చిన్న చిన్న సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం
పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్న పట్టభద్రులు
మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌లో 59.96 శాతం పోలింగ్
నల్లగొండ-వరంగల్-ఖమ్మం నియోజకవర్గంలో 64.70 శాతం
4 గంటల సమయానికి క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసే అవకాశం
ప్రజాపక్షం న్యూస్ నెట్‌వర్క్
రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల పోలింగ్ చిన్న చిన్న సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగింది. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. అభ్యర్థు ల భవిష్యత్తు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. అయితే పలు పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 4 గంటల సమయానికి క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. గత ఎన్నికల కంటే ఎక్కువగా పెద్ద సంఖ్యలో పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనేక పోలింగ్ బూత్‌లలో పట్టభద్రులు బారులుతీరి నిలబడడం కనిపించింది. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో 59.96 శాతం పోలింగ్ నమోదు కాగా, -నల్గొండ నియోజకవర్గంలో 64.70శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తం 21 జిల్లాలు, 77 శాసనసభ నియోజకవర్గాల్లో ఏర్పాటుచేసిన 1,530 పోలింగ్ కేంద్రాల్లో పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సందర్భంగా అక్కడక్కడాపలు రాజకీయ పార్టీల నాయకులు, పోలింగ్ ఎజెంట్ల మధ్య చిన్న చిన్న ఘర్షణాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో పలు కేంద్రాల వద్ద ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. మొత్తంమ్మీద పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. మహబూబాబాద్ జిల్లాలో టిఆర్‌ఎస్ నాయకులు డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలు రావడంతో సిపిఐ, టిఆర్‌ఎస్ నేతల మధ్య ఘర్షణ జరగడంతో పోలీసులు లాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. నల్గొండ జిల్లా ఎన్‌జి కాలేజ్‌లో ఏర్పాటు చేసిన బూత్ నెం.30లో బిజెపి ఏజెంటుపై టిఆర్‌ఎస్ నేతలు చేయిచేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఐడి కార్డు లేకుండా ఏజెంటుగా ఎలా కూర్చుంటావంటూ టిఆర్‌ఎస్ నేతలు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు ఏర్పాట్లు సరిగ్గా చేయకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎండలోనే నిల్చుని ఓట్లు వేశారు. హైదరాబాద్ మీర్‌పేట్ సిర్లహిల్స్‌లోని ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రంలో అనూష(26) అనే ఓటరు అస్వస్థతకు గురైంది. ఎండలో నిలబడిన ఆమె ఓటు వేసే క్రమంలో కళ్లు తిరిగి కింద పడిపోయింది. దీంతో ఆమెను పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో గతంలో ఎన్నడూలేని విధంగా బహిరంగంగా టిఆర్‌ఎస్ పార్టికి చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పట్టభద్రుల ఓటర్లకు బహిరంగంగా విచ్చలవిడిగా డబ్బులను పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలో టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, ఆయన అనుచరులు డబ్బులు పంచుతూ సెల్‌ఫోన్ కెమెరాలకు చిక్కారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాంగ్రెస్, బిజెపి కార్యకర్తలు టిఆర్‌ఎస్ డబ్బులు పంచుతున్న చోటుకు వెళ్లి అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణానికి దారి తీసింది. టిఆర్‌ఎస్ పార్టీ మండల కేంద్రాల్లోని ఫంక్షన్ హాల్స్‌ను అడ్డాగా చేసుకుని ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి పట్టభద్రులకు డబ్బులు పంపిణీ చేశారు. రామన్నపేట, చౌటుప్పల్, నారాయణపురం, పోచంపల్లి, బొమ్మలరామారం తదితర మండల కేంద్రాల్లో టిఆర్‌ఎస్ అడ్డాగా మార్చుకున్న ఫంక్షన్ హాల్స్ వద్దకు కాంగ్రెస్, బిజెపి, సిపిఐ, సిపిఐ(ఎం) కార్యకర్తలు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. బొమ్మలరామారంలో బిజెపి ఎంపిటిసి ఫక్కీర్ రాజేందర్‌రెడ్డి పై గులాబి కార్యకర్తలు దాడికి పాల్పడడంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పోలింగ్ సందర్భంగా మణుగూరులో ఆధికార టిఆర్‌ఎస్, ప్రతిపక్ష పార్టీల మధ్య ఘర్షణ వాతావరం చోటుచేసుకుంది. స్ధానిక ఎంఎల్‌ఎ క్యాంప్ కార్యాలయం ఎదుట టిఆర్‌ఎస్ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తుందని అఖిలపక్ష నాయకలు ఆందోళన చేపట్టారు. ఎంఎల్‌ఎ క్యాంప్ కార్యాలయం ఎన్నికలు నిర్వహిస్తున్న జిల్లా పరిషత్ పాఠశాల ప్రధాన ప్రవేశద్వారానికి కేవలం 30 మీటర్ల దూరం ఉడటంతో ఓటర్లను క్యాంప్ కార్యాలయంలోకి పిలిచి ప్రలోభాలకు గురిచేస్తూ డబ్బులు పంచుతున్నారని అఖిలపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. దీనితో క్యాంప్ కార్యాలయం ముందు అధికారపక్ష కార్యకర్తలకు, ప్రతిపక్ష నాయకులకు ఘర్షణ జరగటంతో పోలీసుల ప్రవేశించి ఇరుపక్షాలను అడ్డుకుని పరిస్ధితిని చక్కదిద్దారు.
