నేడు, రేపు జరిగే సమ్మెలోకి 10 లక్షల మంది ఉద్యోగులు
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ వ్యవస్థ కార్యకలాపాలకు సోమ, మంగళవారాల్లో విఘాతం కలుగనున్న ది. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకం గా బ్యాంకు ఉద్యోగ సంఘాలు దేశవ్యాప్తంగా 15,16 తేదీల్లో సమ్మె తలపెట్టాయి.బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక (యుఎఫ్బియు) పిలుపు మేరకు ఈ కార్యకలాపాలన్నింటినీ ఉద్యోగులు రెండు రోజులపాటు స్తంభింపజేస్తారు. బ్రాంచీల్లో నగదు చెల్లింపులు, డిపాజిట్లు, చెక్కుల క్లియరెన్స్, రుణాల ఆమోదం వంటి కార్యకలాపాలన్నీ జాతీయ సమ్మె కారణంగా బుధవారం నాటికి గానీ తిరిగి ప్రారంభం కావు. యుఎఫ్బియు ఛత్రం కింద తొమ్మిది బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఐక్యంగా ఈ జాతీయ సమ్మె కు పిలుపు ఇచ్చాయి. పది లక్షలమంది బ్యాంకు ఉద్యోగులు, అధికారులు ఈ జాతీయ సమ్మెలో పాల్గొంటున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా, అనేక ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన సంఘాల నాయకులు ఇప్పటికే తమ తమ ఖాతాదార్లకు ఈ విషయాలన్నీ తెలియజేశారు. సర్వసాధారణమైన బ్యాంకింగ్ కార్యకలాపాలు కూడా సోమ, మంగళవారాల్లో స్తంభించిపోతాయి. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం సమర్పించిన బడ్జెట్లో, రెండు ప్రభుత్వరంగ బ్యాంకులనను ప్రైవేటీకరిస్తామని, ప్రభుత్వం చేపట్టిన పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికలో భాగంగా ఈ చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించడంతో బ్యాంకు ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన, అభద్రతాభావం ప్రారంభమైంది. అది మెల్లిగా దేశమంతా రాజుకుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఐడిబిఐ బ్యాంకును ప్రైవేటీకరించింది. ఆ బ్యాంకులోని భారీవాటాను 2019లో అమ్మేసింది. దాంతోపాటే మరో 14 ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసింది. అయితే దీనిపై అదనపు ప్రధాన కార్మికశాఖాధికారి ఎదుట మార్చి 4,9,10 తేదీల్లో జరిగిన ఉద్యోగ సంఘాలకు చేసిన బుజ్జగింపు సమావేశాలు ఎలాంటి సానుకూల ఫలితాలూ ఇవ్వలేదనీ, దాంతో దేశవ్యాప్తంగా పది లక్షలమంది ఉద్యోగులు సమ్మెకు సమాయత్తమయ్యారని ఎఐబిఇఎ ప్రధాన కార్యదర్శి సిహెచ్.వెంకటాచలం చెప్పారు. ఎఐబిఇఎ, ఎఐబిఓసి, ఎన్సిబిఇ, ఎఐబిఓఎ, బెఫిలు యుఎఫ్బియులో సభ్యులుగా ఉన్నాయి. కాగా ఐఎన్బిఇఎఫ్, ఐఎన్బిఓసి, ఎన్ఓబిడబ్ల్యు, ఎన్ఓబిఓలు ఇతర బ్యాంకు ఉద్యోగ సంఘాలు.
బ్యాంకింగ్ సేవలు బంద్
RELATED ARTICLES