రుణమాఫీకి రూ.18వేల కోట్లు బ్యాంకుల్లో జమచేస్తే రూ.7,500 కోట్లు ఇవ్వడం సరైంది కాదు
మానవీయ కోణంలో చొరవచూపాలి
రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క
ప్రజాపక్షం/హైదరాబాద్:
బ్యాంకర్ల కు కేవలం లెక్కలు ఉండడమే మాత్రమే కాదు& అట్టడుగు వర్గాల అభివృద్దికి ఆర్ధిక తోడ్పాటును అందించే ఆత్మ& కూడా ఉండాలని ఉపముఖ్యమంత్రి, ఆర్ధికశాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం రూ. 18 వేల కోట్లు బ్యాంకుల్లో జామా చేస్తే ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు దాటిపోయినా రైతులకు మాత్రం ఇప్పటీ వరకు కొత్త రుణాలు కేవలం రూ.7500 కోట్లు మాత్రమే ఇవ్వడం సరైంది కాదన్నారు. బ్యాంకర్లు మానవీయ కోణంలో చొరవ చూపాలని ఆయన కోరారు. మంగళవారం ప్రజాభవన్లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం(ఎస్ఎల్బిసి) జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటి సిఎం, ఆర్ధిక శాఖమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ వ్యవసాయ రంగం రాష్ట్రానికి వెన్నెముకగా భావిస్తున్న తమ ప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ద్వారా రైతులను రుణ విముక్తులను చేయడం, వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల విద్యుత్, రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయంఅందించడం తద్వారా వ్యవసాయం అనుబంధ రంగాలను బలోపేతానికి నాంది కానుందన్నారు. గ్రామీణ ప్రాంతాలను వేగంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించామని ఇందుకు అనుగుణంగా రీజినల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని చెప్పారు. భారీ మధ్యతర సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నిధులు కేటాయిస్తున్నమన్న ఆర్ధిక మంత్రి వ్యవసాయం తో పాటు పారిశ్రామిక రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్య అంశంగా పరిగణిస్తుందని చెప్పారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అమెరికా, కొరియా దేశాల్లో పర్యటించి రూ.36 వేల కోట్ల విలువైన ఎంఓఏలు కుదుర్చుకున్నవిషయాన్ని గుర్తు చేశారు. సూక్ష్మ, మధ్యతరహ పరిశ్రమల ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధి కలుగుతుందని, వారికి విరివిగా రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని బ్యాంకర్లను కోరారు. అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాలకు రూ. లక్ష కోట్లు వడ్డీ లేని రుణాలు రూపంలో ఇవ్వనున్నామని వారికి సహకరించి పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలని సూచించారు.2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్ లో ప్రాధాన్యతా రంగాల అడ్వాన్సుల విషయంలో వివిధ విభాగాల్లో బ్యాంకులు సానుకూల పనితీరును కనబరిచినందుకు సంతోషిస్తున్నామని, ప్రాథమిక రంగం కింద బ్యాంకులో ఇప్పటివరకు 40.62% వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా లక్ష్యాన్ని సాధించడం అభినందనీయమన్నారు. రాష్ట్రం యొక్క నగదు నిల్వలనిష్పత్తి మొదటి క్వార్టర్లో 127. 29 శాతానికి మెరుగుపడడం మరో ఆసక్తికరమైన అంశమని పేర్కొన్నారు. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇతర రాష్ట్రాల కంటే ముందంజలో ఉండేలా మా ప్రభుత్వం వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు.
కష్టకాలంలోనే రుణ మాఫీకి రూ.18వేల కోట్లు విడుదల చేశాం ః మంత్రి తుమ్మల నాగేశ్వరారవు … కష్టకాలంలో కూడా ప్రభుత్వం రుణమాఫీ పథకాన్నిరూ. 18 వేల కోట్లు ఇప్పటికే విడుదల చేసిందని, అంకెలు చదువుకుని 3 నెలలకోసారి మీటింగ్ లు పెట్టడం అంటే బ్యాంకర్ల సదస్సుకు అర్ధంలేదని, నిమ్మవర్గాలకు ఆర్థిక ఫలాలు అందినప్పుడు అర్థం పరమార్థం ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతులకు ఏలాంటి ఇబ్బందులు కల్గకుండ క్రింది స్థాయిలో పనిచేసే బ్రాంచ్ మేనేజర్లు రుణఖాతాలో తప్పులు సరిదిద్దేటట్లు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా బ్యాంకర్లను కోరారు. తద్వారా బాధ్యతాయుతంగా వ్యవహరించి రుణమాఫీ కా ర్యక్రమాన్ని సంపూర్ణంచేయడానికి బ్యాంకర్లు సహాయ సహకారం అందించాలన్నారు. భగవంతుడు దయ వల్ల పుష్కల వర్షాలు పడుతుండడంతో ఈ వర్షాకాలంలో కూడా అధిక విస్తీర్ణములో పంటలు సాగవుతాయని ఆశిస్తున్నామని చెప్పారు. రాబోయే త్రైమాసికంలో నిర్దేశించిన రుణ ప్రణాళికను అధిగమించేందుకు బ్యాంకర్లు కృషి చేస్తారని ఆశిస్తున్నామన్నారు.