జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ స్పష్టీకరణ
పరిశ్రమల పునఃప్రారంభానికి మార్గదర్శకాలు
విశాఖపట్నం దుర్ఘటన నేపథ్యంలో చర్యలు
న్యూఢిల్లీ : విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటన నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డిఎంఎ) అప్రమత్తమైంది. కరోనా వైరస్ వల్ల దేశంలో లాక్‌డౌన్ విధించిన నాటి నుంచి పరిశ్రమలన్నీ మూతపడిన విషయం తెలిసిందే. అయితే పరిశ్రమల పునఃప్రారంభానికి ఎన్‌డిఎంఎ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఆంక్షల సడలింపు నేపథ్యంలో పరిశ్రమలు తిరిగి తమ కార్యకలాపాలను పునరిద్ధరించేందుకు సిద్ధమవుతున్న వేళ తగు సూ చనలు చేసింది. కార్మికులు, ఉద్యోగుల భద్రతకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసిం ది. ఈ మేరకు సంస్థ అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు సమాచారం అందజేసింది. కొంతమంది కార్మికులు లేదా ఉద్యోగులు ‘ప్రామాణిక నిర్వహణ ప్రక్రియల్ని (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్స్)’ అనుసరించడంలో నిర్ల క్ష్యం వహించే అవకాశం ఉండొచ్చు అని ఎన్‌డిఎంఎ అభిప్రాయపడింది. దీని ఫలితంగా ఉత్పత్తి కేంద్రాలు, పైప్‌లైన్లు, కవాటాలు తదితర ప్రాంతాల్లో పేరుకుపోయిన రసాయనాల వల్ల ప్రమాదం సంభవించే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఇతర ప్రమాదకర రసాయనాలు, మండే గుణం ఉన్న పదార్థాల నిల్వ కేంద్రాల దగ్గర కూడా అపాయం పొంచి ఉంటుందని హెచ్చరించింది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం శివారులోని ఆర్.ఆర్.వెంకటాపురం గ్రామంలో ఉన్న ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుంచి గురువారం తెల్లవారుజామున స్టైరీన్ ఆవిరి భారీఎత్తున గాల్లోకి ఎగిసిన విషయం తెలిసిందే. గాఢనిద్రలో ఉన్న ప్రజలు తమకు తెలియకుండానే విషపూరితమైన ఆ ఆవిర్లు పీల్చి నిమిషాల్లోనే అచేతన స్థితికి వెళ్లిపోయారు. కొందరు నిద్రలోనే స్పృహ కోల్పోగా మరికొందరు మెలకువ వచ్చి బయటకు పరుగులు తీశారు. ఈ దారుణ ఘటనలో 12 మంది మృత్యువాతపడ్డారు. 44 మంది చిన్నారులు సహా 348 మంది ప్రజలు వివిధ ఆసుపత్రుల్లో చేరారు.
ఎన్‌డిఎంఎ మార్గదర్శకాలు..
* పరిశ్రమల పునఃప్రారంభం తర్వాత తొలి వారాన్ని (ప్రయోగాత్మక దశ) ట్రయల్ రన్ లేదా టెస్ట్ రన్ దశగా పరిగణించాలి.
* ఒకేసారి కార్యకలాపాల్ని గరిష్ఠ స్థాయికి తీసుకెళ్లకుండా క్రమంగా ఉత్పత్తిని పెంచాలి.
* 24 గంటలు పరిశ్రమ, పరిసర ప్రాంతాల్ని శానిటైజ్ చేయాలి.
* భోజనశాలల వంటి తరచూ తిరిగే ప్రదేశాలు, అందరూ వినియోగించే బల్లల వద్ద ప్రతి రెండు, మూడు గంటలకొకసారి శానిటైజ్ తప్పనిసరి.
* ప్రత్యేక సాధనాలు, ఉపకరణాలు, యంత్రాలపై పనిచేసేవారు తమ పరిసర ప్రాంతాల్లో వాసన, వైర్లు తేలడం, అనుకోని శబ్దాలు, వైబ్రేషన్ల వంటి అసాధారణ పరిస్థితుల్ని పసిగట్టేలా అప్రమత్తం చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అవసరమైతే వెంటనే నిర్వహణ కార్యక్రమాలు చేపట్టాలి.
* అనుకోని ప్రమాదాల్ని ఎదుర్కొనేందుకు స్థానికంగా ఉండే ’మేజర్ యాక్సిడెంటల్ హజార్డ్'(ఎంఎహెచ్) యూనిట్లు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
* కార్యకలాపాల పునరుద్ధరణకు ముందు పూర్తి స్థానిక తనిఖీ జరపాలి.
* విషపూరిత వాయువులు, ద్రవాలు లీక్ కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలి. లీక్‌లను గుర్తించేలా ముందే తగు తనిఖీలు చేపట్టాలి.
* రోజుకు రెండుసార్లు, ఉద్యోగులు లేదా కార్మికుల శరీర ఉష్ణోగ్రతను పరీక్షించాలి. లక్షణాలు ఉన్నవారిని వెంటనే క్వారంటైన్‌కు పంపాలి. ప్రతిఒక్కరికీ మాస్కులు, శానిటైజర్లు అందజేయాలి.
* పరిశ్రమ నిర్వహణ, పాలనా సిబ్బంది ఒక షిఫ్టులో కేవలం 33శాతం మంది మాత్రమే హాజరుకావాలి.