కలిసొచ్చే పార్టీలతో కేంద్రంపై ఒత్తిడి
అక్టోబరులో భారత ప్రజా యాత్ర
చింతన్ శిబిర్‌లో 20 తీర్మానాలు ఆమోదం
వైఫల్యాలు అధిగమిస్తాం
ఎన్నికలకు సిద్ధమవుతాం: సోనియా
ఉదయ్‌పూర్ : ఇవిఎంల స్థానంలో తిరిగి బ్యాలెట్ పత్రాలతో ఎన్నికల ప్రక్రియ చేపట్టాల్సిన అవసరం ఉందని రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో మూడురోజుల కాంగ్రెస్ నవసంకల్ప్ చింతన్ శిబిర్ డిమాండ్ చేసింది. చివరిరోజు ఆదివారంనాటి సదస్సులో ఈ అంశాన్ని ప్రధానంగా పార్టీ అధినేత్రి ముందుకు తెచ్చారు. దీనికోసం కలిసి వచ్చే పార్టీలతో ఒత్తిడి, ఉద్యమ కార్యక్రమాలతో ముందుకు వెళతామని కూడా సదస్సు స్పష్టం చేసింది.“గ్రాండ్ ఓల్డ్ పార్టీని పునరుద్ధరించి పునరుజ్జీవింపజేసేందుకు చింతన్ శిబిర్ ధృఢ సంకల్పం తీసుకుందని అధినేత్రి సోనియాగాంధీ ప్రకటించారు. ఒక కుటుంబానికి ఒకే పదవి ఇవ్వాలన్న
అంశాన్ని కఠినంగా అమలు చేసేందుకు చింతన్ శిబిర్ కట్టుబడింది. ఆ కుటుంబంలో వారికి ఐదేళ్ళ వరకూ మరో పదవి ఇవ్వకూడదని కూడా తీర్మానంలో శిబిరం స్పష్టం చేసింది. దేశంలో మతసామరస్య వాతావరణాన్ని పెంపొందించేందుకు, సామాజిక విలువలను స్థిరపరిచేందుకు, బిజెపి పాలనలో దాడికి గురైన రాజ్యాంగ మౌలిక విలువలను పరిరక్షించేందుకు అక్టోబరులో గాంధీ జయంతినాడు కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకూ కాంగ్రెస్‌పార్టీ భారత ప్రజా యాత్ర చేపడుతుందని సోనియాగాంధీ ప్రకటించారు. ‘ఈ యాత్రలో మేమందరం పాల్గొంటాం, పార్టీ శ్రేణులన్నీ పాల్గొంటాయి, ఎన్నికల వైఫల్యాలను అధిగమిస్తాం, పార్టీనిపునరుజ్జీవింపజేస్తాం”అని సోనియాగాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు. “పార్టీలో అంతర్గత సంస్కరణలు అమలు చేయడం కోసం ఒక సంఘటితశక్తిగా పనిచేసే కర్తవ్య నిర్వహణా బృందాన్ని ఏర్పాటు చేస్తామని, ఈ బృందం బాధ్యతాయుతంగా తన పనులు చక్కబెడుతుందని అన్నారు. కాంగ్రెస్‌పార్టీలో సమూల సంస్కరణలు, సంస్థాగతమైన ప్రక్షాళన కార్యక్రమం చేపట్టేందుకు వీలుగా ఉదయ్‌పూర్ నవ సంకల్ప్ చింతన్ శిబిర్‌లో ఆదివారం మూడవరోజు సదస్సులలో తుదివిడత చర్చలు ఉధృతంగా కొనసాగాయి. సదస్సులో విభాగాల వారీగా 20 తీర్మానాలను చింతన్ శిబిర్ ఆమోదించింది. ఈ తీర్మానాలు, నవసంకల్ప్ డిక్లరేషన్‌ను దేశవ్యాప్త కార్యాచరణకు వీలుగా కాంగ్రెస్ వరింగ్ కమిటీ తదుపరి మరోసారి సమావేశం అవుతుంది.
దేశవ్యాప్తంగా హాజరైన 450కు పైగా ప్రతినిధులు ఇప్పటికే రెండు రోజులపాటు చింతన్ శిబిర్‌లో చర్చలు ముగించారు. సంస్థాగతంగా యువతరం, దళితులు, అణగారిన వర్గాలు, మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చే విషయంపై కూడా ఈ శిబిరం క్షుణ్ణంగా చర్చించి తీర్మానాలు ఆమోదించింది. మూడవరోజు సదస్సులలో తీర్మానాల జోరు కొనసాగింది. ఒకవైపు సంస్థాగతమైన లోటుపాట్లు, సంస్కరణలతోపాటు దేశ సమస్యలను రంగాలవారీగా విభజించి వివిధ కమిటీల ద్వారా క్షుణ్ణంగా చింతన్ శిబిర్‌లో కాంగ్రెస్ నాయకులు చర్చించారు. అనేక తీర్మానాలు చేశారు. ఆరు కీలకమైన కమిటీలను చర్చల నిమిత్తం పార్టీ అధినేత్రి ఆ శిబిరం కోసం ఏర్పాటు చేశారు. దేశంలో నెలకున్న ఆర్థిక సంక్షోభం, అంతర్జాతీయ పరిస్థితు ప్రభావం, సరఫరా వ్యవస్థ విచ్ఛిన్నం వల్ల కలిగే పర్యవసానాలు, నిరుద్యోగిత, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, వ్యవసాయరంగం, కనీస మద్దతు ధర, రైతు సమస్యలు, కేంద్ర ప్రభుత్వ ఆలోచనా విధానం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు, పన్నుల వసూళ్ళు, యువతరం సమస్యలు, సమాచార సాంకేతిక రంగం ప్రభావం, వివిధ దేశాలతో సంబంధాలు వంటి అనేక అంశాలకు భిన్నంగా బిజెపి మతోన్మాద వైఖరి, పర్యవసానాలు, జాతీయవాదం, కాంగ్రెస్ తరహా జాతీయతావాదం, స్వాతంత్య్ర చరిత్రను దేశంలో యువతకు తెలియజేయవలసి ఆవశ్యకత…వంటి అనేక అంశాలపై చింతన్ శిబిర్ చర్చలు పూర్తిచేసింది. సైద్ధాంతిక అంశాలు, ఆర్థిక విధానాలు, సోషల్ ఇంజనీరింగ్, లోక్‌సభ ఎన్నికల వ్యూహం వంటి సంక్లిష్టమైన అవశాలపై చర్చలు, తీర్మానాలు ఏ రూపంలో ఉంటాయో అని అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, భవిష్యత్ పార్టీ నాయకులు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ వాద్రా, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గులాంనబీ అజాద్, మల్లికార్జునఖర్గే, పి.చిదంబరం, అంబికాసోని తదితర నాయకులు చింతన్ శిబిర్ సందర్భంగా ఆదివారం జరిగిన సిడబ్ల్యుసి సమావేశంలో పాల్గొన్నారు. సంస్థాగతమైన సంస్కరణలు, కీలక సమస్యలపై పార్టీ వైఖరులకు తుదిరూపం ఇవ్వడంతోపాటు చింతన్ శిబిరంలో చర్చల తీరుతెన్నులు, విధులను ఈ సమావేశం చర్చించింది.
బ్యాలెట్ పత్రాల విధానమే ఉండాలి
RELATED ARTICLES