టాప్ కోల్పోయిన భారత బౌలర్ జస్ప్రీత్
బ్యాటింగ్ విభాగంలో ఆగ్రస్తానంలోనే కోహ్లీ
దుబాయి : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) విడుదల చేసిన తాజా వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానం కోల్పోయాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన బుమ్రా.. ఏకంగా 45 రేటింగ్ పాయింట్లు కోల్పోయి రెండో స్థానంకు పడిపోయాడు. న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బోల్ట్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. చేతి గాయం కారణంగా భారత్‌తో వన్డే సిరీస్ ఆడకపోయినా ట్రెంట్ బోల్ట్ 727 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం బుమ్రా ఖాతాలో 719 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. బుమ్రా మూడు వన్డేల్లోనూ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఓ వన్డే సిరీస్‌లో బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయకపోవడం ఇదే తొలిసారి. ముజీబుర్ రహ్మాన్ (అఫ్గానిస్థాన్), కగిసో రబాడ (సౌతాఫ్రికా), ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) టాప్-5లో నిలిచారు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ముగిసిన తరువాత ఐసీసీ విడుదల చేసిన తాజా వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు టాప్‌లో నిలిచారు. కోహ్లీ 869 రేటింగ్ పాయింట్లతో నంబర్‌వన్ ర్యాంకులో నిలవగా.. రోహిత్ 855 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టుల్లోను కోహ్లీ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మంగళవారం విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో 928 పాయింట్లతో కోహ్లీ అగ్ర స్థానంలో నిలిచాడు. ఐసీసీ వన్డే బ్యాట్స్‌మెన్ల జాబితాలో పాకిస్తాన్ ఆటగాడు బాబర్ అజామ్ (829 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచాడు. టీమిండియాతో సిరీస్‌లో అదరగొట్టిన కివీస్ సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ (828) నాలుగులో, ఫాఫ్ డుప్లెసిస్ (803) ఐదవ స్థానంలో కొనసాగుతున్నారు. కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యార్ తమతమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మూడు స్థానాలు ఎగబాకి 7వ ర్యాంకుకు చేరుకున్నాడు. ప్రస్తుతం జడేజా ఖాతాలో 246 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ (301) ప్రపంచకప్ హీరో బెన్ స్టోక్స్ (294)ను అధిగమించి ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.
బోల్ట్ పైకి.. బుమ్రా కిందికి..
RELATED ARTICLES