11 గంటల పాటు శ్రమించినా దక్కని ఫలితం
సంజయ్ సాయివర్ధన్ కథ విషాదాంతం
మిన్నంటిన తల్లిదండ్రులు రోదనలు
కంటతడి పెట్టిన మెదక్ ఎంఎల్‌ఎ పద్మ
ప్రజాపక్షం/మెదక్/పాపన్నపేట: మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని పోడ్చన్‌పల్లి గ్రామ శివారులో బుధవారం సాయంత్రం బోరుబావిలో ప్రమాదవశాత్తు పడ్డ సంజయ్ సాయివర్ధన్‌ను రక్షించడానికి జిల్లా అధికార యంత్రాంగం, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. బాలుడు బావిలో పడగానే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పాపన్నపేట ఎస్‌ఐ ఆంజనేయులు, తహసీల్దార్ బలరాం, జిల్లా అధికారులకు విషయం తెలియజేశారు. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి, జిల్లా ఎస్‌పి చందన దీప్తి సంఘటనా స్థలానికి చేరుకోవడం చకచకా జరిగిపోయాయి. బాలుని ఎలాగైనా కాపాడాలని తలంపుతో హైదరాబాద్, గుంటూరు నుండి ఎన్‌డిఆర్‌ఎఫ్‌ను రప్పించగా, వారు రంగంలోకి దిగి బోరుబావికి సరిసమానంగా జెసిబిలతో బావిని తవ్వించడం, బాలుడికి ఆక్సిజన్ అందించి చేసిన శ్రమంతా వృథా అయింది. బుధవారం సాయంత్రం నుండి గురువారం తెల్లవారుజాము 4:32 గంటల వరకు శ్రమించి సంజయ్ సాయి వర్ధన్‌ను బయటకు తీయగా చివరకు విగత జీవిగా మిగిలాడు. తెల్లవారు జామున చిన్నారి శవాన్ని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్ట నిర్వహించారు. అనంతరం వారి స్వగ్రామమైన పటాన్‌చెరు మండలం పాశమైలారంలో అంత్యక్రియలు నిర్వహించారు.
అధికారుల అంచనా నిజమైంది
బోరు బావి 150 అడుగుల మేర వేయగా, కేసింగ్ 25 ఫీట్లు వేసి తీసివేశారు అని తెలియడం, బాలుడు బోరుబావిలో పడగానే కేకలు వేయడంతో బంధువులు చీర, దోతిని ఒకటిగా చేసి బోరుబావిలో వేయగా, సాయి వర్ధన్ దాన్ని పట్టుకొని వదిలేయడం తెలుసుకున్న అధికారులు.. బాలుడు కేవలం 25 అడుగుల లోపల ఉండి ఉంటాడని భావించగా, ఎట్టకేలకు అదే నిజమయింది. బోర్ బావికి సమాంతరంగా కేవలం 17 అడుగుల వద్దే బాలుడు మట్టిలో కూరుకుపోయి ఊపిరాడక విగత జీవిగా మారాడు.
రాత్రంతా కునుకు లేకుండా గడిపిన ఎమ్మెల్యే
బాలుడు బోరుబావిలో పడ్డాడని తెలుసుకున్న మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి తోపాటు జిల్లా అధికార యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైనప్పటి నుండి పూర్తయ్యేవరకు కంటి మీద కునుకు లేకుండా గడిపారు. ఎమ్మెల్యే ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బందితో పరిస్థితి సమీక్షిస్తూ రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యేవరకు గడపగా, కలెక్టర్ ధర్మారెడ్డి ఇతర జిల్లా అధికారులు కూడా సాయివర్ధన్ బయటకు తీసే వరకు ఘటనాస్థలి నుంచి కదల లేదు. అయితే పొడ్చన్‌పల్లి విషాదఘటనపై ఎంఎల్‌ఎ పద్మాదేవేందర్‌రెడ్డి కంటతడి పెట్టారు. నీళ్లు పడని బోరుబావులను రైతులు, స్థానిక అధికారులు పూడ్చివేయాలని వేడుకున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
తల్లడిల్లిన తల్లిదండ్రులు
బోరు బావి నుండి ప్రాణాలతో తిరిగి వస్తాడు అనుకున్న తమ కుమారుడు సంజయ్ సాయి వర్ధన్ మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు నవీన, గోవర్ధన్ తల్లడిల్లిపోయారు. వారి రోదనలతో అక్కడి ప్రాంతమంతా హృదయవిదారకంగా మారింది. శవాన్ని బయటకు తీసిన అనంతరం శవ పరీక్ష నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం వారి సొంత గ్రామం పాశమైలారం లో అంత్యక్రియలు నిర్వహించారు.
చర్యలు తీసుకుంటాం : కలెక్టర్
బోరుబావి ఘటన దురదృష్టకరమని కలెక్టర్ ధర్మారెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బోరుబావికి అనుమతి లేదని, రిగ్గు ఓనర్‌పై కూడా చర్య తీసుకుంటామన్నారు. కాగా, పోడ్చన్ పల్లి విషాద ఘటనకు కారణమైన రిగ్గు యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు పాపన్నపేట ఎస్‌ఐ ఆంజనేయులు పేర్కొన్నారు. రిగ్గుయజమని భాగ్యనగరంలోని హయత్ నగర్‌కు చెందిన జంగయ్యపై క్రిమినల్ కేసు నమోదు చేసి నట్లు తెలిపారు.
స్థానికంగా రెవెన్యూ అధికారులు ఉండాలి
గ్రామాల అధివృద్ధి, ప్రజలకు అందుబాటులో ఉండవలిసిన అధికారులు స్థానికంగా ఉండకపోవడంతో రిగ్గు యజమానుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుందని పలువురు ఆరోపిస్తున్నారు. దొంగచాటున వ్యాపారాలు నిర్వహించే వారికి అధికారులు గ్రామాల్లో ఉండరనే ధైర్యంతో తాము ఆడిందే అటగా మారడం మూలంగానే చిట్టి ప్రాణాలు గాలిలో కలసి పోయాయని గ్రామస్థులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. చీకటి వ్యాపారాలు నిర్వహించే వారికి అధికారుల అండదండలు ఉండడం మూలంగానే వ్యాపారాలు మూడు పువ్వులు అరుకాయలుగా నడుస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇకనైనా జిల్లా యంత్రాంగం కలుగ చేసుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకొంటున్నారు.