నల్లగొండ జిల్లాలో అసంపూర్తిగా పథకం పనులు
ఇంటింటికి నల్లా కనెక్షన్ కోసం రోడ్ల ధ్వంసం
మరమ్మతులు చేయకుండా వదిలేస్తున్న కాంట్రాక్టర్లు
ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్న గుత్తేదారులు
ప్రజాపక్షం/ నల్లగొండ: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మానస పుత్రికగా భావించే మిషన్ భగీరథ పథకం నల్లగొండ జిల్లాలో నత్తను తలపిస్తోంది. ప్రతి ఇంటికి శుద్ధి జలాన్ని అందించాలన్న సర్కార్ లక్ష్యం నీరు గారిపోతుంది. కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్ల నిర్వాకం పుణ్యమా అని అసంపూర్తి పనులతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రభుత్వ లక్ష్యం, అధికారుల పనితీరు పర్యవేక్షణ బాగానే ఉన్నా గుత్తేదారుల నిర్లక్ష్యం అడుగడుగునా దర్శనమిస్తోంది. ప్రధాన పైపులైన్ కోసం రోడ్లను ధ్వంసం చేసి వాటి మరమ్మతులు సక్రమంగా చేపట్టకపోవడం, పాత నీటి ట్యాంకుల్లో నీటి నిల్వ, పాత పైపులైన్ ద్వారానే శుద్ధి జలాల సరఫరా వంటి పనులు భగీరథ ఉనికినే ప్రశ్నించేలా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 31 మండలాలు, 844 గ్రామ పంచాయతీలు కలుపుకొని సర్కార్ శ్రీకారం చుట్టినా మిషన్ భగీరథ లక్ష్యం వైపు దూసుకెళ్లేందుకు సరైన నిధులు కేటాయించినప్పటికీ, విధులు నిర్వహించేందుకు అధికారులు సిద్ద్ధంగా ఉన్నా గుత్తేదారుల నిర్లక్ష్యంతో లక్ష్యం నీరు గారుతోంది.