, సార్వభౌమత్వాలను గౌరవించవలసిన అవసరం ఉందని అందువల్ల తక్షణం హింసను నివారించాలని, శత్రుత్వాలను పక్కనపెట్టాలని భారత్ స్పష్టం చేసింది. ఈ విషయాలను చెప్పేటప్పడు భారత్ కఠినస్వరాన్ని ఉపయోగించింది. యుద్ధాన్ని నివారించడంలో, సంక్షోభాన్ని పరిష్కరించడంలో దౌత్య మార్గాలకు స్వస్తిచెప్పడంపట్ల భారత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. చర్చల ప్రాధాన్యం గుర్తించి ఉక్రేన్ సమస్య పరిష్కారాన్ని కోరుకునేవారంతా తిరిగి సంప్రదింపులకు రావాలని విజ్ఞప్తి చేసింది. ఈ విషయంలో ఒక మధ్యేమార్గాన్ని కనుగొనాలని భారత్ కోరింది. హింసను, శత్రుత్వాన్ని విడనాడి తక్షణం చర్చలకు వెళ్ళాలని భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ రష్యా అధ్యక్షుడు వ్లదిమీర్ పుతిన్‌కు విజ్ఞప్తి చేశారని కూడా ఐక్యరాజ్యసమితిలో భారత్ శాశ్వత ప్రతినిధి టి ఎస్ తిరుమూర్తి చెప్పారు. సమస్య పరిష్కారానికి భారత్ తన వంతు కృషి చేస్తోందని, ఈ విషయంలో సంబంధిత దేశాలతో ఆదాన ప్రదానాలు కొనసాగిస్తోందని చెప్పారు.
ఐక్యరాజ్యసమితిలో రష్యా వ్యతిరేక తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంటూనే ఎందుకు దూరంగా ఉందో వివరణ ఇచ్చింది. ఓటు చేసిన తరువాత దౌత్యమార్గానికి తిరిగి రావాల్సిందేనని స్పష్టం చేసింది. తక్షణం హింస,శత్రుత్వం విడనాడాల్సిన అవసరం ఉందని పేర్కొంది. సంబంధింత అన్ని పక్షాలతో భారత్ సంబంధాలు కొనసాగిస్తోందని, యుద్ద నివారణకోసం అందరూ సంప్రదింపుల గదికి తక్షణం తరలి రావాలని కూడా విజ్ఞప్తి చేసింది. ఉక్రేన్ సార్వభౌమాధికారానికి, ఉక్రేన్ ప్రాంతీయ సమగ్రతపట్ల భారత్ గొప్ప గౌరవంతో ఉందని, వాటిని కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
ఉక్రేన్‌కు సంబంధించి ఇటీవలి పరిణామాలపట్ల భారత్ తీవ్రంగా కలత చెందిందని, ఉక్రేన్ చాలా స్థిరంగా, సమతుల్యంగా వ్యవహరించాలని, తన వైఖరిని చర్చల దిశగా కొనసాగించాలని భారత్ కోరింది. ఐక్యరాజ్యసమితిలో భారత్ శాశ్వత ప్రతినిధి టి ఎస్ తిరుమూర్తి మాట్లాడుతూ, విభేదాలు పరిష్కరించుకోవడానికి చర్చలు మాత్రమే ఈ సమస్యకు పరిష్కారమని అన్నారు. ఐక్యరాజ్యసమితి హక్కుల తీర్మానంలో ఉన్న ప్రపంచ దేశాలకు సంబంధించిన నిబంధనలను, సూత్రీకరణలను అన్ని దేశాలు తప్పక అనుసరించాలని భారత్ కోరింది. నిర్మాణాత్మకమైన పద్ధతిలో వీటిని ముందుకు తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
మోడీకి జెలెన్‌స్కీ ఫోన్
భద్రతామండలిలో రాజకీయ మద్దతివ్వాలని అభ్యర్థన
కీవ్ : ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఉక్రేన్ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ శనివారంనాడు ఫోన్ చేసి మాట్లాడారు. కష్టకాలంలో తమ దేశానికి అండగా ఉండాలని ఆయన మోడీకి విజ్ఞప్తి చేశారు. ఉక్రేన్ దేశ భూభాగంలో లక్షమంది రష్యా సైన్యం ప్రవేశించిందని, అందువల్ల తమ దేశానికి రాజకీయ మద్దతు ఇవ్వాలని జెలెన్‌స్కీ మోడీకి విజ్ఞప్తి చేశారు. భద్రతామండలిలో ఉక్రేన్‌కు భారతదేశం మద్దతు ఇచ్చి తమకు అండగా ఉండాలని ఉక్రేన్ అధ్యక్షుడు అభ్యర్థించారు. భారత్ శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఓటింగ్‌లో పాల్గొనకుండా దూరంగా ఉండిపోయింది. భారత్ తటస్థ వైఖరి అనుసరించడంతో ఉక్రేన్ అధ్యక్షుడు మోడీకి ఫోన్‌చేసి మద్దవు ఇవ్వాలని అభ్యర్థించారు. భద్రతామండలిలో భారత్ ఎవరివైపు మొగ్గుచూపుతుందనే విషయంపై ప్రపంచదేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశాయి. రష్యాతో భారత్‌కు ఉన్న బలమైన స్నేహం, అమెరికాలో ఉన్న సత్ సంబంధాల నేపథ్యంలో భారత్ ఆచితూచి అడుగులు వేస్తున్న తరుణంలో జెలెన్‌స్కీ ఫోన్ చేశారు. రష్యా సైనిక బలగాలను ఏ విధంగా తాము ఎదుర్కొంటున్నదీ ఆయన మోడీకి టెలిఫోన్‌లోనే వివరించారు. లక్షమంది రష్యా సైనికులు తమభూ భాగంలోకి ప్రవేశించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారు ఇష్టానుసారంగా నివాసిత ప్రాంతాలపై కాల్పులు జరుపుతున్నారు, మాకు రక్షణ కావాలి, అందువల్ల అంతర్జాతీయ వేదికపై భద్రతా మండలిలో మాకు రాజకీయ మద్దతు ఇవ్వండి, మనం కలిసి ఈ సైనిక ఆక్రమణను ఆపివేద్దాం అని ఆయన ట్వీట్‌లో కూడా పేర్కొన్నారు. అయితే మోడీకి జెలెన్‌స్కీ ఫోన్ చేయడానికి ఒకరోజు ముందే ఉక్రేన్ విదేశాంగమంత్రి ద్మీత్రో కులెబా భారత విదేశాంగమంత్రి జైశంకర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. భద్రతామండలిలో భారత్ తమకు రాజకీయ మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. రష్యాతో భారత్‌కు ఎంతో అనుబంధం ఉంది, భారత్ తన ప్రభావం చూపించి, తన పరపతితో రష్యా దళాలను కాలుపలు జరపకుండా ఆపించండి, యుద్దం విరమింపజేసేందుకు సహకరించండి అని ఆయన కోరారు. అయితే ఉక్రేన్ పరిణామాలపట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రేన్ సార్వభౌమాధికారాన్ని, సమగ్రను కాపాడాల్సిన అవసరం ఉందని, ఉక్రేన్ సమస్యకు చర్చలే పరిష్కారమని, ఈ వైఖరికే భారత్ కట్టుబడి ఉందని ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధి తిరుమూర్తి ఇప్పటికే స్పష్టం చేశారు. భారత్‌కు భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం లేదు.
భద్రతామండలిలో ఓటింగ్‌కు భారత్ దూరం
RELATED ARTICLES