పోలీస్ స్టేషన్ ఎదుట భట్టి ఆందోళన
ఖమ్మం నగరంలో తమ పార్టీ కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఖమ్మం నగరంలోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ఆందోళనకు దిగారు. అరెస్టు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో భట్టివిక్రమార్కకు పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తమ పార్టీ కార్యకర్తలను ఎందుకు వేధింపులకు గురిచేస్తున్నారని భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు స్టేషన్ ముందు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుని కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు…
పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వివిధ జిల్లాల్లోనూ పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ప్రముఖులు ఓటు వేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో మండల పరిషత్ పాఠశాలలో సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, ఆయన సతిమణి డాక్టర్ బి.వి.విజయలక్ష్మిలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. షేక్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు, మలక్‌పేట్‌లో హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ, బంజారాహిల్స్‌లో మేయర్ గద్వాల విజయలక్ష్మిలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూర్యాపేటలో మంత్రి జి.జగదీశ్‌రెడ్డి దంపతులు, ఖమ్మం సిద్ధార్థ కళాశాలలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, వనపర్తి ప్రభుత్వ కళాశాలలో మంత్రి నిరంజన్ రెడ్డి, మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, వరంగల్ జిల్లా వేలేరులో టిఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మహబూబాబాద్‌లో వామపక్షాల అభ్యర్థి జయసారథిరెడ్డి, భద్రాద్రి జిల్లా దమ్మపేటలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వరంగల్ పట్టణ జిల్లా హన్మకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ ధాస్యం వినయ్ భాస్కర్, హైదరాబాద్ హిమాయత్‌నగర్ ఉర్దూ పాఠశాలలో స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, తార్నాకలో బిజెపి అభ్యర్థి ఎన్.రాంచందర్‌రావు, హన్మకొండలో బిజెపిఅభ్యర్థి జి.ప్రేమేందర్ రెడ్డి, నర్సంపేటలో యువ తెలంగాణ పార్టీ అభ్యర్థి రాణి రుద్రమ, నాగర్ కర్నూల్ బాలుర ఉన్నత పాఠశాలలో కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ జి.చిన్నారెడ్డి, జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంఎల్‌ఎ లక్ష్మారెడ్డి ఓటు వేశారు. హైదరాబాద్ ఉప్పరపల్లిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రెడ్‌హిల్స్‌లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌లు ఓటు వేశారు. ఖమ్మం నగరంలోని 270వ నెంబరు రోటరీనగర్ బూత్‌లో సిపిఐ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభాపక్షం నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు ఓటు వేశారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చుంచుపల్లి మండలం బాబూక్యాంపు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పోలింగ్ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
హోం మంత్రి ఓటుపై వివాదం
రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ఓటుపై ఆసక్తికర వివాదం నెలకొంది. తమ పార్టీ అభ్యర్థికి ఓటేశానని మహమూద్ అలీ చెప్పడంతో ఇప్పుడు ఆ ఓటు చెల్లుతుందా లేదా అనే సందిగ్ధత నెలకొంది. ఈ అంశంపై ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు. గతంలో ఏ అభ్యర్థికి ఓటు వేశారో చెప్పడంతో సదరు ఓటు చెల్లదని ఈసి పరిగణించిన సంగతి తెలిసిందే. అయితే, హోంమంత్రి ఓటుపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు అందితే వెంటనే హోంమంత్రి ఓటు చెల్లుబాటు అంశాన్ని పరిశీలిస్తామని అధికారులు అంటున్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న పెళ్లి కూతురు!
అనంతరం పెళ్లి చేసుకునేందుకు ఫంక్షన్ హాల్‌కు
ఎంఎల్‌సి ఎన్నికల పోలింగ్‌లో ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మల్కాపూర్ గ్రామానికి చెందిన ఓ యువతి కాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసింది. ఫిర్దోస్ బేగం అనే యువతి కోయిలకొండ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటర్లకు స్ఫూర్తినిచ్చింది. ఓటు వేసిన అనంతరం అక్కడి నుంచి పెళ్లి చేసుకునేందుకు ఫంక్షన్ హాలుకు వెళ్లింది.
బ్యాలెట్ బాక్సుల్లో భవిష్యత్తు నిక్షిప్తం
RELATED ARTICLES