నరికేందుకు అనుమతులు ఇవ్వని ఐటిసి
ఇబ్బందులు పడుతున్న రైతులు
అధికారుల తీరుతో కోట్లాది రూపాయల నష్టం
నామినేషన్ వేయాలని 100 మంది రైతుల నిర్ణయం
ఖమ్మం బ్యూరో : గిట్టుబాటు ధర లేక ఎర్రజొన్న, పసుపు రైతులు నడుస్తున్న ఆందోళన బాటలోనే సుబాబుల్, జామాయిల్ రైతులు ఆందోళనకు సిద్ధ్దమయ్యారు. పెద్ద సంఖ్యలో రైతులు పార్లమెంటు ఎన్నికలకు నామినేషన్ వేయడం ద్వారా ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయాలని నిర్ణయించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో సుబాబుల్ పంట సాగు చేశారు. గత రెండేళ్ల నుండి అనుమతులు ఇవ్వకపోవడంతో రైతులు ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా తమ నిరసనను తెలియజేయాలని నిర్ణయించారు. వివిధ రూపాల్లో ఆందోళన నిర్వహించినా ఫలితం లేకపోవడంతో రైతులు బ్యాలెట్ పోరుకు సిద్ధ్దమయ్యారు. ఇప్పటికే 35 మంది రైతులు నామినేషన్ పత్రాలు తీసుకోగా మొత్తం 100 మంది రైతులు నామినేషన్ వేయాలని నిర్ణయించారు. భద్రాచలం పేపర్ బోర్డు అనుసరిస్తున్న వైఖరిపై ప్రభుత్వం రైతుల పట్ల సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ధర తగ్గినా దొరకని అనుమతులు : జామాయిల్, సుబాబుల్ ధర గణనీయంగా తగ్గిన పంటను కర్మాగారానికి తెచ్చేందుకు అనుమతులు రావడం లేదు. పదేళ్ల క్రితం ఐటిసి కర్మాగారం (భద్రాచలం పేపర్ బోర్డు) సుబాబుల్, జామాయిల్ సాగు కోసం రైతులను ప్రోత్సహించింది. పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించి సుబాబుల్ సాగు కొరకు విపరీతంగా ప్రచారం చేపట్టింది. అదే సమయంలో పత్తి, మిరప మొదలైన వాణిజ్య పంటలతో వరుస నష్టాలు వస్తుండడంతో రైతులు సుబాబుల్ వైపు మొగ్గు చూపారు. తొలుత జామాయిల్ టన్నుకు రూ.6,600, సుబాబుల్ రూ.5,600ల చొప్పున చెల్లించింది. కొందరి అధికారుల వైఖరి, దళారీ వ్యవస్థ తదితర కారణాలతో ధర క్రమేపీ తగ్గింది. పెట్టుబడులు పెరిగి అన్ని వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరుగుతుంటే సుబాబుల్ ధర క్రమేపీ తగ్గింది. ఇప్పుడు టన్నుకు రూ.4,500 చెల్లిస్తుండగా రైతుకు రూ.3 వేలే దక్కుతుంది. అయినా కర్రను రైతులు ఐటిసికి సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నా యాజమాన్యం అనుమతి ఇవ్వడం లేదు. జామాయిల్‌కు తొలుత రూ.6,600 చెల్లించిన ఐటిసి యాజమాన్యం ఇప్పుడు రూ.5,500 చెల్లిస్తుంది. ఆరు సంవత్సరాల పంటకు కూడా అనుమతులు ఇవ్వడం లేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అధికారుల వైఖరితో కోట్లాది రూపాయల ఆదాయానికి గండి: అటవీశాఖలో పనిచేస్తున్న కొందరు అధికారులు ఐటిసి యాజమాన్యంతో కుమ్మక్కు కావడంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుంది. అడవుల్లో లభ్యమయ్యే కర్రను ఐటిసికి సరఫరా చేసే వారు. ఐటిసి టన్నుకు రూ. 6,600 చెల్లించేది. ఇటీవల కాలంలో కొందరు అధికారులు యాజమాన్యంతో కుమ్మకై టన్ను రూ. 4,200కే సరఫరా చేస్తున్నారు. యేటా 10 లక్షల టన్నుల అడవి కర్రను ఐటిసికి సరఫరా చేస్తున్నా రు. ఈ ఏడాది కూడా ఇప్పటికే దాదాపు 5 లక్షల టన్నులను సరఫరా చేశారు. టన్నుకు రూ.2400ల చొప్పున ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుంది. 10 లక్షల టన్నుల కర్రను సరఫరా చేస్తే ప్రభుత్వానికి సుమారు రూ.2400 కోట్ల నష్టం వాటిల్లుతుంది. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం కిమ్మనకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.
రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న యాజమాన్యం : సుబాబుల్, జామాయిల్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నా పంటను అమ్మలేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతుంటే ఐటిసి యాజమాన్యం మాత్రం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తుం ది. పలు దఫాలు ఆందోళన చేసిన సందర్భంలో ఎన్ని హామీలు ఇచ్చినా ఏ ఒక్కటీ అమలు చేయలేదు. ఐటిసి యాజమాన్య వైఖరితో విసిగిన రైతులు తమ నిరసన తెలిపేందుకు బ్యాలెట్ పోరుకు సిద్ధమయ్యారు.
బ్యాలెట్ పోరులో సుబాబుల్ రైతులు
RELATED ARTICLES