HomeNewsBreaking Newsబ్లాక్‌ బాక్స్‌ లభ్యం

బ్లాక్‌ బాక్స్‌ లభ్యం

నేపాల్‌లో విమానం కుప్పకూలిన ఘటనలో ఎవరూ ప్రాణాలతో లేరని ప్రకటించిన అధికారులు
ఖాట్మాండూ:
నేపాల్‌లో ఆదివారం కుప్పకూలిన విమానం తాలూకు బ్లాక్‌ బాక్స్‌ లభ్యమైనట్టు అధికారులు ప్రకటించారు. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలతో లేరని స్పష్టం చేశారు. యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఇటీవలనే నిర్మించిన పొఖారా విమానాశ్రయం వద్ద కూలిపోయిన ఘటనలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. వీరిలో ఒకరు తీసిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది. సోమవారం నేపాల్‌ ఆర్మీ అధికారులు విడుదల చేసిన ప్రకటనను అనుసరించి నేపాలీ రాజధాని ఖట్మండు నుంచి ట్విన్‌ ఇం జిన్లతో కూడిన టర్బోప్రాప్‌ ఎటిఆర్‌ విమానం పొఖారాకు బయలుదేరింది. ఈ రెండు నగరాల మధ్య విమాన ప్రయాణ వ్యవధి 25 నిమిషాలు. ఖట్మండులోని త్రిభువన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్ట్‌లో ఆదివారం ఉదయం 10.33 గంటలకు విమానం టేకాఫ్‌ అయింది. సేతీ నదీ లోయలో అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ విమాన ప్రమాదంపై నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ దహల్‌ మంత్రి మండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రత్యేక కమిషన్‌ను నియమించి, 45 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నేపాల్‌ విమాన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. విదేశాంగ మంత్రి జైశంకర్‌ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రమా దం చోటు చేసుకున్న విమానాశ్రయం చైనా బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ సహకారంలో భాగంగా నిర్మితమైంది. ఖట్మండు పోస్ట్‌ వార్తాపత్రిక ప్రకారం, ఈ టూరిస్ట్‌ హబ్‌లో విమానాశ్రయం నిర్మాణం కోసం నేపాల్‌ ప్రభుత్వం 2016లో మార్చి చైనాతో 215.96 మిలియన్‌ డాలర్ల సాఫ్ట్‌ లోన్‌ ఒప్పందంపై సంతకం చేసింది. గత ఏడాది దీని నిర్మాణం పూర్తయింది. అన్నపూర్ణ పర్వత శ్రేణి నేపథ్యంలో నిర్మించిన ఈ విమానాశ్రయాన్ని నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ దహల్‌ ప్రచండ ఈనెల ఒకటో తేదీన అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రమాద ఘటనకు కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే, బ్లాక్‌ బాక్స్‌ లనించడంతో చివరి క్షణాల్లో ఏం జరిగిందనే విషయంపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ (సివిఆర్‌)లో రికార్డయిన సంభాషణలు ప్రమాద కారణాలను కొంతవరకైనా వెల్లడిస్తాయి.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments