కొత్త నేత ఎంపిక వరకూ బాధ్యతలు కొనసాగిస్తానని వెల్లడి
లండన్: కరోనా మహమ్మారి కట్టడిలో వైఫల్యం నుంచి నిబంధనల ఉల్లంఘన వరకూ అనేకానేక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేశారు. కన్జర్వేటివ్ పార్టీ చీఫ్‌గా కూడా ఆయన వైదొలగడంతో, కొత్త నాయకుడి ఎన్నిక అనివార్యమైంది. నూతన నేత ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే వరకూ ప్రధానిగా బాధ్యలను కొనసాగిస్తానని జాన్సన్ ఒక తెలిపారు. స్థానిక పత్రికల వార్తా కథనాలను అనుసరించి జాన్సన్‌పై పలువురు మంత్రులు, ఎంపిలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన వెంటనే పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తూ, యాభై మందికిపైగా మంత్రులు, పార్టీ నేతలు రాజీనామాలు చేశారు. ఫలితంగా జాన్సన్‌కు పదవీగండం తప్పలేదు. చివరి క్షణం వరకూ రాజీనామా చేసేది లేదని పట్టుబట్టిన జాన్సన్, అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో రాజీనామాకు అంగీకరించారు. హెన్లే నియోజకర్గం నుంచి 2001 2008 మధ్యకాలంలో దిగువకు జాన్సన్ ప్రాతినిథ్యం వహించారు. 2008 నుంచి 2016 వరకూ ఆయన లండన్ మేయర్‌గా పని చేశారు. ఆ సమయంలోనే లండన్ ఒలింపిక్స్ (2012) జరిగాయి. ఆ మెగా ఈవెంట్‌ను విజయవంతం చేసి సెభాష్ అనిపించుకున్న జాన్సన్ బ్రెగ్జిట్ ఆందోళన సమయంలోనూ యుకె రాజకీయాల్లో చక్రం తిప్పారు. అయితే, దేశంలో కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోలేకపోయారన్న విమర్శలు ఆయనపై వెల్లువెత్తాయి. అదే సమయంలో కన్జర్వేటివ్ పార్టీకే చెందిన కొంత
మంది ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు కరొనా నిబంధనలను అతిక్రమించి విందులువినోదాల్లో మునిగితేలడం కూడా ఆయన సర్కారుపై ప్రజల్లో అసంతృప్తిని పెంచాయి. పార్టీ సీనియర్ నాయకుడొకరిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగుచూడడంతో జాన్సన్‌పై ఒత్తిడి పెరిగింది. ఆర్థిక వ్యవస్థ పతనం కాకుండా జాగ్రత్తలు తీసుకోలేకపోయారని, అదే విధంగా కరోనా సమయంలో మిగతా ప్రపంచ దేశాలన్నిటికంటే బ్రిటన్‌లోనే అత్యధిక మరణాలు సంభవించడానికి కూడా ఆయన నిర్లక్ష్య వైఖరే కారణమని విపక్షాలు మండిపడ్డాయి. సొంత పార్టీలోనూ అసంతృప్తులు పెరిగారు. పలువురు మంత్రులు రాజీనామాలతో నిరసన వ్యక్తం చేయడంతో, జాన్సన్ తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది.