ఆసీస్ టూర్‌లో సత్తా చాటుతున్న భారత పేసర్లు
నిరాశపరుస్తున్న బ్యాట్స్‌మన్లు
ప్రజాపక్షం/ క్రీడా విభాగం: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన టెస్టు సిరీస్‌లో భారత బౌలర్లు అంచనాలకు తగ్గట్టు మెరుగైన ప్రదర్శనలు చేస్తున్నారు. మరోవైపు భారత బ్యాటింగ్ దళం ఘోరంగా విఫలమైందనడంలో సందేహంలేదు. ఆసీస్ పర్యటన అంటేనే భారత్‌కు కఠిన సవాల్ అలాంటి సవాల్‌ను ఎదుర్కోవాలంటే భారత జట్టు శాయశక్తులా రాణించాల్సి ఉంటుంది. గత కొంత కాలంగా భారత్ బౌలింగ్ దళం అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకొంటుంది. స్వంత గడ్డపైనే కాకుండా విదేశీ పర్యటనల్లోనూ భారత బౌలర్లు సత్తా చాటుతున్నారు. ఒకానొక సమయంలో భారత్‌కు బౌలింగ్ సమస్య వెంటాడేది. ప్రపంచ అగ్రశ్రేణి జట్లతో తలపడాలంటే టీమిండియాకు పెద్ద సమస్యగా ఉండేది. స్పిన్నర్లకు కొదువలేకపోయినా పేస్ బౌలర్ల సమస్య ఉండేది. ఒకరిద్దరు పేస్ బౌలర్లతోనే భారత జట్టు పోటీకి దిగేది. భారత్, ఉపఖండం పిచ్‌లపై స్పిన్నర్లు గొప్పగా రాణించినా విదేశీ బౌన్సీ పిచ్‌లపై కష్టంగా మారేది. యూరప్ దేశాల్లోని పిచ్‌లు ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. అక్కడ స్పిన్నర్ల కంటే పేస్ బౌలర్లే వికెట్ నిలుస్తారు. ఆ సమయంలో బౌలర్లకు మెలకువలు సాధించేందుకు వసతులు తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు కాలం మారింది. భారత క్రికెట్ బోర్డు ప్రపంచ అగ్ర బోర్డులో ఒక్కటిగా ఎదిగింది. ఎలాంటి వసతులు కావాలన్నా తమ ఆటగాళ్లకు అందిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ కోచ్‌లతో తగినంత శిక్షణలు అందిస్తోంది. మరోవైపు భారత ఆటగాళ్లు కూడా తమకు పర్సనల్ శిక్షకులను పెట్టుకొని మంచిగా రాటుదేలుతున్నారు. దానికి తగ్గట్టు క్రికెట్‌కు పెరిగిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ క్రేజ్‌లో భాగంగానే ధనాధన్ టోర్నీ ఐపిఎల్ పుట్టుకొచ్చింది. ఈ పొట్టి ఫార్మాట్ క్రికెట్‌తో భారత్‌లో క్రికెట్ ప్రేమికుల సంఖ్య మరింతగా పెరిగింది. ఈ ఆటవైపు ఎన్నో యువ ఆటగాళు ఆకర్షితులయ్యారు. క్రికెట్‌నే నమ్ముకున్న కొందరికి ఐపిఎల్ ద్వారా డబ్బులతో పాటు మంచి పేరు కుడా వచ్చింది. ఈ టోర్నీ కారణంగా చిన్న చిన్న ఊర్ల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలికివచ్చారు. ఒకప్పుడు బ్యాటింగ్‌కే మక్కువ చూపే ఆటగాళ్లు ఇప్పుడు బౌలింగ్ వైపు తమ కెరీర్‌ను మరల్చుకున్నారు. తాజాగా కొన్నేళ్లుగా భారత బౌలింగ్ విభాగం గొప్ప ప్రదర్శనలతో ఆకట్టుకొంటుంది. ఎలాంటి పిచ్ అయినా తమ పదునైన బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ల బరతం పడుతున్నారు. ఈ ఏడాది జరిగిన సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ పర్యటనలో భారత బౌలర్లు మెరుగ్గా రాణించారు. తాజాగా ఆస్ట్రేలియా తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో కూడా భా రత బౌలర్లు తమ అంచనాలకు తగ్గట్టు గొప్ప ప్రదర్శనలు చేస్తున్నారు. పరుగులు చేయడంలో బ్యాట్స్‌మెన్స్ విఫలమైనా భా రత బౌలర్లు మాత్రం కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమవుతున్నారు. తొలి టెస్టులో భారత జట్టు విజయం సాధించడంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారు. రెండో టెస్టులో కూడా భారత బౌలర్లు ఆసీస్‌ను కట్టడి చేసినా తక్కువ స్కోరును ఛేదించడంలో బ్యాట్స్‌మెన్స్ విఫలమయ్యారు. దీంతో భారత్ రెండో టెస్టును కోల్పోయింది. ఇక మూడో టెస్టులో బౌలర్లతో పాటు బ్యాట్స్‌మె న్‌ల కూడా రాణిస్తే తప్పనిసరిగా విజయం తమకే దక్కుతుందని భారత మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఆసీ స్ పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉండడంతో భారత్ మూడు ఫాస్ట్ బౌలర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలో దిగుతుంది. తొలి టెస్టులో స్పిన్నర్ అశ్విన్ చెలరేగి బౌలింగ్ చేశాడు. కానీ రెండో టెస్టుకు గాయం కారణంగా దూరమయ్యాడు. అతని స్థానంలో భారత్ వేరే స్పిన్నర్‌ను తీసుకోకపోవడం పెద్ద పొరపాటైంది. పిచ్‌ను అంచనా వేయడంలో భారత కెప్టెన్ కోహ్లీతో పాటు కోచ్ రవిశాస్త్రి పప్పులో కాలేశాడు. వారి తప్పుడు నిర్ణయం భారత్‌కు పెద్ద షాకిచ్చింది. మరోవైపు పిచ్‌ను పూర్తిగా వినియోగించుకుని విజృంభించి బౌలింగ్ చేసిన ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
తొలి టెస్టులో చెలరేగిన అశ్విన్, బుమ్రా…
ఆడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత బౌలర్లు రవిచంద్ర అశ్విన్, జస్ప్రీత్ బుమ్రాలు రెండు ఇన్నింగ్స్‌లలో చెరో ఆరు వికెట్లతో చెలరేగారు. అయితే ఈ టెస్టులో మొదటి ఓవర్ వేసిన ఇషాంత్ శర్మ మూడో బంతికే విధ్వంసకర బ్యాట్స్‌మన్ అరోన్ ఫించ్ (0)ను ఖాతా తెరువకుండానే పెవిలియన్ పంపాడు. తర్వాత విజృంభించిన స్పిన్నర్ అశ్విన్ తన స్పిన్ మహిమతో ఆసీస్ బ్యాట్స్‌మెన్స్‌పై విరుచుకుపడ్డాడు. ప్రమాదకరంగా మారుతున్న రెండో వికెట్ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. అశ్విన్ ధాటికి ఆసీస్ మరో ఓపెనర్ మార్కుస్ హారిస్ (26), తర్వాత సీనియర్ బ్యాట్స్‌మన్ షాన్ మార్ష్ (2) పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఆవెంటనే కుదురుగా ఆడుతున్న ఆసీస్ కీలక బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖవాజా (28)ను వికెట్ కీపర్ పంత్‌చే క్యాచ్ పట్టించి పెవిలియన్ పంపాడు. తొలి ఇన్నింగ్స్‌లో 34 ఓవర్లు వెసిన అశ్విన్ 57 పరుగులిచ్చి ముఖ్యమైన మూడు వికెట్లు పడగొట్టాడు. మరోవైపు జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్ బ్యాట్‌మెన్‌ను హడలెత్తించాడు. ఆసీస్ రెండో రెండో టాప్ స్కోరర్ హాండ్‌కొంబ్ (34)ను తెలివైన బంతితో ఔట్ చేశాడు. చివర్లో పిచ్‌పై పాతుకుపోయిన కమ్మిన్స్, మిచెల్ స్టార్క్‌లను పెవిలియన్ పంపి భారత్‌ను ఆదుకున్నాడు. బుమ్రా 47 పరుగులిచ్చి 3 వికెట్లు దక్కించుకున్నాడు. మరోవైపు మహ్మద్ షమీ కూడా వీరికి అండగా నిలిస్తూ కీలకమైన రెండు వికెట్లు తీశాడు. మ్యాచ్‌కే ప్రమాదకరంగా మారిన ఆసీస్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ ట్రావిస్ హెడ్ (72)ను అద్భుతమైన బంతితో ఔట్ చేసి భారత శిబిరంలో ఉత్సాహాన్ని నింపాడు. తర్వాత హేజిల్‌వుడ్ వికెట్‌ను తీసిన షమీ ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌ను 235 పరుగులకు ముగించాడు. దీంతో టీమిండియాకు స్వల్ప ఆధిక్యం లభించింది. మరోవైపు మ్యాచ్ తొలి వికెట్ తీసిన ఇషాంత్ శర్మ తర్వాత ఆస్ట్రేలియా సారథి టిమ్ పైన్ (5) పరుగులకే ఇంటి దారి చూపెట్టి తన ఖాతాలో రెండు వికెట్లు వేసుకున్నాడు. అనంతరం జరిగిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో కూడా అశ్విన్, బుమ్రా, మహ్మద్ షమీ విజృంభించి బౌలింగ్ చేశారు. ఆరంభం నుంచి దూకుడుగా బౌలింగ్ చేసిన అశ్విన్ ఆసీస్ స్కోరు 28 పరుగుల వద్ద ఓపెనర్ ఫించ్ వికెట్ పడగొట్టి బోణి చేశాడు. తర్వాత కొద్ది సేపటికే ఉస్మాన్ ఖవాజా (8) పరుగుల వద్ద ఔట్ చేసి తన ఖాతాలో రెండో వికెట్ వేసుకున్నాడు. మరోవైపు బుమ్రా కూడా కీలక వికెట్లు తీస్తూ ఆసీస్‌ను కట్టడి చేశాడు. బుమ్రా ధాటికి ఆసీస్ టాప్ స్కోరర్లు షాన్ మార్ష్ (60), టిమ్ పైన్ (41) పెవిలియన్ చేరారు. చివర్లో తన మూడో వికెట్‌గా కమ్మన్స్ (28)ను ఔట్ చేసి విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఇక మహ్మద్ షమీ కూడా అద్భుతమైన బౌలింగ్‌తో ఓపెనర్ హారిస్, హాండ్స్‌కొంబ్, మిచెల్ స్టార్క్ వికెట్లను పడగొట్టాడు. ఈ భారత త్రయం తలో మూడు వికెట్లు తీసి భారత్‌కు 31 పరుగుల చిరస్మరణీయ విజయాన్ని అందించారు.
రెండో టెస్టులో విజృంభించిన షమీ…
తొలి టెస్టు గెలిచిన జోరును రెండో టెస్టులో కూడా భారత బౌలర్లు కొనసాగించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇషాంత్ శర్మ నాలుగు వికెట్లతో సత్తా చాటితే.. రెండో ఇన్నింగ్స్‌లో మహ్మద్ షమీ విజృంభించి ఆరు వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఓపెనర్లు శుభారంభం చేస్తూ తొలి వికెట్‌కు 100 పరుగులు సాధించారు. ఆరంభంలో వికెట్లు తీయడంలో విఫలమైన భారత బౌలర్లు తర్వాత పుంజుకున్నారు. 112 పరుగుల వద్ద ఆసీస్ మొదటి వికెట్ పడగొట్టారు. ఈ వికెట్‌ను బుమ్రా తన ఖాతాలో వెసుకొని ఆసీస్ పతనం మొదలుపెట్టాడు. తర్వాత ఉమేశ్ యాదవ్ తెలివైన బంతితో ఉస్మాన్ ఖవాజాను ఔట్ చేశాడు. ఆ వెంటనే కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న ఓపెనర్ హారిస్ (70) పరుగులను బోల్తా కొట్టించిన హనుమ విహారి తన వికెట్ల ఖాతాను తెరిచాడు. అశ్విన్ గాయంతో తప్పుకోవడంతో అతని స్థానంలో తెలుగబ్బాయి విహారికి రెండో టెస్టులో చోటు లభించింది. ఆ కొద్ది సమయానికే మరో సెట్ బ్యాట్స్‌మన్ షాన్ మార్ష్‌ను విహారి పెవిలియన్ పంపాడు. తర్వాత బుమ్రా ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ (38) పరుగులవద్ద వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. చివర్లో ఇషాంత్ శర్మ చెలరేగి హాండ్స్‌కొంబ్, ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్, హేజిల్ వుడ్ వికెట్లను పడగొట్టడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ విరాట్ కోహ్లీ (123) అద్భుతమైన శతకం సాధించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులు చేసింది. అయితే ఈ సారి ఆసీస్‌కు ఆధిక్యం లభించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియాకు ఆరంభం మంచిగానే లభించినా తర్వాత పుంజుకున్న భారత బౌలర్లు ఆసీస్‌ను 243 పరుగులకే కట్టడి చేశారు. ముఖ్యంగా మహ్మద్ షమీ నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్ బ్యాట్స్‌మెన్స్‌పై ఎదురుదాడికి దిగాడు. అరోన్ ఫించ్ (25), ఉస్మాన్ ఖవాజా (72), షాన్ మర్ష్ (5), ట్రావిస్ హెడ్ (19), టిమ్ పైన్ (37), నాథన్ లియాన్ (5) పరుగులను షమీ తన విధ్వంసర బౌలింగ్‌తో పెవిలియన్ పంపి భారత్‌ను ఆదుకున్నాడు. మరోవైపు జస్ప్రీత్ బుమ్రా కూడా మూడు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాకు పెద్ద దెబ్బ తీశాడు. హారిస్, కమ్మిన్స్, మిచెల్ స్టార్క్ బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యారు. హాండ్స్‌కొంబ్ వికెట్‌ను ఇషాంత్ శర్మ దక్కించుకోవడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ కంటే తక్కువ స్కోరుకే పరిమితమయింది. కానీ ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన భారత జట్టు లక్ష్యఛేదనలో విఫలమైంది. బౌలర్లు మెరుగ్గా రాణించిన బ్యాట్‌మెన్స్ మాత్రం తమ అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోవడంతో భారత్‌కు 146 పరుగులు భారీ ఓటమి దక్కింది. ఇక ఈ నెల 26 నుంచి మెల్‌బోర్న్ వెదికగా జరుగనున్న మూడో టెస్టులో భారత జట్టు ప్రతీకారం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ సారి బౌలర్లతో పాటూ బ్యాట్స్‌మన్లు కూడా రాణిస్తే విజయం మనకే దక్కుతుంది.